You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘బాధితులనే నిందిస్తారా?’’ ఆసిస్ మహిళా క్రికెటర్లపై మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలతో వివాదం
- రచయిత, గీతా పాండే,
- హోదా, బీబీసీ న్యూస్
ఇందౌర్‌లో లైంగిక వేధింపులకు గురైన ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు, హోటల్ గది నుంచి బయటకు వెళ్లేముందు అధికారులకు చెప్పి ఉండాల్సిందని మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ్‌వర్గియ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి.
బాధితులనే ఆయన నిందిస్తున్నారంటూ చాలామంది విమర్శిస్తున్నారు.
భారత్‌లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఆడటానికి వచ్చిన ఆసీస్ మహిళా క్రికెటర్లు ఇద్దరు గత గురువారం ఓ కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి వారితో అనుచితంగా ప్రవర్తించాడు.
క్రికెటర్లను వేధించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించిన ఈ సంఘటనను భారత క్రికెట్ బోర్డు ఖండించింది.
కానీ 'అధికారులకు,ప్లేయర్లకు ఇదొక గుణపాఠం. బయటకు వెళ్లే ముందు వారు సెక్యూరిటీకి లేదా అధికారులకు చెప్పి ఉండాల్సింది' అని మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ్‌వర్గియ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
ఏం జరిగింది?
వీధుల్లో అమ్మాయిలను వేధించే ఘటనలు భారత్‌లో చాలా తరచుగా జరుగుతుంటాయి. కానీ, ఒక హై ప్రొఫైల్ టోర్నమెంట్ అయిన క్రికెట్ వరల్డ్ కప్ ఆడటానికి భారత్‌కు వచ్చిన ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లపై ఈ ఘటన జరగడంతో పతాక శీర్షికల్లోకి ఎక్కింది.
మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి క్రికెటర్లను సమీపించి, వారిని అనుచితంగా తాకాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇది చాలా విచారకర ఘటన అని పేర్కొన్న బీసీసీఐ, క్రికెటర్ల భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను సమీక్షించి, భవిష్యత్‌లో ఇలాంటివి జరుగకుండా అవసరమైతే వాటిని మరింత పటిష్టం చేస్తామని హామీ ఇచ్చింది.
క్రికెటర్లను వేధించిన వ్యక్తిని వీలైనంత త్వరగా శిక్షించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ డిమాండ్ చేశారు.
'అతన్ని శాశ్వతంగా జైల్లోనే ఉంచండి. ఇలాంటి క్రిమినల్స్‌తో వ్యవహరించే మార్గం ఇదొక్కటే' అని ఇండియా టుడే టీవీ చానల్‌తో సునీల్ గావస్కర్ అన్నారు.
‘బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి’
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, రాష్ట్ర పట్టణాభివృద్ది మంత్రిగా విజయ్‌వర్గియ వ్యవహరిస్తున్నారు.
విజయ్ వర్గియ వ్యాఖ్యలు ఆటగాళ్లే తమ భద్రతకు బాధ్యత వహించాలన్నట్టుగా ఉన్నాయి.
'మేం బయటకు వెళ్లేటప్పుడు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చినట్లే, ఆటగాళ్లు కూడా చెప్పాలి. ఆటగాళ్లు ఇక భవిష్యత్‌లో బయటకు వెళ్తే సెక్యూరిటీకి లేదా స్థానిక యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలనే సంగతి తెలుసుకుంటారు' అని ఆదివారం విలేఖరులతో విజయ్‌వర్గియ అన్నారు.
ప్లేయర్లకు భారీగా అభిమానులు ఉంటారు కాబట్టి బయటకు వెళ్లేముందు వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.
'' ఇంగ్లండ్‌లో పుట్‌బాల్ తరహాలో ఇక్కడ క్రికెట్ అంటే పిచ్చి ఉంటుంది. ఫుట్‌బాల్ ఆటగాళ్ల చొక్కాలు చిరగడం నేను చూశాను. కొన్నిసార్లు తమ సొంత పాపులారిటీని ఆటగాళ్లు గ్రహించలేరు. ఆటగాళ్లు చాలా పాపులర్. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి' అని ఆయన వ్యాఖ్యానించారు.
చిన్మయి సహా పలువురి విమర్శలు
విజయవర్గియ చేసిన వ్యాఖ్యలపై చాలామంది స్పందించారు. ఆయన బాధితులనే నిందిస్తున్నారంటూ చాలామంది ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను పలువురు ప్రతిపక్ష నేతలు, మీడియా సహా పౌరులు కూడా విమర్శిస్తున్నారు.
విజయవర్గియ వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు అరుణ్ యాదవ్ అన్నారు.
ఆయన బాధితులనే నిందిస్తున్నారని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఆరోపించారు.
''మహిళలు ఎవరైనా వేరే దేశంలో లేదా నగరంలో పర్యటిస్తున్నప్పుడు, ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లినప్పుడు తమ సొంత భద్రత గురించి ఆలోచించాలని, జాగ్రత్తపడాలని బీజేపీ మంత్రి కైలాశ్ విజయవర్గియ అంటున్నారు. అంటే బయటకు వెళ్లడం మహిళల తప్పే అనేది ఆయన ఉద్దేశం'’ అని ఎక్స్‌లో చిన్మయి రాశారు.
ఈ వేధింపుల ఘటనతో మన దేశ పరువు ఇప్పటికే దెబ్బతినగా, ఒక ప్రజా ప్రతినిధి నుంచి ఇలా బాధితులనే నిందించేలా వ్యాఖ్యలు రావడం పరిస్థితిని మరింత దిగజార్చుతుందని మరో యూజర్ రాశారు.
'దోషులను ఖండిస్తూ, నగర గౌరవాన్ని కాపాడటానికి బదులుగా బాధితులకు ఉపదేశం ఇవ్వాలని మంత్రి నిర్ణయించుకున్నారు. ఆయన పదవికి ఇది తగదు' అని ఆ యూజర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే తరువాత ఈ సంఘటనను ‘సిగ్గుచేటు’గా పేర్కొన్న విజయవర్గియ,దీనిపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. కానీ ప్లేయర్లు తాము బయటకు వెళ్లేముందు భద్రతాధికారులకు చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.
మహిళలను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలతో ఆయన వార్తల్లోకి ఎక్కడం ఇదే మొదటిసారి కాదని పలువురు అంటున్నారు.
మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే తనకు ఇష్టం ఉండదంటూ కొన్ని నెలల క్రితం వ్యాఖ్యానించి ఆయన వార్తల్లో నిలిచారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)