You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చిన్మయ్ కృష్ణ దాస్: ఇస్కాన్ ప్రచారకర్త అరెస్ట్‌తో భారత్, బంగ్లాదేశ్ మధ్య మాటల యుద్ధం
- రచయిత, అంబరసన్ ఎతిరాజన్, నెయాజ్ ఫారూఖీ
- హోదా, బీబీసీ న్యూస్, లండన్ అండ్ దిల్లీ
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్త అరెస్టు.. ఆ దేశంలో మైనార్టీల భద్రత విషయంలో భారత్‌తో మాటల యుద్ధానికి దారితీసింది.
దేశద్రోహం ఆరోపణలతో హిందూ సంస్థ ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం జరిగిన ఆందోళనల్లో ఒకరు చనిపోయారు.
చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టుపై భారత్ ''తీవ్ర ఆందోళన'' వ్యక్తం చేయడంతో పాటు బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని ఆ దేశాన్ని కోరుతూ ప్రకటన చేసింది.
భారత్ ప్రకటన చేసిన కొద్ది గంటలకు బంగ్లాదేశ్ స్పందిస్తూ.. కొన్నివర్గాలు దీనిని తప్పుగా భావించడం తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొంది.
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తీవ్ర నిరసనల కారణంగా అశాంతి చెలరేగి మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టులో అధికారం కోల్పోయిన తరువాత భారత్‌తో ఆ దేశ సంబంధాలు క్షీణించాయి.
అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉండడం, రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలకు సవాల్‌గా మారింది.
షేక్ హసీనా పదిహేనేళ్ల పాలనకాలంలో భారత సరిహద్దు భద్రత, మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు భద్రత వంటి వ్యవహారాల్లో బంగ్లాదేశ్ కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగానూ, మిత్రదేశంగానూ ఉంది.
భారత్‌తో సన్నిహితంగా ఉండడం వల్ల ఆ దేశం ఆర్థికంగానూ లాభపడింది.
కానీ, ఆమె పదవి కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల భద్రతపై భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది, అయితే భారత వాదనలను బంగ్లాదేశ్ తోసిపుచ్చుతూ వచ్చింది.
ముస్లిం మెజార్టీ దేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులు ప్రధాన మైనారిటీలుగా ఉన్నారు, దేశ జనాభాలో వారి జనాభా దాదాపు 8 శాతం.
కృష్ణ దాస్‌ను సోమవారం ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేయడం తాజా ఉద్రిక్తతలకు కారణమైంది.
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జరిగిన ఒక ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
ఇస్కాన్ సంస్థ ఆయన అరెస్టును ఖండించింది. మైనార్టీల రక్షణ కోసం గళమెత్తే వ్యక్తిగా ఆయన్ను పేర్కొంది.
అయితే, చిట్టగాంగ్ కోర్టు మంగళవారం దాస్‌కు బెయిల్ నిరాకరించింది. అనంతరం ఆయన్ను తిరిగి జైలుకి తీసుకెళ్లే సమయంలో వందలాది మంది మద్దతుదారులు వ్యాన్‌ను చుట్టుముట్టడంతో హింస చెలరేగినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఆ గుంపును చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు లాఠీచార్జి చేయడంతో పాటు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి.
ఈ ఘర్షణల్లో సైఫుల్ ఇస్లాం అలీఫ్ అనే ముస్లిం న్యాయవాది చనిపోయినట్లు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు.
ఈ హత్య కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హింసాకాండకు సంబంధించి 20 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన మత ఘర్షణలకు దారితీసే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు మహమ్మద్ యూనస్ కోరారు.
తమ ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉందని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)