You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మష్రూమ్ మర్డర్స్: విషపు పుట్టగొడుగులు వడ్డించి ఈ మహిళ ముగ్గురిని చంపారని తేల్చిన ఆస్ట్రేలియా కోర్టు
- రచయిత, టిఫానీ టర్న్‌బుల్
- నుంచి, మోర్వెల్, ఆస్ట్రేలియా
విషపూరిత పుట్టగొడుగులతో భోజనం వడ్డించి ముగ్గురి బంధువుల మరణానికి కారణమైన ఆస్ట్రేలియా మహిళ ఎరిన్ పాటర్సన్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది.
2023లో ఆమె వండిన భోజనం వీరితోపాటు తిని బతికి బయటపడిన మరో బంధువుపై కూడా హత్యయత్నానికి పాల్పడ్డారన్న కేసులోనూ ఈమెను దోషిగా తేల్చారు.
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని చిన్నపట్టణమైన మోర్వెల్‌లో జరిగిన ఈ విచారణలో ఆమె, తమ చుట్టుపక్కల గ్రామాలలో కనిపించిన ‘డెత్‌క్యాప్’ పుట్టగొడుగులను సేకరించారని, ముగ్గురు వ్యక్తులు చనిపోవడం, కొందరు ఆసుపత్రి పాలైనప్పుడు ఆమె పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి, సాక్ష్యాలను రూపుమాపి, తన నేరాలను దాచేందుకు ప్రయత్నించినట్టు ఆధారాలు దొరికాయి.
అయితే ఆమె పొరపాటున ప్రాణాంతకమైన పుట్టగొడుగులు తీసుకువచ్చారని, తాను ప్రేమించే కుటుంబసభ్యులు వాటిని తినడంతో భయపడిపోయారని ఎరిన్ న్యాయవాదులు వాదించారు.
కానీ, ఆమె ఈ పనంతా ఉద్దేశపూర్వకంగానే చేశారని న్యాయస్థానం తీర్పు చెప్పింది.
ఎరిన్ పాటర్సన్ ఇంట్లో 2023 జులై 29న భోజనం చేసిన తరువాత పాటర్సన్ మాజీ మామ డాన్ పాటర్సన్ (70), అత్త గెయిల్ పాటర్సన్ (70), గెయిల్ సోదరి హెదర్ విల్కిన్సన్ (66) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొన్ని రోజుల తరువాత మృతి చెందారు.
హెదర్ విల్కిన్సన్ భర్త, స్థానిక పాస్టర్ ఇయాన్ విల్కిన్సన్ ఆస్పత్రిలో కొన్నివారాల చికిత్స అనంతరం కోలుకున్నారు.
ఈ విందుకు ఎరిన్ మాజీ భర్త సైమన్ పాటర్సన్‌కు ఆహ్వానం అందినప్పటికీ, చివరి నిమిషంలో ఆయన రాలేదు. అనేక సందర్భాలలో సైమన్ పై కూడా ఆమె హత్యాయత్నాలు చేశారని అభియోగాలు ఉన్నా, వాటిని విచారణ సమయంలో ఉపసంహరించుకున్నారు.
విక్టోరియా సుప్రీంకోర్టులో తొమ్మిది వారాల పాటు సాగిన విచారణలో పాటర్సన్ వాంగ్మూలం సహా 50మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆమె ఇంటి వద్ద చెత్తకుప్ప నుంచి ఆహార అవశేషాలను డిటెక్టివ్‌లు సేకరించారు.
బాధితుల ఆరోగ్యం క్రమంగా ఎలా క్షీణించిందో డాక్టర్లు వివరించారు. తమ బంధం ఎందుకు విడిపోయిందో ఎరిన్ మాజీ భర్త భావోద్వేగంతో తెలిపారు.
ఈ కేసులో ఆమె ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారు అనడానికి మొదట ఆధారాలు దొరకలేదు. ఇదే పాటర్సన్ న్యాయవాదులకు కీలకంగా మారింది.
పాటర్సన్ తనకు క్యాన్సర్ ఉన్నట్టుగా నమ్మంచి అతిథులను తన ఇంటికి పిలిచారని, తరువాత వారికి విషభోజనం వడ్డించారని, ఆపైన తానే అనారోగ్యంగా ఉన్నట్టు నటించి తనపై అనుమానాలు రాకుండా చేయాలని భావించినట్టు ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు.
అడవిలో పుట్టగొడుగులు సేకరించిన విషయంపై పోలీసులకు, వైద్య సిబ్బందికి అబద్ధం చెప్పినట్టు పాటర్సన్ అంగీకరించారు. ఆ భోజనం తయారీలో వాడిన ఫుడ్ డీహైడ్రేటర్‌ను పారేశారని, తన మొబైల్‌ను పలుమార్లు ఫార్మాట్ చేశారని, ఇవన్నీ ఆమె దోషి అని చెప్పడానికి సూచనలేనని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు.
ఎరిన్ పాటర్సన్ న్యాయస్థానంలో వాంగ్మూలం ఇస్తూ ‘‘తాను ప్రేమించే బంధువులకు హాని తలపెట్టాలనే ఉద్దేశం లేదు’’ అని తెలిపారు.
విషపు పుట్టగొడుగులను ఉద్దేశపూర్వకంగా భోజనంలో కలిపాననే విషయాన్ని ఆమె పదేపదే ఖండించారు.
తాను అనేక సంవత్సరాలుగా బులీమియా అనే సమస్యతో బాధపడుతున్నాని కోర్టుకు చెప్పారు. దీనివల్ల ఆ భోజనం తిన్న తరువాత తాను వాంతులు చేసుకున్నానని, దీనివల్లే మిగిలిన వారిలా తాను తీవ్ర అనారోగ్యానికి గురికాలేదని పాటర్సన్ కోర్టుకు తెలిపారు.
తాను బరువు తగ్గించుకునే శస్త్రచికిత్స చేయించుకున్న విషయం బయటకు చెప్పడం ఇష్టం లేక క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పానని పాటర్సన్ తెలిపారు.
తనకు అడవిలో పుట్టగొడుగులు సేకరించే అలవాటు ఉన్నా, తన బంధువుల అనారోగ్యానికి కారణం తానే అని ఎక్కడ నిందలు వేస్తారోనని తన హాబీ గురించి అధికారులకు చెప్పలేదని చెప్పారు.
విచారణ అనంతరం వారం రోజుల తరువాత న్యాయనిర్ణేతల బృందం నాలుగు అభియోగాల్లో పాటర్సన్‌ను దోషిగా తేల్చింది. ఇక ఆమె తన మిగిలిన జీవితం జైలులో గడపాల్సి రావచ్చు.
పాటర్సన్, విల్కిన్సన్ కుటుంబాలు ఈ తీర్పు వినడానికి కోర్టుకు రాలేదు. దీనిపై వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయరని ఆ కుటుంబ ప్రతినిధి ఒకరు చెప్పారు.
కోర్టు బయట విక్టోరియా పోలీసు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డీన్ థామస్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో పనిచేసిన అధికారులకు, ప్రాసిక్యూటర్లకు ధన్యవాదాలు తెలిపారు.
‘‘ముగ్గురు చనిపోయారు, మరొకరు తీవ్రంగా అస్వస్థతకు గురై ప్రాణాలతో బయటపడ్డారు. మనం బాధితులను మరిచిపోకూడదు’’ అన్నారు.
అలాగే ఈ కేసులో బాధితుల కుటుంబాలు గోప్యతను కోరుతున్నాయని, దానిని మనం గౌరవిద్దామని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)