You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం, పాకిస్తాన్ ఏం చెప్పిందంటే..
వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలో పాల్గొంటుందని ఐసీసీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
ఈమేరకు గ్రూప్-సిలో బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేసేలా మ్యాచ్ షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు చేసింది.
మరోవైపు, టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు పాల్గొనే విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బంగ్లాదేశ్‌ను ఈ ప్రపంచకప్‌లో ఆడటానికి అనుమతించాలన్నారు. పాకిస్తాన్, ఇండియాకు కుదిరిన హైబ్రిడ్ పద్ధతి బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు.
భద్రతా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమ మ్యాచ్‌లను భారత్‌నుంచి తరలించి, సహాతిథ్య దేశమైన శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే ఈ వారం ప్రారంభంలో ఐసీసీ బంగ్లా అభ్యర్థనను తిరస్కరించింది.
టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి భారత్, శ్రీలంకలో ప్రారంభం కానుంది. కాగా, పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి.
బంగ్లాదేశ్ అభ్యర్థన తిరస్కరణ...
తమ మ్యాచ్‌లను భారత్‌కు బదులుగా టోర్నమెంట్ సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్ ఈ వారపు ప్రారంభంలోనే చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది.
భద్రతాపరమైన ముప్పు ఉన్నట్లు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేదా సంకేతాలు లేవని ఐసీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తన పంతాన్ని వీడకుండా తన డిమాండ్‌ను మరోసారి పునరుద్ఘాటించింది.
ఐసీసీ బోర్డుకు అత్యంత సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌లో ఆడటంపై తమ నిర్ణయాన్ని ఖరారు చేయడానికి బీసీబీకి చివరిగా 24 గంటల సమయం ఇచ్చారు.
బీసీబీకి ఇచ్చిన ఆ 24 గంటల తుది గడువు ముగిసింది.
భారత్‌లో ఆడేందుకు వారు సుముఖత చూపకపోవడంతో, ఐసీసీ అధికారులు స్కాట్లాండ్‌ను టీ20 ప్రపంచకప్‌లోకి ఆహ్వానించే ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
త్వరలోనే ఐసీసీ, క్రికెట్ స్కాట్లాండ్, బీసీబీ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నాయి.
మరోవైపు, క్రికెట్ స్కాట్లాండ్ అధికారులు గత కొన్ని వారాలుగా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. పరిస్థితికి తగినట్లుగా సిద్ధంగా ఉండటానికి వారు ఇప్పటికే కొన్ని అంతర్గత ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
స్కాట్లాండ్ ఆటగాళ్లు ఇప్పటికే శిక్షణలో ఉన్నారు. వాస్తవానికి వారు మార్చిలో నమీబియా, ఓమన్‌లతో జరిగే వన్డే ట్రై-సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వారికి టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కింది.
అయితే, స్కాట్లాండ్ ఆటగాళ్లకు భారత్ వీసాలు పొందడం ఒక పెద్ద సవాలుగా మారనుంది. ఎందుకంటే ఫిబ్రవరి 7న (టోర్నీ మొదటి రోజే) కోల్‌కతాలో వెస్టిండీస్‌తో వారి మొదటి మ్యాచ్ జరగాల్సి ఉంది. సమయం చాలా తక్కువగా ఉండటమే దీనికి కారణం.
స్కాట్లాండ్ ఇప్పుడు గ్రూప్-సిలో చేరుతుంది. ఇందులో ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 14న కోల్‌కతాలో ఇంగ్లాండ్‌తో స్కాట్లాండ్ తలపడనుంది.
గత ఏడాది యూరోపియన్ క్వాలిఫైయర్స్‌లో స్కాట్లాండ్ నాలుగో స్థానంలో నిలిచి, అర్హత కోల్పోవడంతో యూరప్‌కు కేటాయించిన రెండు స్థానాలను నెదర్లాండ్స్, ఇటలీ దక్కించుకున్నాయి.
అయితే, 2009లో కూడా రాజకీయ కారణాల వల్ల జింబాబ్వే తప్పుకున్నప్పుడు, స్కాట్లాండ్‌కే ఇలాంటి లక్కీ ఛాన్స్ దక్కింది.
2024 నుంచి టీ20 వరల్డ్ కప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. దీంతో ప్రాంతీయ ప్రాతిపదికన టోర్నమెంట్‌కు అర్హత సాధించడం అంత సులభం కాదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)