You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘షేక్ హసీనాకు 1400 సార్లు మరణశిక్ష విధించాలి’ అని చీఫ్ ప్రాసిక్యూటర్ ఎందుకు కోరారు?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని ఆ దేశానికి చెందిన ప్రభుత్వ న్యాయవాదులు డిమాండ్ చేశారు.
నిరుడు బంగ్లాదేశ్‌లో వెల్లువెత్తిన విద్యార్థుల ఆందోళనను అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం అణచివేసింది. అనంతరం ఆమె అధికారం కోల్పోయారు.
భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనా అమానుష నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆ దేశ న్యాయస్థానం విచారణ జరుపుతోంది.
ఆందోళనకారులపై "మారణాయుధాలను వినియోగించాలి" అని భద్రతా బలగాలను ఆమె ఆదేశించినట్టు లీకైన ఓ ఆడియో క్లిప్‌లో ఉంది. కానీ ఈ అభియోగాలను ఆమె తిరస్కరించారు.
హసీనా 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికిన ఆ నిరసనల్లో కొన్ని వారాల వ్యవధిలోనే 1,400 మంది వరకు చనిపోయారు.
1971లో ఆ దేశ స్వాతంత్య్ర ఉద్యమం తర్వాత జరిగిన అత్యంత హింసాత్మ ఘటనగా ఇది నిలిచింది.
హసీనా 1,400 సార్లు మరణశిక్షలకు అర్హురాలని చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లామ్ అన్నారు.
"అయితే, ఇది సాధ్యం కాదు కాబట్టి.. అందులో ఒక్క మరణశిక్షయినా విధించాలని డిమాండ్ చేస్తున్నాం" అని తాజుల్ ఇస్లామ్ అన్నారు.
"అధికారాన్ని తన కోసం, తన కుటుంబం కోసం శాశ్వతం చేసుకోవడమే హసీనా లక్ష్యంగా ఉండేది" అని తాజుల్ గురువారం కోర్టుకు తెలిపారు.
"ఆమె తీవ్రమైన నేరస్థురాలిగా మారారు. తాను చేసిన నేరాల విషయంలో ఆమెకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు" అని ఆయన అన్నారు.
1971 నాటి యుద్ధంలో పాల్గొన్న వారి బంధువులకు సివిల్ సర్వీసు ఉద్యోగాల్లో కోటా కల్పించడానికి వ్యతిరేకంగా గత ఏడాది జులైలో నిరసనలు మొదలయ్యాయి.
ఇవి తీవ్రరూపం దాల్చి హసీనా తన పదవిని కోల్పోయేందుకు దారి తీసింది.
ఆగస్టు 5న హసీనా హెలికాప్టర్‌లో పారిపోయే ముందు ఢాకాలోని ఆమె నివాసం వద్ద అత్యంత హింసాత్మక ఘటనలు జరిగినట్లు బీబీసీ ఇన్వెస్టిగేషన్ గుర్తించింది.
ఢాకా పరిసర ప్రాంతాల్లో జరిగిన పలు ఘటనల్లో పోలీసుల కాల్పుల్లో 52 మంది చనిపోయారు.
నిరసనకారుల హింసాత్మక చర్యల కారణంగానే పోలీసులు కాల్పులు మొదలుపెట్టారని హసీనా ప్రభుత్వం నియమించిన డిఫెన్స్ న్యాయవాది వాదించారు.
హసీనాతో పాటు ఆమె ప్రభుత్వంలోని హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ చీఫ్ చౌధురి అబ్దుల్లా అల్-మామున్‌పై కూడా విచారణ జరుగుతోంది.
అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కు కూడా మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు వాదించారు. మరోవైపు చౌధురి జులైలో తన నేరాన్ని అంగీకరించారు కానీ, ఆయనకు ఇంకా శిక్ష విధించలేదు.
కోర్టు ధిక్కరణ కింద హసీనాకు ఇప్పటికే ఆరు నెలల జైలు శిక్ష విధించారు. దాంతోపాటు అవినీతికి సంబంధించిన వివిధ అభియోగాలను ఆమె ఎదుర్కొంటున్నారు.
బంగ్లాదేశ్‌లో తదుపరి ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. హసీనా పార్టీ అవామీ లీగ్‌ను ఎన్నికల్లో పాల్గొనడం సహా అన్ని కార్యకలాపాల నుంచి నిషేధం విధించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)