You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
షేక్ హసీనాను అప్పగించాలని కోరిన బంగ్లాదేశ్, మోదీ ప్రభుత్వం ఏమందంటే..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్) మరణశిక్ష విధించింది. వీరిద్దరూ ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్నారు.
ట్రిబ్యునల్ తీర్పు తర్వాత, షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌ను డిమాండ్ చేసింది.
దీనికి ప్రతిస్పందనగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
'షేక్ హసీనాకు సంబంధించి బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినట్లు తెలిసింది' అని ఆ ప్రకటనలో పేర్కొంది.
"సమీప పొరుగు దేశంగా శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం వంటి అంశాల్లో బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉంది. ఆ దిశగా భారత్ ఎల్లప్పుడూ అన్ని వర్గాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంది'' అని మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.
దీనికి ముందు, సోమవారం(నవంబరు 17న) బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
"పరారైన షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌ను క్రిమినల్ కోర్టు దోషులుగా నిర్ధరించింది. అమానవీయ నేరాలకు పాల్పడిన ఇలాంటి వ్యక్తులకు ఆశ్రయం కల్పించే ఏ దేశాన్నైనా స్నేహపూర్వక ప్రవర్తనలేనిదిగా, తీవ్రమైన న్యాయ ధిక్కార చర్యగా పరిగణిస్తాం."
"భారత ప్రభుత్వం వెంటనే ఇద్దరు దోషులను బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించాలని కోరుతున్నాం. రెండు దేశాల మధ్య జరిగిన అప్పగింత ఒప్పందం ప్రకారం ఇది భారత్ బాధ్యత" అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.
రెండు కేసుల్లో మరణశిక్ష, ఓ కేసులో జీవిత ఖైదు
బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అమానవీయ నేరాల్లో దోషిగా నిర్థరించి (నవంబరు 17న) మరణశిక్ష విధించింది.
గత ఏడాది జులై - ఆగస్టులో జరిగిన తిరుగుబాటు సమయంలో అమానవీయ నేరాలకు పాల్పడినట్లు షేక్ హసీనాపై అభియోగాలు నమోదయ్యాయి. ఆమె భారత్‌లో ప్రవాసంలో నివసిస్తున్నందున, ఆమె గైర్హాజరీలో కేసు విచారణ జరిగింది.
జస్టిస్ మొహమ్మద్ గులాం ముర్తజా మజుందార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్-1 ఈ నిర్ణయం తీసుకుంది.
షేక్ హసీనాతో సహా ముగ్గురు నిందితులను ట్రిబ్యునల్ దోషులుగా తేల్చింది.
షేక్ హసీనాపై ఉన్న ఐదు కేసుల్లో రెండింటిలో మరణశిక్ష విధించగా, మరో కేసులో జీవిత ఖైదు విధించారు.
మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు కూడా కోర్టు మరణశిక్ష విధించింది. అప్రూవర్‌గా మారిన మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అబ్దుల్లా అల్ మనూన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
కోర్టులో ఏం జరిగింది?
షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన వెంటనే కోర్టు లోపల, వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు సంబరాలు చేసుకున్నారని ఢాకాలో ఉన్న బీబీసీ ప్రతినిధి అరుణోదయ్ ముఖర్జీ తెలిపారు.
తీర్పు ప్రకటనను బంగ్లాదేశ్ టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
గత ఏడాది బంగ్లాదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు తలెత్తాయి. నిరసనలు అణచివేసేందుకు షేక్ హసీనా అమానవీయంగా ప్రవర్తించారని అభియోగాలు నమోదయ్యాయి.
ఈ ఉద్యమం కారణంగా షేక్ హసీనా 2024 ఆగస్టులో అధికారాన్ని కోల్పోయి బంగ్లాదేశ్ విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే నివసిస్తున్నారు.
జూన్‌లో అభియోగాలు నమోదు
ఈ ఏడాది జూన్‌లో అభియోగాలు నమోదయ్యాయి. గత ఏడాది జులై, ఆగస్టులలో 1,400 మంది మరణించారని, దాదాపు 25,000 మంది గాయపడ్డారని చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం వాదించారు.
మరణించిన వ్యక్తుల జాబితాను కూడా ట్రిబ్యునల్‌కు ప్రాసిక్యూషన్ సమర్పించింది.
షేక్ హసీనాతో సహా ముగ్గురు నిందితులపై అభియోగాలకు సంబంధించి 747 పేజీల పత్రాలను కూడా ట్రిబ్యునల్‌లో దాఖలు చేశారు.
ఈ ముగ్గురు నిందితులపై హత్య, హత్యాయత్నం, కుట్ర, సహాయం చేయడం, ప్రోత్సహించడం అనే ఐదు అభియోగాలు నమోదయ్యాయి.
ఈ ఐదు అభియోగాల్లో 13 మంది హత్య కూడా ఉందని తాజుల్ ఇస్లాం ట్రిబ్యునల్‌కు తెలిపారు.
‘రజాకార్లు’ అనడంపై అభ్యంతరం
"షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవిలో ఉన్నప్పుడు, గత ఏడాది జులై 14న జరిగిన విలేఖరుల సమావేశంలో విద్యార్థులను 'రజాకార్ల' కుమారులు, మనవళ్లు అని అభివర్ణిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు" అని తాజుల్ ఇస్లాం అన్నారు.
బంగ్లాదేశ్‌లో, రజాకార్ అనే పదాన్ని దేశద్రోహి అనే అర్థంలో ఉపయోగిస్తారు, 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ సైన్యానికి సహకరించిన, దారుణమైన నేరాలలో పాల్గొన్న వారి గురించి చెప్పేందుకు ఈ పదం వాడతారు.
"నిందితులైన అసదుజ్జమాన్ ఖాన్ కమల్, చౌధరీ అబ్దుల్లా అల్ మాముల్ సహా ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రోద్బలం, సాయంతో.. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు, అవామీ లీగ్‌కు చెందిన సాయుధులు అమాయకులు, నిరాయుధులైన విద్యార్థులు, పౌరులపై హత్యలు, హత్యాయత్నాలు, వేధింపులతో సహా పెద్దయెత్తున ప్రణాళికాబద్ధమైన దాడులు చేశారు" అని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
ఈ నేరాలన్నీ నిందితులకు తెలిసే జరిగాయని చార్జ్‌షీట్‌లో ఉంది.
రంగ్‌పూర్‌లోని బేగం రోకేయా విశ్వవిద్యాలయ విద్యార్థి అబూ సయీద్‌ను ఎలాంటి కారణం లేకుండా హత్య చేయడం, రాజధానిలోని చంఖర్ బ్రిడ్జి వద్ద ఆరుగురిని హత్య చేయడం వంటి ఆరోపణలు షేక్ హసీనాతో సహా ముగ్గురిపై ఉన్నాయి.
దీంతో పాటు, గత ఏడాది ఆగస్టు 5న అషులియాలో ఐదుగురిని కాల్చి చంపి, వారి మృతదేహాలను దహనం చేయడం, ఒక వ్యక్తిని సజీవ దహనం చేయడం వంటి ఆరోపణలు కూడా షేక్ హసీనాపై ఉన్నాయి. అదే రోజు ఆమె బంగ్లాదేశ్ విడిచిపెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)