You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రొమాన్స్ స్కామ్, అశ్లీల చిత్రాలతో బ్లాక్‌మెయిల్ ముఠాలపై స్టింగ్ ఆపరేషన్.. వందల మంది అరెస్ట్
- రచయిత, వైక్లిఫ్ ముయియా, నటాషా బూటీ
పద్నాలుగు ఆఫ్రికన్ దేశాల్లో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో, దాదాపు 260 మంది అనుమానిత సైబర్ మోసగాళ్లను అరెస్టు చేశారు పోలీసులు.
యూకే నిధులతో, ఇంటర్‌పోల్ ఒక ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాలను లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ ముఠాలు రొమాన్స్ స్కామ్స్ (ప్రేమ పేరుతో మోసాలు, సెక్స్‌టార్షన్ (అసభ్య చిత్రాలు/వీడియోలతో బ్లాక్‌మెయిల్) వంటి మోసాలకు పాల్పడేవి.
ఘనా, కెన్యా, అంగోలా, ఇతర ప్రాంతాలలో 1,400 మందికిపైగా బాధితులను గుర్తించారు.
వారంతా దాదాపు 2.8 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 23 కోట్ల నుంచి రూ.24 కోట్ల వరకు నష్టపోయినట్లు ఇంటర్‌పోల్ అంచనా వేసింది.
ఇంటర్‌పోల్ తెలిపిన వివరాల ప్రకారం, జులై నుంచి ఆగస్టు మధ్య జరిపిన దాడుల్లో వివిధ వయసుల వారు ఈ మోసగాళ్ల బారిన పడినట్లు గుర్తించారు.
ఈ ఆపరేషన్‌లో మోసగాళ్ల గ్యాంగులతో సంబంధమున్న వారి ఐపీ అడ్రెస్‌లు, సాంకేతిక పరికరాలు, డొమైన్లు, సోషల్ మీడియా ప్రొఫైళ్లను గుర్తించారు.
వీటి ఆధారంగా జరిగిన అరెస్టుల అనంతరం.. యూఎస్‌బీ డ్రైవ్‌లు, సిమ్ కార్డులు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఆఫ్రికా వ్యాప్తంగా 81 సైబర్ నేరగాళ్ల గ్యాంగులను కట్టడి చేసినట్లు ఇంటర్‌పోల్ తెలిపింది.
"ఆన్‌లైన్ ద్వారా బాధితులపై దాడి చేసే గ్యాంగులను నివారించడం, వాటిని నిర్వీర్యం చేయడమే మా ప్రధాన లక్ష్యం" అని పేర్కొంది.
"సెక్స్‌టార్షన్, రొమాన్స్ స్కామ్‌ల వంటి సైబర్ నేరాల్లో ఆఫ్రికా అంతటా గణనీయమైన పెరుగుదల నమోదైందని సైబర్-నేర విభాగాల నివేదికల ద్వారా తెలుస్తోంది" అని ఇంటర్‌పోల్‌లో పోలీస్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిరిల్ గౌట్ తెలిపారు.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు పెరగడంతో ప్రజలను మోసం చేసేందుకు నేరగాళ్లకు కొత్తకొత్త అవకాశాలు కూడా దొరుకుతున్నాయని, దీనివల్ల బాధితులు డబ్బు కోల్పోవడంతోపాటు మానసిక వేదనకు గురవుతున్నారని సిరిల్ గౌట్ చెప్పారు.
ఘనాలో దాదాపు 68 మంది అనుమానితులను అరెస్టు చేశారు. అక్కడ 835 పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సమయంలో 108 మంది బాధితులను గుర్తించారు. బాధితులు దాదాపు 450,000 డాలర్లు (దాదాపు 4 కోట్ల రూపాయలు) కోల్పోయినట్లు అంచనా. అందులో 70,000 డాలర్లను(దాదాపు 62 లక్షల రూపాయలు) రికవరీ చేశారు.
ఘానాలోని స్కామర్లు ప్రజలను వివిధ మార్గాల్లో మోసం చేశారు. ఉదాహరణకు, నకిలీ కొరియర్ లేదా కస్టమ్స్ షిప్మెంట్ ఫీజుల వంటి రూపంలో. అలాగే చాట్‌ల సమయంలో వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసి, వాటితో బ్లాక్‌మెయిల్ చేశారు.
సెనెగల్‌లో పోలీసులు 22 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ సెలబ్రిటీలుగా మారి, సోషల్ మీడియా, డేటింగ్ సైట్లలో 120 మందిని మోసం చేసి సుమారు 34,000 డాలర్లు (దాదాపు రూ. 30 లక్షలు) నగదు దోచుకుంది.
ఈ ఆపరేషన్‌లో మొత్తం 65 పరికరాలు, నకిలీ గుర్తింపు పత్రాలు, డబ్బు బదిలీ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఐవర్ కోస్ట్‌లో పోలీసులు 24 మంది అనుమానితులను అరెస్టు చేసి, 29 పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 809 మంది బాధితులను గుర్తించారు. స్కామర్లు ఆన్‌లైన్‌లో నకిలీ ప్రొఫైళ్లు ఉపయోగించి బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి, వారి వ్యక్తిగత వివరాలు బయటపెట్టకుండా ఉండడానికి డబ్బులు డిమాండ్ చేశారు.
అంగోలాలో 8 మంది అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు 28 మంది బాధితులను గుర్తించారు. వీరిలో స్థానికులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు.
ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే వీరిని లక్ష్యంగా చేసుకున్నారు స్కామర్లు. నకిలీ పత్రాలు ఉపయోగించి ఫేక్ ఐడెంటిటీలను సృష్టించి, డబ్బు దోచేటప్పుడు తమ నిజమైన గుర్తింపు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.
సైబర్-నేరాలపై ఆఫ్రికన్ జాయింట్ ఆపరేషన్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఈ ఆపరేషన్‌లో బెనిన్, బుర్కినా ఫాసో, ది గాంబియా, గినియా, కెన్యా, నైజీరియా, రువాండా, దక్షిణాఫ్రికా, ఉగాండా, జాంబియా దేశాలు కూడా పాల్గొన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)