You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బంగ్లాదేశ్: మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తున్నారా?
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు వచ్చిన వార్తలతో దేశంలో రాజకీయ చర్చలు తీవ్రమయ్యాయి.
నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్‌సీపీ) కన్వీనర్ నాహిద్ ఇస్లామ్ గురువారం ముఖ్య సలహాదారు అధికారిక నివాసానికి వెళ్లి మహమ్మద్ యూనస్‌ను కలిశారు.
''ముఖ్య సలహాదారు పదవికి మహమ్మద్ యూనస్ రాజీనామా ఇవ్వొచ్చనే సమాచారం అందింది. ఆ తర్వాతే నేను ఆయనను కలవాలని నిర్ణయించుకున్నా'' అని బీబీసీతో నాహిద్ ఇస్లామ్ చెప్పారు.
మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు ఖలీలుర్ రహమాన్‌తో సహా తాత్కాలిక ప్రభుత్వంలోని వివాదాస్పద సలహాదారులందరినీ తొలగించాలంటూ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) డిమాండ్ చేసింది.
అంతకుముందు, స్థానిక ప్రభుత్వ సలహాదారుడు ఆసిఫ్ మహమూద్ సంజీవ్ భుయియా, సమాచార సలహాదారు మహఫూజ్ ఆలమ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఎన్‌పీ నాయకుడు ఇష్రాక్ హుస్సేన్ మద్దతుదారులు వీధుల్లో నిరసనలు చేశారు.
తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన ముగ్గురు సలహాదారులను ''బీఎన్‌పీ అధికార ప్రతినిధులు'' అంటూ ఎన్‌సీపీకి చెందిన ఒక అగ్రశ్రేణి నాయకుడు అభివర్ణించారు. ఒకవేళ సంస్కరణల సిఫార్సులు అమలు చేయకపోతే వారిని రాజీనామా చేయాలని బలవంతం చేస్తామని హెచ్చరించారు.
వీరిలో న్యాయ సలహాదారు ప్రొఫెసర్ అసిఫ్ నజ్రుల్, ఆర్థిక సలహాదారు సలాహుద్దీన్, ప్రణాళిక సలహాదారు డాక్టర్ వహిదుద్దీన్ మహమూద్ ఉన్నారు.
బీఎన్‌పీ డిమాండ్
ఈ గందరగోళాల మధ్య ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ తన పదవి నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
దీని తర్వాత వివిధ రాజకీయ పార్టీలు, సమాజంలోని విభిన్న వర్గాలతో పాటు వ్యాపార ప్రపంచానికి చెందిన వ్యక్తులు కూడా ఈ అంశంపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ముఖ్య సలహాదారు యూనస్ ఆందోళనగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తాను పనిచేయలేనని యూనస్ చెప్పారని బీబీసీతో నాహిద్ అన్నారు.
చీఫ్ అడ్వైజర్ పదవిలో కొనసాగాలని యూనస్‌కు విజ్ఞప్తి చేసినట్లు నాహిద్ తెలిపారు.
రాజీనామా విషయంలో మహమ్మద్ యూనస్ వైఖరిపై నాహిద్ మాట్లాడుతూ, ''ఇప్పుడు ఒకవేళ రాజకీయ పార్టీలన్నీ కలిసి ఆయన రాజీనామా చేయాలని కోరుకుంటే, ఆయన ఆ పదవిలో ఎందుకు కొనసాగుతారు?'' అని అన్నారు.
రాజీనామా అంశాన్ని పరిశీలిస్తున్నానని యూనస్ అన్నట్లు నాహిద్ ఇస్లామ్ మాటల ద్వారా తెలుస్తోంది.
గురువారం రోజంతా జరిగిన వివిధ సంఘటనల తర్వాత, బీఎన్‌పీ మధ్యాహ్నం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసింది. తాత్కాలిక ప్రభుత్వంలోని వివాదాస్పద సలహాదారులందర్నీ తొలగించాలని ఈ సమావేశంలో డిమాండ్ చేసింది.
కొంతమంది వివాదాస్పద సలహాదారుల ప్రకటనలు, చర్యలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని బీఎన్‌పీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఖాండేకర్ మొషారఫ్ హొస్సేన్ అన్నారు.
జాతీయ భద్రతా సలహాదారు తాజాగా చేసిన ఒక వ్యాఖ్య ఒక కొత్త వివాదాన్ని సృష్టించింది.
అదేరోజు రాత్రి ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్ అధికార ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించడానికి గత రాత్రి ఇస్లామి ఆందోళన్ బంగ్లాదేశ్, గణ్ అధికార పరిషద్, నేషనల్ సిటిజన్స్ పార్టీ సహా అయిదు పార్టీలు ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయని ఆ పోస్టులో పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని త్వరలో అఖిల పక్ష సమావేశానికి పిలుపునివ్వాలని చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్‌ను జమాతే ఇస్లామీకి చెందిన అమీర్ షఫికర్ రహమాన్ విజ్ఞప్తి చేశారు.
మే 14న మొదలైన ఆందోళనలు
గతంలో తాను చేసిన విభజన వ్యాఖ్యలపై, అలాంటి పదాలను ఉపయోగించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని సమాచార సలహాదారు మహఫూజ్ ఆలమ్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
''దేశభక్తి శక్తుల ఐక్యత అనివార్యం. వ్యక్తిగత ఆదర్శాలు, గౌరవం, భావనల కంటే దేశం ఉన్నతమైనది. నేను గతంలో చేసిన ప్రకటనలు, విభజనపూరిత మాటలకు క్షమాపణ చెబుతున్నా'' అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ మహమ్మద్, సమాచార సలహాదారు మహఫూజ్ ఆలమ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఎన్‌పీ నాయకుడు ఇష్రక్ హుస్సేన్ మద్దతుదారులు ఢాకా వీధుల్లో నిరసన ర్యాలీలు చేశారు.
ఢాకా సౌత్ సిటీ కార్పొరేషన్ (డీసీఎస్‌ఎసీ) మేయర్‌గా హుస్సేన్ ప్రమాణ స్వీకారం చేయాలంటూ మే 14న బీఎన్‌పీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళన మొదలుపెట్టారు.
తర్వాత ఈ ఉద్యమం, ఇద్దరు సలహాదారులు రాజీనామా చేయాలనే డిమాండ్‌గా పరిణామం చెందింది.
ఈ ఇద్దరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు ఖలీలుర్ రహమాన్‌ను కూడా పదవి నుంచి తొలగించాలని విలేఖరుల సమావేశంలో బీఎన్‌పీ డిమాండ్ చేసింది.
ఆర్మీ చీఫ్ ఏం చెప్పారు?
బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషీముద్దీన్ రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్, విదేశాంగ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్‌లతో ఏర్పడిన విభేదాలు, సమన్వయ లోపం కారణంగానే ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు.
ఎనిమిది నెలల క్రితమే ఆయన నియామకం జరిగింది. అమెరికాలో బంగ్లాదేశ్ రాయబారి అసమ్ ఆలమ్ సియామ్ తదుపరి విదేశాంగ కార్యదర్శి అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
డిసెంబర్ నాటికి దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని బుధవారం ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ అన్నారు.
దేశ భవిష్యత్‌ను నిర్ణయించడం ఎన్నికైన ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక హక్కు అని వ్యాఖ్యానించారు.
త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలను ఆలస్యం చేయడానికి, ప్రజల ఓటు హక్కును హరించడానికి ఒక ప్రణాళికబద్ధమైన కుట్ర జరుగుతోందని బీఎన్‌పీ నేత మీర్జా ఫఖ్రుల్ ఇస్లామ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)