You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెనికో: పెరూలో 3,500 ఏళ్ల నాటి నగరాన్ని గుర్తించిన ఆర్కియాలజిస్ట్‌లు
- రచయిత, జెస్సికా రాన్‌స్లే
- హోదా, బీబీసీ ప్రతినిధి
పెరూలోని ఉత్తర బరాంకా ప్రాంతంలో ఒక ప్రాచీన నగరాన్ని కనుగొన్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
పెనికోగా పిలుస్తున్న ఈ నగరం 3,500 ఏళ్ల నాటిదని భావిస్తున్నారు.
పసిఫిక్ తీరంలో తొలినాళ్లలో ఏర్పడిన సమాజాలు, అండీస్ పర్వత ప్రాంతాలు, అమెజాన్ నదీ తీరంలోని సమూహాలను అనుసంధానించే కీలక వాణిజ్య కేంద్రంగా పెనికో పని చేసిందని విశ్వసిస్తున్నారు.
ఈ నగరం పెరూ రాజధాని లిమాకు ఉత్తరాన 200 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉంది.
క్రీస్తు పూర్వం 1800-1500 మధ్య ఇది ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఆసియా, మధ్యప్రాచ్యంలో తొలి నాగరికతలు విలసిల్లిన కాలంలోనే ఇది కూడా ఉనికిలో ఉండి ఉండవచ్చని ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు.
తాము గుర్తించిన ఈ నగరం ద్వారా రెండు అమెరికా ఖండాల్లోని అత్యంత ప్రాచీన నాగరికతగా చెప్పే ‘కారల్’ వివరాలు తెలుస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
అమెరికన్ పురాతన నాగరికతకు దారి చూపిస్తుందా?
ఆర్కియాలజిస్టులు విడుదల చేసిన డ్రోన్ ఫుటేజ్‌లో నగరం మధ్యలో కొండ పైభాగంలో వృత్తాకార నిర్మాణం కనిపిస్తోంది. దీని చుట్టూ రాయి, మట్టితో కట్టిన భవనాల అవశేషాలు ఉన్నాయి.
ఈ ప్రాంతంలో ఎనిమిదేళ్లుగా చేస్తున్న పరిశోధనల ఫలితంగా 18 నిర్మాణాలు బయటపడ్డాయి. ప్రార్థనాలయాలు, నివాస సముదాయాలు వంటివి ఇందులో ఉన్నాయి.
ఇక్కడి భవనాలలో పరిశోధకులు ఉత్సవాలకు ఉపయోగించే వస్తువులు, మట్టితో చేసిన మనుషులు, జంతువుల బొమ్మలు, పూసలు, సముద్రపు గవ్వలతో చేసిన ఆభరణాలను గుర్తించారు.
పెరూలోనే సుపె లోయలో క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం నాటిదిగా చెప్పే అత్యంత ప్రాచీన కారల్ నగరానికి సమీపంలోనే పెనికో ఉంది.
కారల్‌లో 32 స్మారక చిహ్నాలు.. పెద్ద పిరమిడ్లు, అత్యాధునిక నీటి పారుదల సౌకర్యాలతో వ్యవసాయం, పట్టణ ఆవాసాలు ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)