You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒక చిన్న ఆఫ్రికన్ పురుగు.. భారతీయ వంట నూనెల కథనే మార్చేసిందా?
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
తలలో పేనంత చిన్నగా కనిపించే ఆఫ్రికన్ పురుగు ఒకటి భారత్‌లో వంటనూనెల దిగుబడి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దానిని ఆఫ్రికన్ ఆయిల్ పామ్ వీవిల్ (Elaeidobius kamerunicus) అని పేర్కొంటుంటారు.
ఈ 'చిన్న అతిథి' భారత ఆయిల్ పామ్ తోటల్లోకి వచ్చిన తర్వాత, మొక్కల మధ్య సహజ పరాగసంపర్కం (pollination) జరగడానికి సహాయకారిగా మారి, ఆయిల్ పామ్ దిగుబడులు, సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడిందని గుర్తించారు.
వంటనూనెల కోసం భారత్ సంప్రదాయ పంటలపై ఆధారపడుతుంది. కానీ, అధిక జనాభా ఉన్న భారతదేశానికి, ఏటికేడు పెరుగుతున్న వంటనూనెల డిమాండ్ తీర్చడం ఒక పెద్ద సవాలుగా మారిందనే చెప్పొచ్చు. వంటనూనెల (ఎడిబుల్ ఆయిల్స్) దిగుమతుల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది భారత్.
ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ గింజల ద్వారా ఐదు రెట్లు ఎక్కువగా నూనె లభిస్తుంది. సంవత్సరం అంతా కాపు వస్తుంది.
భారత సంప్రదాయ నూనె పంటలైన నువ్వులు, వేరుశనగ, ఆవాలు, కొబ్బరి లాంటి సీజనల్ పంటల్లో అతివృష్టి, అనావృష్టుల నేపథ్యంలో స్థిరమైన దిగుబడులు ఆశించడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ పామ్ నమ్మదగిన పంటగా, నూనె సమస్యకు పరిష్కారంగా భావిస్తున్నారు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా, ఈ పంట సాగును పెద్దఎత్తున విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో 'నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్ పామ్' (NMEO–OP) ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 28 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగుకు అనుకూల వాతావరణం ఉందని నిర్ధరణకు వచ్చింది.
1991-92లో భారత్‌లో ఆయిల్ పామ్ సాగు కేవలం 8 వేల హెక్టార్లు ఉంటే, 2025 మార్చి నాటికి అది 5.56 లక్షల హెక్టార్లకు చేరిందని కేంద్ర వ్యవసాయ శాఖ లోక్‌సభకు తెలిపింది.
వచ్చే ఏడాదికి ఈ విస్తీర్ణాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచడం NMEO–OP మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆఫ్రికా కీటకంతో భారత్‌లో దిగుబడులు ఎంత మేరకు పెరిగాయి?
ఆయిల్ పామ్ పుట్టినిల్లైన పశ్చిమాఫ్రికాలో సహజ పరాగసంపర్కం జరగడానికి ఎలైడోబియస్ కామెరునికస్ (Elaeidobius kamerunicus) కీటకం కారణమని మలేషియా వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు.
గతంలో భారత్ సహా మలేషియాలో మగ చెట్ల పువ్వుల నుంచి పుప్పొడిని సేకరించి ఆడ చెట్ల పుష్పాల మీద చల్లాల్సి వచ్చేది.
1981లో ఈ కీటకాన్ని ఆఫ్రికా నుంచి మలేషియాకు తీసుకువచ్చి అక్కడి ఆయిల్ పామ్ తోటల్లో ప్రవేశపెట్టారు. దాంతో అక్కడ దిగుబడులు అనూహ్యంగా పెరిగాయి.
మలేషియా అనుభవాలతో భారత్ అదే మార్గాన్ని అనుసరించింది.
భారత్‌లో తొలిసారి ఈ కీటకాన్ని 1985లో కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం తన వెబ్ పోర్టల్‌లో పేర్కొంది.
ఆ తర్వాత 1988లో ఆంధ్రప్రదేశ్‌లోని పెదవేగి వద్దనున్న 'భారత ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ' ( IIOPR) పరిధిలో ఆయిల్ పామ్ తోటల్లో ఈ కీటకాల జీవన చక్రంపై పూర్తి పరిశోధన చేశారు.
మొక్కల్లో పండ్ల గుత్తులు(బంచ్), గుత్తుల్లో ఏర్పడే ఫలాలో కూడా పెరుగుదల కనిపించిందని, నాణ్యతతోపాటు, ఎక్కువ నూనె పొందే అవకాశం ఏర్పడిందని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు.
''ఈ కీటకం రాక ముందు గుత్తుల నుంచి ఫలాలు రావడం 25 నుంచి 28 శాతం వరకు ఉండేది. అది వచ్చిన తర్వాత అది 78 నుంచి 85 శాతం వరకు పెరిగింది'' అని జగిత్యాల జిల్లా హార్టికల్చర్ అధికారి శ్యామ్ ప్రసాద్ బీబీసీకి చెప్పారు.
టాప్‌లో తెలుగు రాష్ట్రాలు
ప్రస్తుతం దేశంలో ఆయిల్ పామ్ సాగులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అగ్రస్థానాల్లో ఉన్నాయి.
2020 గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 1.86 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 1.12 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాలు, కేరళ కలిపి దేశ మొత్తం ఉత్పత్తిలో 98 శాతం వంతు వరకు ఇచ్చాయి.
ఆయిల్‌పామ్ దేశవ్యాప్త సాగుపై ఇటీవల లోక్‌సభలో వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ రెండు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందనే భావించాలి.
అయితే, తాజా వ్యవసాయ సంవత్సరం వరకు రాష్ట్రాల వారీగా వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.
NMEO–OP నివేదిక ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా వంటనూనెల వినియోగం 25 మిలియన్ టన్నులు దాటింది. కానీ, ఉత్పత్తి కేవలం 12.28 మిలియన్ టన్నులే జరిగింది.
లోటును పూడ్చేందుకు రూ.80 వేల కోట్ల విలువైన 13.35 మిలియన్ టన్నుల వంటనూనెలను దిగుమతి చేశారు. ఇందులో పామాయిల్ వాటా 56 శాతం.
ఇదే నివేదిక ప్రకారం ప్రతి భారతీయుడి వార్షిక వంటనూనెల వినియోగం 2012–13లో 15.8 కిలోల నుంచి 2020–21లో 19 కిలోలకు పెరిగింది.
అందుబాటులో ఉన్న గత ఆరేళ్ల (2015-2021)సమాచారం ప్రకారం.. భారత్ తన దేశీయ డిమాండ్‌లో సగానికి పైగా నూనెలను దిగుమతి చేసుకుంది.
ఆయిల్ పామ్ మొక్క భారత్‌కు ఎలా చేరింది?
19వ శతాబ్దం చివరిలో బ్రిటీషర్ల ద్వారా మొదటిసారి ఆయిల్ పామ్ మొక్క కలకత్తా 'నేషనల్ బొటానిక్ గార్డెన్'కు చేరింది.
తర్వాత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కలు కనిపించినా, అవి ఎక్కువగా వృక్ష పరిశోధనల కోసం నాటినవే.
అయితే, మహారాష్ట్రలో మాత్రం కొంత భిన్నంగా సాగునీటి కాల్వల గట్లను పటిష్టపరచడానికి ఆయిల్ పామ్ మొక్కలను నాటారని 'సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' (CPCRI) 1992 నివేదిక పేర్కొంది.
భారత్‌లో క్రమపద్ధతిలో ఆయిల్ పామ్ సాగును ప్రారంభించిన మొదటి రాష్ట్రం కేరళ. 1960లో తోడుపుళా అనే ప్రాంతంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ 40 హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించింది.
చిన్న రైతుల స్థాయిలో ఆయిల్ పామ్ సాగు మొదటిసారి 1987లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా పెదవేగి ప్రాంతంలో 86 మంది రైతులతో 160 హెక్టార్లలో ప్రారంభమైంది.
ఆ తర్వాతి కాలంలో ఇక్కడే భారత ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ ( IIOPR) ఏర్పాటైంది.
తెలంగాణలో మొదట ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సాగును కొందరు స్థానిక రైతులు చేపట్టారు. ఇటీవలి కాలంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ పంట విస్తీర్ణం పెరుగుతోంది.
జగిత్యాల జిల్లా పరిధిలో మొదటిసారి కోతకు వచ్చిన ఆయిల్ పామ్ తోటల్లో ఇటీవల ఆఫ్రికన్ ఆయిల్ పామ్ వీవిల్స్‌ను వదిలారు.
"ఇది విదేశీ కీటకమే అయినా, స్థానిక పంటలకు ఏమాత్రం నష్టం చేయదు. దీని జీవిత చక్రం ఆయిల్ పామ్ పుష్పాలపైనే ముగుస్తుంది'' అని జగిత్యాల జిల్లా హార్టికల్చర్ శాఖ అధికారి శ్యామ్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)