You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జెఫ్రీ ఎప్‌స్టీన్: వందలమంది అమ్మాయిలను లైంగికంగా వేధించిన ఈ సంపన్నుడు డిగ్రీ పాస్ కాని లెక్కల మాస్టర్
- రచయిత, అమృతా కదమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరుకుగా ఉన్న మెట్ల మార్గంలో మిషెల్ నడుస్తున్నారు. ఆమె పక్కనే ఉన్న గోడ మీద నగ్నంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. మెట్లు ఎక్కిన తర్వాత ఆమె విశాలమైన బెడ్ రూమ్‌కు చేరుకున్నారు. ఆ గదిలో వెలుతురు మసకగా ఉంది. గది చల్లగా ఉంది. మసాజ్ టేబుల్, టైమర్ ఉన్నాయి.
కాసేపటి తర్వాత బూడిద రంగు జుట్టున్న వ్యక్తి టవల్ చుట్టుకుని లోపలకు వచ్చారు. ఆయన మసాజ్ టేబుల్ మీద పడుకున్నారు. తనకు మసాజ్ చేయాలని మిషెల్‌ను అడిగారు. ఆ తర్వాతి అరగంటలో జరిగిన పరిణామాలతో మిషెల్ నిర్ఘాంతపోయారు.
పోలీసులు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేశారు. ఆమె మైనర్ కాబట్టి, పోలీసు రికార్డుల్లో ఆమె పేరు జేన్ డో అని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఇంకా అనేక మంది జేన్ డోలు బయటికి వచ్చారు. జేన్ డో2, జేన్ డో3, జేన్ డో4 ... జేన్ డో 102, జేన్ డో 103 కూడా.
అమ్మాయిల పేర్లు మారుతున్నాయి. కానీ కథ అంతా ఒకేలా ఉంది. అయితే వీటన్నింటినీ కలిపే ఒక లింక్ కూడా ఉంది. అదే...బూడిద రంగు జుట్టు వ్యక్తి. ఆయన పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్.
కోర్ట్నీ వైల్డ్ ఓ మామూలు స్కూల్ స్టూడెంట్. లేక్‌వర్త్ మిడిల్ స్కూల్ స్క్వాడ్‌కు చీర్ లీడర్. ట్రంపెట్ బ్యాండ్‌లో సభ్యురాలు. తెలివైనది.
అయితే ఆమె మాదక ద్రవ్యాలకు బానిసగా మారారు. తర్వాత స్ట్రిప్పర్ ( దుస్తులు తొలగిస్తూ డాన్స్ ఫెర్పార్మ్ చేసే వ్యక్తి) అయ్యారు.
జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను కలిసిన తర్వాత మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రం(రిహాబిలిటేషన్ సెంటర్)లో చికిత్స పొందుతున్నారు.
ఆమెకు 14 ఏళ్లున్నప్పుడు ఎప్‌స్టీన్‌ను కలిశారు. ఆ తర్వాత తన వయసున్న స్కూలు విద్యార్థినులను ఎప్‌స్టీన్ దగ్గరకు పంపించారు. ఆమెకు 16 ఏళ్లు వచ్చేసరికి కనీసం 50-60 మంది బాలికలను ఆమె ఎప్‌స్టీన్ దగ్గరికి పంపించారు.
ఇవి కేవలం రెండు ఉదాహరణలు. జెఫ్రీ ఎప్‌స్టీన్ నుంచి లైంగిక దోపిడీకి గురైన బాధితులు ఇంకా ఉన్నారు.
"నేను లైంగిక నేరస్థుడిని కాదు. నియమాలు ఉల్లంఘించిన నేరస్థుడిని మాత్రమే" అని జెఫ్రీ ఎప్‌స్టీన్ 2011లో న్యూయార్క్ పోస్ట్‌తో అన్నారు.
"ఒక వ్యక్తి హత్య చేయడానికి, దొంగతనం చేయడానికి మధ్య తేడా ఉంది" అని ఆయన అన్నారు.
తాను దోషినని ఒప్పుకునేందుకు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఇష్టపడలేదు. అయితే, ఆయన అభిప్రాయంతో న్యాయ వ్యవస్థకు అవసరం లేదు.
"శక్తివంతమైన స్నేహితుల జాబితా"
2019 ఆగస్టు 10న జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణించేనాటికి ఆయన లైంగిక అక్రమ రవాణా కేసులో బెయిల్ దొరక్క న్యూయార్క్ జైలులో ఉన్నారు.
పదేళ్ల కిందట వ్యభిచారం కోసం మైనర్ బాలికకు డబ్బులు ఇచ్చినందుకు కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఆయనను లైంగిక నేరస్థుడిగా ప్రకటించింది.
మైనర్ బాలికలతో సెక్స్ చేశారని, అందుకోసం ఒక నెట్‌వర్క్ నడుపుతున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ 'ఫిల్తీ రిచ్'లో ఎప్‌స్టీన్ బాధితులు అనేకమంది, తమ అనుభవాలను చెప్పడానికి ముందుకు వచ్చారు.
మయామి హెరాల్డ్ పత్రిక దీని గురించి వివరణాత్మక వార్తా ధారావాహికను ప్రచురించింది.
ఈ కేసుల వివరాలన్నీ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో ప్రపంచం నిర్ఘాంత పోయింది.
ఎందుకంటే ఇందులో సంపన్నుడైన అమెరికన్, మైనర్ బాలికల మీద లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి అనే దానికంటే క్లిష్టమైన అంశాలు ఎన్నో ఉన్నాయి.
ఎప్‌స్టీన్ స్నేహితుల జాబితాలో రాజకీయాలు, ఆర్థిక శాస్త్ర నిపుణులు, క్రీడాకారులు, సినీ సెలబ్రిటీలు, ఇంకా అనేకమంది ప్రముఖులు ఉన్నారు.
"ఎప్‌స్టీన్ శక్తివంతమైన వ్యక్తి" అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు కూడా ఎప్‌స్టీన్‌తో ముడిపడి ఉంది.
దీని కారణంగా కొన్ని రోజుల క్రితం బ్రిటన్ రాజకుటుంబం ఆయన రాజ బిరుదులను తొలగించింది.
ఎప్‌స్టీన్ "శక్తివంతమైన స్నేహితుల" పేర్ల జాబితా చాలా పెద్దది
2019 ఆగస్టు 10న ఎప్‌స్టీన్ జైలులో చనిపోయారు. కానీ ఆ తర్వాత కూడా ఆయన పేరు వార్తల్లో నిలిచింది.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రముఖులు
కొన్నిరోజులుగా ఎప్‌స్టీన్ ఫైల్స్ అమెరికాలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల రాజకీయాల్లో కూడా సాధారణ ప్రజల్లో చర్చనీయాంశం అయ్యాయి.
ఎప్‌స్టీన్ ఫైళ్లను బహిర్గతం చేసే బిల్లుపై అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ బిల్లు ప్రకారం ఎప్‌స్టీన్ దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా న్యాయశాఖ 30 రోజుల్లోగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ 30 రోజుల గడువు డిసెంబర్ 19, 2025 తో ముగిసింది.
విడుదల కాని పత్రాల్లో ఏముందో ఇప్పటికీ తెలియదు. కొన్నేళ్లుగా వేల పేజీల్లో ఉన్న సమాచారం బయటకు వచ్చింది. అందులో ఎప్‌స్టీన్‌తో పాటు శక్తివంతులైన ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యుల వివరాలు బహిర్గతం అయ్యాయి.
డిసెంబర్ 3న, హౌస్ ఓవర్‌సైట్ కమిటీలోని డెమొక్రాట్లు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు వర్జిన్ ఐలండ్స్‌లో ఉన్న ఇంటికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. ఈ ఫోటోల్లోని దృశ్యాలు గతంలో ఎవరూ చూడలేదు. ఆ ఇంట్లో అనేక బెడ్‌రూమ్‌లు, గోడలపై వివిధ రకాల మాస్క్‌లు ఉన్నాయి.
ఇప్పుడు, డిసెంబర్ 19న బయటపడిన ఎప్‌స్టీన్ ఫైళ్లలోని అంశాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది.
ఎప్‌స్టీన్ ఫైళ్లు బయటికొస్తే మరాఠీ వ్యక్తి ప్రధానమంత్రి అవుతారని మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు ముందు అసలు ఎప్‌స్టీన్ ఎవరో చూద్దాం.
మరణం తర్వాత కూడా ఆయన ఆత్మ ఇప్పటికీ చాలామందిని వెంటాడుతోంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దగ్గర్నుంచి ప్రపంచ ధనవంతుల్లో ఒకరిగా ఎలా మారారు? మైనర్ బాలికలను లైంగికంగా దోపిడీ చేయడానికి ఒక పెద్ద రాకెట్‌ను ఎలా సృష్టించారు?
ధనవంతుడైన ఆర్థికవేత్తగా ఎదిగిన లెక్కల మాస్టర్
న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన ఎప్‌స్టీన్, 1970లలో నగరంలోని ప్రైవేట్ డాల్టన్ స్కూల్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ బోధించారు. ఆయన ఫిజిక్స్ చదివినప్పటికీ డిగ్రీ పూర్తి చేయలేదు.
తాను కూపర్ యూనియన్ కాలేజీలో చేరానని చెప్పుకున్న ఎప్‌స్టీన్, డిగ్రీ పూర్తి చేయలేదని అంగీకరించారు.
డిగ్రీ కూడా పూర్తి చేయకుండానే ఆయనకు టీచర్ ఉద్యోగం ఎలా వచ్చిందనేది మిస్టరీగా మిగిలింది.
అయితే లెక్కల్లో ఎప్‌స్టీన్‌కున్న ప్రతిభను గుర్తించిన ఆయన విద్యార్ధి తండ్రి ఒకరు వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ బేర్ స్టెర్న్స్‌లోని సీనియర్ భాగస్వామికి పరిచయం చేశారు.
కేవలం 4 ఏళ్లలో ఎప్‌స్టీన్ ఆ సంస్థలో పార్ట్‌నర్ అయ్యారు. 1982 నాటికి, ఆయన తన సొంత సంస్థ జె.ఎప్‌స్టీన్ అండ్ కంపెనీని ప్రారంభించారు.
ఆ కంపెనీ బిలియన్ డాలర్లకు పైగా క్లయింట్ ఆస్తులను నిర్వహించింది.
ఎప్‌స్టీన్ కొద్దికాలంలోనే డబ్బు ఖర్చు చేయడం ప్రారంభించారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఒక విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఇది సంపన్నులుండే ప్రాంతం. డోనల్డ్ ట్రంప్‌కు ఇక్కడ విలాసవంతమైన ఇల్లు ఉంది.
ఎప్‌స్టీన్‌కు న్యూయార్క్‌లో ఇల్లు, న్యూ మెక్సికోలో ఫామ్‌హౌస్, ప్రైవేట్ జెట్, ప్రపంచవ్యాప్తంగా ఇతర నగరాల్లో ఆస్తులు ఉన్నాయి.
సంపద సమకూరిన తర్వాత ఆయన ప్రముఖులు, కళాకారులు, రాజకీయ నాయకులతో సమయం గడపడంపై దృష్టి పెట్టారు.
"నాకు జెఫ్ 15 సంవత్సరాలుగా తెలుసు. చాలా మంచి వ్యక్తి" అని డోనల్డ్ ట్రంప్ 2002లో న్యూయార్క్ మ్యాగజీన్‌తో చెప్పారు.
"అతనితో టైమ్ గడపడం ఫన్నీగా ఉంటుంది. నేను అందమైన మహిళలను ఇష్టపడినట్లుగానే ఆయన కూడా ఇష్టపడతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారిలో చాలామంది చాలా చిన్న వయసువారు" అని ట్రంప్ చెప్పారు.
2000ల ప్రారంభంలో ఎప్‌స్టీన్ మొదటిసారి అరెస్టు కావడానికి కొన్ని సంవత్సరాల ముందు, తామిద్దరం విడిపోయామని ట్రంప్ తరువాత అన్నారు. ఎప్‌స్టీన్‌కు, తనకు ఉన్న సంబంధాలలో తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు.
"ఎప్‌స్టీన్ మహిళా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించినందుకు ట్రంప్ ఆయనను తన క్లబ్ నుండి వెళ్ళగొట్టారు" అని వైట్ హౌస్ పేర్కొంది.
2002లో, ఆయన మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో పాటు నటులు కెవిన్ స్పేసీ, క్రిస్ టక్కర్‌లను ఒక ప్రైవేట్ జెట్‌లో ఆఫ్రికాకు తీసుకెళ్లారు.
2003లో, అప్పటి చిత్ర నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌తో కలిసి న్యూయార్క్ మ్యాగజీన్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. అయితే అది సక్సెస్ కాలేదు. అదే ఏడాది ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి 30 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.
ఆయనకు బ్రిటిష్ రాజకీయ నాయకుడు పీటర్ మాండెల్సన్ తో కూడా స్నేహం ఉండేది. ఈ స్నేహానికి తాను చింతిస్తున్నానని మాండెల్సన్ తరువాత చెప్పారు. ఎప్‌స్టీన్‌తో స్నేహం కారణంగా 2025లో ఆయన అమెరికా రాయబారి పదవిని కోల్పోయారు.
ఎప్‌స్టీన్ కేసులో మైనర్ బాలికలకు శిక్షణ ఇచ్చి, వారిని లైంగికంగా అక్రమంగా రవాణా చేసినందుకు ఘిస్లెయిన్ మాక్స్‌వెల్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష పడింది.
'ఎలా బయట పడింది'
2005లో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు, ఎప్‌స్టీన్ తమ కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. పోలీసులు ఎప్‌స్టీన్ ఇంటిని సోదా చేసినప్పుడు, ఇంట్లో చాలాచోట్ల ఆ బాలిక ఫోటోలు కనిపించాయి.
ఎప్‌స్టీన్ చాలా ఏళ్లుగా మైనర్ బాలికలను లైంగికంగా దోపిడీ చేస్తున్నాడని మయామి హెరాల్డ్ వార్తాపత్రిక ప్రచురించింది.
"ఇది కేవలం ఒక అమ్మాయి ఆరోపణలు చేయడం, ఎప్‌స్టీన్ వాటిని తిరస్కరించడం మాత్రమే కాదు. 50 మందికి పైగా అమ్మాయిలు ముందుకు వచ్చారు, వారందరిదీ ఒకే కథ" అని పామ్ బీచ్ పోలీస్ చీఫ్ మైఖేల్ రీటర్ తెలిపారు.
"అతను అమ్మాయిల పట్ల తనకున్న వ్యామోహాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. అతనిపై ఆరోపణలు వచ్చినప్పుడు, ఒకసారి నాతో ‘నేనేం చేయను, నాకు చిన్న వయసు అమ్మాయిలంటే ఇష్టం" అన్నాడు’’ అని కాలమిస్ట్ మైఖేల్ వోల్ఫ్ న్యూయార్క్ మ్యాగజీన్‌తో అన్నారు.
అయితే ఎప్‌స్టీన్ ఎప్పుడూ సరైన విచారణను ఎదుర్కోలేదు. 2007లో ప్రాసిక్యూటర్లు ఆయనతో ఒక ప్లీ డీల్‌కు అంగీకరించారు. నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ అని చెప్పే ఈ ఒప్పందంతో ఆయనకు పడాల్సిన జీవిత ఖైదు శిక్ష కాస్తా 18 నెలల జైలు శిక్షకు కుదించారు. అందులోనూ వర్క్ రిలీజ్ ప్రోగ్రాం కింద ఆయన రోజుకు 12 గంటలు, వారానికి ఆరో రోజుల చొప్పున తన ఆఫీసులో పని చేసుకోవడానికి అనుమతించారు. దీని సాయంతో ఆయన 13 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
ఎప్‌స్టీన్ నేరాలను కప్పిపుచ్చడానికి అటార్నీ జనరల్ అలెగ్జాండర్ అకోస్టా సహాయం చేశారని వార్తాపత్రికలు ఆరోపించాయి.
ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో బయటకు రాలేదు. ఎప్‌స్టీన్ ఆస్తులను జప్తు చేయలేదు.
2008 నుంచి ఎప్‌స్టీన్‌ను న్యూయార్క్ సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీలో లెవల్ త్రీలో నమోదు చేశారు. అంటే ఆయన మళ్ళీ నేరం చేసే అవకాశం ఉందని అర్ధం. ఇక ఆయన జీవితాంతం ఆ జాబితాలో ఉంటారు.
కానీ, దోషిగా తేలిన తర్వాత కూడా ఎప్‌స్టీన్ తన ఆస్తులు, సంపదలను నిలుపుకున్నారు.
ప్రిన్స్ ఆండ్రూ వ్యవహారం
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II మూడో కొడుకు ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్ విండ్సర్ 2010 డిసెంబర్‌లో న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో ఎప్‌స్టీన్‌తో కలిసి కనిపించారు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది.
ఎప్‌స్టీన్ తనకు తెలుసని 2019 నవంబర్‌లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్ ఆండ్రూ చెప్పారు.
2000ల ప్రారంభంలో, 17 ఏళ్ల వయసులో ఉన్న తనతో ఆండ్రూ లైంగిక సంబంధం పెట్టుకునేందుకు ఒత్తిడి చేశారని వర్జీనియా గియుఫ్రే అనే మహిళ ఆరోపించారు.
ఆమెతో లైంగిక సంబంధం విషయాన్ని ఆండ్రూ ఖండించారు. లండన్‌లో ఆమెతో కలిసి ఫోటో దిగిన విషయం తనకు గుర్తు లేదని చెప్పారు.
2022లో, లైంగిక వేధింపుల కేసును పరిష్కరించడానికి గియుఫ్రేకు ఆండ్రూ లక్షల రూపాయలు చెల్లించినట్లు తేలింది.
2019 జులై 6న ఎప్‌స్టీన్‌ను న్యూయార్క్‌లో అరెస్ట్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను నిర్దోషినని వాదించారు.
చివరిసారిగా జూలై 31, 2019న కోర్టుకు హాజరైనప్పుడు, ఆయన ఒక సంవత్సరం పాటు జైలులో ఉంటారని స్పష్టమైంది.
అయితే ఎప్‌స్టీన్ కోర్టు విచారణను ఎదుర్కోలేదు. ఎందుకంటే 2019 ఆగస్టులో ఆయన జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.
'మాక్స్‌వెల్ కేసు'
ఎప్‌స్టీన్ మరణం తర్వాత, ఆయన మాజీ ప్రేయసి ఘిస్లెయిన్ మాక్స్‌వెల్ వెలుగులోకి వచ్చారు.
మైనర్ బాలికలపై వేధింపులకు ఆమె ఎప్‌స్టీన్‌కు సాయం చేశారు. ఎప్‌స్టీన్ లైంగిక అవసరాల కోసం వారిని ఎంపిక చేయడంతో పాటు మరికొన్ని ఆరోపణల మీద న్యూ హాంప్‌షైర్‌లోని ఆమె ఇంట్లో 2020 జులైలో పోలీసులు అరెస్ట్ చేశారు.
2021 డిసెంబర్‌లో న్యూయార్క్ నగర జ్యూరీ ఆరు ఆరోపణలలో ఐదు ఆరోపణల కింద ఆమెను దోషిగా నిర్ధరించింది. వాటిలో మైనర్ బాలికల లైంగిక అక్రమ రవాణా అత్యంత తీవ్రమైన అభియోగం. కోర్టు ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న మాక్స్‌వెల్‌ను, బిల్ క్లింటన్, ఆండ్రూతో సహా అనేకమంది ధనవంతులకు ఎప్‌స్టీన్ పరిచయం చేశారు.
మాక్స్‌వెల్, ఎప్‌స్టీన్ మధ్య ప్రేమాయణం కొంతకాలమే సాగినప్పటికీ, వారిద్దరూ చాలా కాలం కలిసిపని చేశారు.
ఎప్‌స్టీన్ పామ్ బీచ్ భవనంలోని మాజీ ఉద్యోగులు మాక్స్‌వెల్ అక్కడ హౌస్ మేనేజర్‌గా వ్యవహరించేవారని చెప్పారు. ఆమె సిబ్బందిని పర్యవేక్షించేవారని, ఆర్థిక వ్యవహారాలు చూసేవారని కోర్టు పత్రాలు చెబుతున్నాయి.
కోర్టు ఆమెను దోషిగా నిర్ధరించిన తర్వాత మాక్స్‌వెల్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
‘‘జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను కలవడం నా జీవితంలో జరిగిన అతి పెద్ద తప్పు’’ అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)