ఉస్మాన్ హాదీ ఎవరు? ఆయన మరణం తరువాత బంగ్లాదేశ్‌లో హింస ఎందుకు చెలరేగింది?

బంగ్లాదేశ్‌లో గత ఏడాది జరిగిన విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్న ఆ దేశ స్టూడెంట్ లీడర్ శరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తరువాత గురువారం నుంచి రాజధాని ఢాకాలోని అనేక ప్రాంతాల్లో హింస చెలరేగింది.

ఆయన మరణం తరువాత ఢాకాలోని ధన్మొండి, షాబాగ్‌ సహా అనేక ప్రదేశాలలో నిరసనలు, విధ్వంసాలు, ఆస్తుల దహనాలు వంటి హింసాత్మక ఘటనలు జరిగాయని 'బీబీసీ బంగ్లా' రిపోర్ట్ చేసింది.

గురువారం రాత్రంతా ఢాకాలో అనేక ప్రాంతాల్లో అల్లరిమూకల దాడి కొనసాగింది. రెండు ప్రముఖ బంగ్లాదేశ్ వార్తాపత్రికల కార్యాలయాలపైనా దాడి జరిగింది. శుక్రవారం కూడా అల్లర్లు కొనసాగుతున్నాయి.

గురువారం రాత్రి 11:20 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్, ప్రజలు ఓపికగా ఉండాలని, ఎలాంటి 'ప్రచారాలు, వదంతులు'ను నమ్మవద్దని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

హాదీ మృతితో బంగ్లాదేశ్‌లో శనివారం సంతాప దినం పాటించనున్నట్లు యూనస్ ప్రకటించారు.

హాదీ ఎలా మరణించారు?

కాగా హాదీ మృతదేహాన్ని శుక్రవారం ఆయన బంధువులు సింగపూర్ నుంచి బంగ్లాదేశ్ తీసుకొస్తారని 'ఇంక్విలాబ్ మంచ్' ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించింది.

గత శుక్రవారం ఢాకాలోని ఒక మసీదు నుంచి బయటకు వెళ్తున్న సమయంలో హాదీపై కాల్పులు జరిగాయి. బుల్లెట్ అతని తలలోకి దూసుకెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ 15న ఆయన్ను విమానంలో సింగపూర్‌ తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ ఆయన గురువారం మరణించారు.

హాదీ మరణం తరువాత సింగపూర్ విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. 'సింగపూర్ జనరల్ హాస్పిటల్, నేషనల్ న్యూరోసైన్స్ ఇనిస్టిట్యూట్ వైద్యులు హాదీ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా ఆయన డిసెంబర్ 18న మరణించారు' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహమాన్, జమాత్-ఇ-ఇస్లామి, ఎన్‌సీపీ(నేషనల్ సిటిజన్స్ పార్టీ) సహా వివిధ పార్టీల నాయకులు హాదీ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.

పత్రికల కార్యాలయాలకు నిప్పు

ఉస్మాన్ హాదీ మరణించారని తెలియగానే నిరసనకారులు బంగ్లాదేశ్ వీధుల్లోకి వచ్చారు.

నిరసనకారులు ఢాకాలోని ప్రధమ్ ఆలో, డైలీ స్టార్ వార్తాపత్రికలు, ధన్మొండి 32లోని షేక్ ముజిబుర్ రెహమాన్ ఇల్లు, ఛాయానాత్ సంస్కృతి భవన్‌పై దాడి చేసి నిప్పు పెట్టారు.

దీంతోపాటు చిట్టగాంగ్, రాజ్‌షాహి, అనేక ఇతర ప్రాంతాలలోనూ దాడులు జరిగాయి.

ధన్మొండి 32 వద్ద విధ్వంసక సంఘటన జరిగిందని ఢాకా పోలీసులు బీబీసీ బంగ్లాతో చెప్పారు. గతంలో బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంగానూ, తరువాత మ్యూజియంగా మారిన ఈ భవనం 2024 ఆగస్టు 5 నుంచి రెండు సార్లు దాడులకు గురైంది. మంటల్లో కాలిపోయింది.

గురువారం అర్ధరాత్రి సమయంలో, వందలాది మంది ప్రథమ్ ఆలో, ది డైలీ స్టార్ పత్రికల కార్యాలయాలపై దాడి చేసి నిప్పంటించారు.

ఆ సమయంలో రెండు వార్తాపత్రికలకు చెందిన చాలా మంది జర్నలిస్టులు భవనం లోపల చిక్కుకున్నారు.

తరువాత, ఆర్మీ, పోలీసులు అక్కడికి చేరుకుని దాడికి పాల్పడినవారిని చెదరగొట్టారు. అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసి భవనం లోపల చిక్కుకున్నవారిని రక్షించారు.

వార్తాపత్రికలు శుక్రవారం కార్యకలాపాలను నిలిపివేయడంతో పాటు తమ ఆన్‌లైన్ సేవలనూ నిలిపివేశాయి.

గురువారం రాత్రి దేశంలోని అనేక ఇతర ప్రాంతాలలో ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి.

ఢాకాతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఉస్మాన్ హాదీ మద్దతుదారులు, కొన్ని రాజకీయ, విద్యార్థి సంఘాల నాయకులు వీధుల్లోకి వచ్చారు.

భారత హైకమిషనర్ నివాసం ముందు నిరసనలు

చిట్టగాంగ్‌లోని అనేక చోట్ల నిరసనలు జరిగాయి.

భారత అసిస్టెంట్ హైకమిషనర్ నివాసం ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఆ గుంపు హైకమిషన్‌పై రాళ్లు రువ్వినట్లు స్థానిక జర్నలిస్ట్‌లు రిపోర్ట్ చేశారు.

అంతేకాకుండా, పదవీచ్యుతుడైన అవామీ లీగ్ ప్రభుత్వంలో మాజీ విద్యా మంత్రి మొహిబుల్ హసన్ చౌదరి నౌఫెల్ ఇంటిని ధ్వంసం చేసి, నిప్పంటించారు.

గురువారం రాత్రి ముహమ్మద్ యూనస్... 'ఈ దారుణ హత్యలో పాల్గొన్న నేరస్థులందరినీ వీలైనంత త్వరగా శిక్షిస్తాం' అని చెప్పారు.

"దేశాన్ని అస్థిరపరచాలనుకునే వారి ఉచ్చులో మనం పడకూడదు, మనమందరం ఐక్యంగా ఉండి ప్రజాస్వామ్యం, న్యాయం, ప్రజల హక్కులను స్థాపించే దిశగా దృఢమైన చర్యలు తీసుకుందాం."

"ఓడిపోయిన శక్తులకు, ఫాసిస్ట్ ఉగ్రవాదులకు ఉస్మాన్ హాదీ శత్రువు అని నేను మరోసారి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అతని గొంతును అణచివేయడానికి, విప్లవకారులను బెదిరించడానికి చేసే దుష్ట ప్రయత్నాలను పూర్తిగా అడ్డుకుంటాం. ఈ దేశ ప్రజాస్వామ్య పురోగతిని ఏ భయం, బీభత్సం, రక్తపాతం ఆపలేవు" అని యూనస్ అన్నారు.

హాదీ భార్యాబిడ్డల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

హాదీ ఎవరు?

హాదీ నిరుడు ఆగస్ట్‌లో బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

షేక్ హసీనా వ్యతిరేక సంస్థ ఇంక్విలాబ్ మంచ్‌లో హాదీ సభ్యుడు. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో జరగబోయే ఎన్నికలకు హాదీ సిద్ధమవుతున్నారు. దాడికి గురైన సమయంలో ఆయన ఢాకా-8 నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు.

గత ఏడాది జూలైలో బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం సమయంలో ఇంక్విలాబ్ మంచ్ వెలుగులోకి వచ్చింది.

ఈ గ్రూప్ అవామీ లీగ్‌ను బలహీనపరిచడంలో కీలకంగా పనిచేసింది.

విద్యార్థి ఉద్యమంలో దాని పాత్ర ఉన్నప్పటికీ, యూనస్ ప్రభుత్వం ఆ ఫోరమ్‌ను రద్దు చేసి, జాతీయ ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)