షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని తగలబెట్టిన ఆందోళనకారులు - హసీనా భారత్‌ నుంచి కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు

బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రత్యర్థులు ఢాకాలోని ఆమె తండ్రి ఇల్లు ధాన్‌మండి-32కి నిప్పుపెట్టారు.

బుధవారం రాత్రి (ఫిబ్రవరి 5) ఈ ఘటన జరిగింది.

షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌కు చెందిన ఇతర నాయకుల ఇళ్లనూ ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

గోడలపై ఉన్న షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలనూ వారు వదిలిపెట్టలేదు.

ప్రస్తుతం భారత్‌లో ఉన్న షేక్ హసీనా ఆన్‌లైన్‌లో అక్కడి వారిని ఉద్దేశించి మాట్లాడాల్సిన కార్యక్రమం ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందు ఈ హింస మొదలైంది.

షేక్ హసీనా బంగ్లాదేశ్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకారులు ఈ హింసాత్మక చర్యలకు దిగినట్లు బంగ్లాదేశ్‌లోని ప్రధాన న్యూస్ పేపర్లలో ఒకటైన 'ద డైలీ స్టార్' రాసింది.

భారత్‌లో కూర్చుని షేక్ హసీనా బంగ్లాదేశ్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆమె ప్రత్యర్థులు ఆరోపించారు.

గత ఏడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళన తర్వాత షేక్ హసీనా తన దేశాన్ని వీడారు. ఆగస్టు 5న ఆమె భారత్ వచ్చారు.

ఆందోళనకారులు ఏం చేశారు?

షేక్ హసీనా పార్టీ స్టూడెంట్ విభాగం ‘ఛాత్ర లీగ్’ ఒక ఆన్‌లైన్ ప్రోగ్రామ్ నిర్వహించాలని భావించింది. ఆ కార్యక్రమంలో భాగంగా షేక్ హసీనా ఫేస్‌బుక్‌ వేదికగా మాట్లాడాల్సిఉంది. రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించారు.

ఈ కార్యక్రమం గురించి సమాచారం తెలిసిన వెంటనే నిరసనకారులు ''బుల్డోజర్ ప్రదర్శన''కు పిలుపునిచ్చారు. వారి కార్యక్రమాన్ని కూడా 9 గంటలకే తలపెట్టాలని నిర్ణయించారు.

అయితే 8 గంటల సమయంలోనే వివక్ష వ్యతిరేక ఉద్యమం కన్వీనర్ హస్నత్ అబ్దుల్లా పిలుపు మేరకు వందలమంది నిరసనకారులు పారలు, సుత్తులతో ధాన్‌మండి-32లో ప్రవేశించారు.

ఆందోళనకారులు మొదట షేక్ ముజిబుర్‌ రెహమాన్ చిత్రాలను ధ్వంసం చేశారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ 'ద డైలీ స్టార్' తెలిపింది.

రాత్రి తొమ్మిదిన్నర గంటలకు భవనానికి నిప్పుపెట్టారని వార్తాపత్రిక తెలిపింది. తర్వాత ఒక క్రేన్, ఎక్స్‌కవేటర్ అక్కడకు చేరుకున్నాయి.

అర్ధ రాత్రి దాటాక రెండు గంటల సమయంలో భవనంలో కొంత భాగం ధ్వంసం చేశారు.

మ్యూజియంగా ఉన్న ఆ ఇల్లు 'ఫాసిజం'కు ప్రతీకగా మారిందని అందుకే తాము దాన్ని ధ్వంసం చేసి తగులబెట్టామని ఓ నిరసనకారుడు బీబీసీతో చెప్పారు.

‘ఫాసిజానికి ప్రతీక.. అందుకే ధ్వంసం చేశాం’

షేక్ ముజిబ్‌ రెహమాన్ ఇల్లు 'ఫాసిజానికి పవిత్ర భూమి' అని, దాన్ని ధ్వంసం చేయాలని హస్నత్ అబ్దుల్లా తన ఫేస్‌బుక్ పోస్టులో పిలుపునిచ్చారు.

ఫాసిజానికి ప్రతీకగామారిన ఇంటిని ధ్వంసం చేయాల్సిన అవసరముందని, అందుకే తాను నిరసనలో భాగమయ్యానని మహముదుర్ రెహమాన్ అనే విద్యార్థి చెప్పారు.

షేక్ హసీనా ప్రభుత్వం సంరక్షించిన మ్యూజియాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని మొమమ్మద్ అర్ఫిన్ అనే మరో నిరసనకారుడు చెప్పారు.

విప్లవం ద్వారా తాము కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నామని, ఆ భవనాన్ని ధ్వంసం చేయడంలో ఎలాంటి ముప్పూ వాటిల్లదని అన్నారు.

షేక్ ముజిబుర్ రెహమాన్‌ను బంగ్లాదేశ్ పితామహుడిగా పేర్కొంటారు. పాకిస్తాన్ నుంచి విడిపోయి 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. అనంతరం ముజిబుర్ రెహమాన్ 1975లో హత్యకు గురయ్యారు.

షేక్ హసీనా తన రాజకీయ ప్రత్యర్థులను హతమార్చారని, దేశంలో భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆమె వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.

ధాన్‌మండి-32ధ్వంసానికి తాత్కాలిక ప్రభుత్వ మద్దతు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే భవనం కూల్చివేతకు ఆదేశాలిచ్చినట్టు తమకు ఎలాంటి సమాచారం లేదని ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ప్రతినిధి తాలిబుర్ రెహమాన్ చెప్పారు.

భద్రతా అధికారులు నిరసనకారులను ఆపివేశారని నిరసనల్లో భాగమైన విద్యార్థి టొరికల్ ఇస్లామ్ చెప్పారు. అయితే కూల్చివేత మొదలైన తర్వాత వాళ్లు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. సైనికులు పెట్రోలింగ్ చేస్తున్నారని, కానీ వారు విద్యార్థులతో మాత్రమే మాట్లాడారని తెలిపారు.

అవామీ లీగ్ నాయకుల ఇళ్లు ధ్వంసం

ధాన్‌మండి-32తో పాటు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌కు చెందిన కొందరు నాయకుల ఇళ్లనూ ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

ధాన్‌మండి-32కి నిప్పుపెట్టిన సమయంలోనే షేక్ హసీనా బంధువులు, ఖుల్నాలోని అవామీ లీగ్ నేతలు షేక్ హిలాలుద్దీన్, షేక్ జివెల్ ఇళ్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

ఢాకానా, దిల్లీ ఢాకానా, ఢాకా, ముజీబాబాద్ ముర్దాబాద్ అంటూ వందలమంది ఆందోళనకారులు అవామీలీగ్ నేతల ఇళ్లముందు నినాదాలు చేశారని డైలీ స్టార్ తెలిపింది.

కుస్తియాలో మాజీ ఎంపీ, అవామీ లీగ్ జాయింట్ జనరల్ సెక్రటరీ మహ్‌బూబ్ అలమ్ హనిఫ్, అవామీ లీగ్ అధ్యక్షుడు సదర్ ఖాన్ ఇంటిని కూడా నాశనం చేశారు.

షేక్ హసీనా ఆన్‌లైన్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ చిట్టగాంగ్‌లో ఆందోళనకారులు నిరసనలు తెలిపారు.

భవనాలు మాత్రమే తగలబెట్టగలరు..చరిత్రను చెరపలేరు

ధాన్‌మండి-32ని తగలబెట్టడంపై షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు. ''దేశ స్వేచ్ఛను కొన్ని బుల్డోజర్లతో ముగించే అధికారం వారికి లేదు. వాళ్లు భవనాన్ని ధ్వంసం చేయగలరు..కానీ చరిత్రను చెరపలేరు'' అని షేక్ హసీనా అన్నారు.

బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఫేస్‌బుక్ పేజ్ ద్వారా ఆమె ప్రసంగం ప్రసారమైంది.

షేక్ హసీనా ప్రభుత్వం పతనమై ఆరు నెలలు గడిచిపోయాయి.

షేక్ హసీనాను బంగ్లాదేశ్ పంపించాలి

షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నట్టు మొహమ్మద్ యూనస్ అన్నారు. తన ప్రభుత్వం వందరోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన టీవీలో మాట్లాడారు.

విద్యార్థి ఉద్యమం సమయంలో జరిగిన హింసలో మరణాలకు బాధ్యులైన షేక్ హసీనాను, ఇతరులను తమ ప్రభుత్వం విచారించాలనుకుంటున్నదని ఆయన తెలిపారు.

గత ఏడాది ఆగస్టు నుంచి భారత్‌లో ఉంటున్న షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ తీవ్రంగా ఒత్తిడితెస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)