You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టీ20 ప్రపంచకప్ ఆడకపోతే పాకిస్తాన్‌కు కలిగే నష్టమెంత?
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పాల్గొనడానికి 'అవకాశాలన్నీ మిగిలే ఉన్నాయి' అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యానించారు. దీనిపై తుది నిర్ణయం జనవరి 30 లేదా ఫిబ్రవరి2న తీసుకుంటామని తెలిపారు.
ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను కలిసిన తర్వాత నఖ్వీ ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు.
"ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో మంచి సమావేశం జరిగింది. ఐసీసీ సమస్య గురించి నేను ఆయనకు వివరించాను. అన్ని అవకాశాలూ పరిశీలించి సమస్య పరిష్కరించుకోవాలని ఆయన మాకు సూచించారు. జనవరి 30 లేదా ఫిబ్రవరి 2న తుదినిర్ణయం తీసుకుంటాం ''అని నఖ్వీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నీ కొలంబలో జరగనున్నాయి.
బంగ్లాదేశ్‌ను టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించచడాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విమర్శించింది.
ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ను చేర్చడానికి పాకిస్తాన్ అనుకూలంగా ఉంది. దీంతో వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పాల్గొంటుందో లేదోననే అనిశ్చితి ఏర్పడింది.
దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఇటీవల చెప్పారు.
పాకిస్తాన్ బహిష్కరిస్తుందా?
పాకిస్తాన్ ఈ టీ20 ప్రపంచ కప్ ఆడటానికి నిరాకరిస్తే ఐసీసీ కఠినచర్యలు తీసుకోవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
బంగ్లాదేశ్ విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, టోర్నమెంట్‌లో ఆడేందుకు ఆ దేశాన్ని అనుమతించాలని నఖ్వీ కోరినట్టు పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ తెలిపింది.
"నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా ఇదే విషయాన్ని చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలను పాటించకూడదు. ఇక్కడ ఓ దేశం తనకు కావలసినప్పుడల్లా నిర్ణయం తీసుకుంటుంది. మరొక దేశం విషయంలో మాత్రం పరిస్థితి తద్విరుద్ధంగా ఉంది'' అని మోహ్సిన్ నక్వీ వ్యాఖ్యానించారు.
"అందుకే బంగ్లాదేశ్‌కు అన్యాయం జరుగుతోందని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రపంచ కప్ ఆడటానికి అనుమతించాలని మేం కోరుతున్నాం. క్రికెట్‌లో బంగ్లాదేశ్ ప్రాతినిధ్యం కీలకమైనది. వారికి అన్యాయం జరగకూడదు" అని నఖ్వీ అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడకపోతే మీ "ప్లాన్ బి'' ఏమిటని నఖ్వీని అడగగా "ముందు నిర్ణయం రావాలి. మా దగ్గర ఏ,బీ, సీ ఇంకా డీ ప్లాన్ కూడా ఉంది " అని బదులిచ్చారు.
టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటే పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా భారీ నష్టం చవిచూడొచ్చు.
పాకిస్తాన్‌కు ఎలాంటి నష్టం జరుగుతుంది?
పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ ఆడకపోతే, ఐసీసీ అనేక చర్యలు తీసుకుంటుందని కొన్ని వర్గాలు చెప్పినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
"అంతర్జాతీయ జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటంపై నిషేధం విధించవచ్చు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లకు నిరంభ్యంతర పత్రాలు జారీ చేయరు. ఆసియా కప్ నుంచి కూడా పాకిస్తాన్‌ను బహిష్కరించవచ్చు" అని పేర్కొంది.
పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ ఆడకపోతే ఐసీసీ నుంచి అందే వార్షిక ఆదాయంపైనా ప్రభావం పడుతుంది.
"పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్‌లో ఆడటానికి నిరాకరిస్తే, ఐసీసీ నుంచి పీసీబీకి వచ్చే వార్షిక ఆదాయం ఆగిపోతుంది" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి హిందూస్తాన్ టైమ్స్‌తో అన్నారు.
నిజానికి 2023లో ఆదాయ పంపిణీని నిర్ణయించినప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి మొత్తం ఆదాయం 55వేల 70 కోట్లరూపాయలు (600 మిలియన్ డాలర్లు). 2024-27లో 38.5 శాతం వాటా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కు వెళ్లాలని డర్బన్‌లో నిర్ణయించారు.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 6.89 శాతం, క్రికెట్ ఆస్ట్రేలియా 6.25 శాతం పొందుతాయి.
ఐసీసీ నుంచి అత్యధికంగా ఆదాయం పొందే నాలుగో సభ్యదేశం పాకిస్తాన్. 5.75 శాతం వాటా లేదా దాదాపు 3,160కోట్లు(34.51 మిలియన్ డాలర్లు) పాకిస్తాన్ అందుకుంటుంది.
గతంతో పోలిస్తే పీసీబీ వాటా రెట్టింపు అయింది. అయితే ఐసీసీ ఆదాయ పంపిణీ ప్రమాణాలలో స్పష్టత లేకపోవడంపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. తగినంత పారదర్శకత లేదని పీసీబీ నమ్ముతోంది.
టీ20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ వైదొలగితే ఐసీసీ నుంచి లభించే భారీ మొత్తం ఆగిపోతుంది. దీని వల్ల క్రికెట్ బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
"పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. ఐసీసీ నుంచి వచ్చే డబ్బు దానికి అవసరం. టోర్నమెంట్‌ను పాకిస్తాన్ బహిష్కరిస్తే ఈ భారీ మొత్తం అందదు. అప్పుడు పీసీబీ ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశముంది'' అని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, రచయిత్రి నీరూ భాటియా అన్నారు.
"ఇప్పుడు పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్‌ను బహిష్కరిస్తే, అది భవిష్యత్తులో జరిగే ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్, టెస్ట్ ఛాంపియన్‌షిప్ కూడా ఆడలేకపోవచ్చు" అని ఆమె చెప్పారు.
ఐసీసీ ఏమంటోంది?
టీ 20 వరల్డ్‌కప్‌లో ఆడడానికి పాకిస్తాన్ నిరాకరిస్తే ఐసీసీ కూడా నష్టపోవచ్చు. పాకిస్తాన్‌లో టెలివిజన్, డిజిటల్ ప్రసార హక్కులను 2027 వరకు పీటీవీ (పాకిస్తాన్ టెలివిజన్), మైకోలకు కొన్ని నెలల క్రితం ఐసీసీ ఇచ్చింది. అయితే ఈ ఒప్పందం ఎంత మొత్తమన్నది ఐసీసీ వెల్లడించలేదు.
భవిష్యత్తులో ఈ ఒప్పందం ఆగిపోతే ఐసీసీకి నష్టాలు రావొచ్చు. ఆ మొత్తం ఎంతన్నది అంచనా వేయడం కష్టం.
పాకిస్తాన్ ఆడకపోతే ఐసీసీ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఆడితే భారత్‌తో మ్యాచ్‌లో తలపడాల్సిఉంటుంది. ఐసీసీకి ఎక్కువ ఆదాయం అందే మ్యాచ్ ఇది.
ప్రసారకర్తలు, ప్రకటనదారులకు భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్ చాలా ముఖ్యమైనది.
''పాకిస్తాన్ ప్రపంచ కప్ ఆడకపోతే ప్రసార సంస్థ చాలా ఇబ్బందుల్లో పడుతుంది. పాకిస్తాన్ స్థానాన్ని ఏ జట్టు భర్తీ చేస్తుంది? భారత్ వేరే జట్టుతో ఆడితే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూసేంత మంది ఆ మ్యాచ్‌ను చూస్తారా?" అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ది గేమ్ ప్లాన్ అనే యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ ప్రశ్నించారు.
భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఎఫ్ఐసీసీఐ) ప్రకారం గత 20 ఏళ్లలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు 10వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయని అంచనా.
"ఐసీసీ నష్టాలు చవిచూడటం సహజం. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే టికెట్లు పెద్ద సంఖ్యలో అమ్ముడుపోయాయి. టీవీలో వచ్చే భారీ ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌ల రూపంలో కూడా నష్టం ఉంది" అని నీరూ భాటియా అంటున్నారు.
పాకిస్తాన్ రిస్క్ తీసుకుంటుందా?
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పాకిస్తాన్ టోర్నమెంట్‌కు దూరంగా ఉండే రిస్క్ తీసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది?
"బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీసీ)పై మాకు పూర్తి సానుభూతి ఉంది. ఐసీసీ కఠినవైఖరిపై మేం నిరాశ చెందాం. కానీ ప్రపంచ కప్ ఆడకూడదనే ప్రశ్నే లేదు" అని పీసీబీలోని విశ్వసనీయ వర్గాలు నేషనల్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ తెలిపాయి.
"ఐసీసీ మెంబర్స్ ప్లేయింగ్ అగ్రిమెంట్ (ఎంపీఏ) కి కట్టుబడి ఉన్నాం. గత ఏడాది బీసీసీఐతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాం. 2027 వరకు అన్ని ఐసీసీ ఈవెంట్లకు హైబ్రిడ్ మోడల్ కోసం ఆమోదం ఉంది. ఈ సమయంలో దీని నుంచి వైదొలిగేందుకు ఎటవంటి కారణం లేదు" అని ఆయన అన్నారు.
టోర్నమెంట్‌ను బహిష్కరించాలనే ఆలోచనతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విభేదిస్తున్నాడు.
"బంగ్లాదేశ్ ఆడటం లేదు కాబట్టి టీ20 ప్రపంచ కప్‌ను పాకిస్తాన్ ఎందుకు బహిష్కరిం చాలనుకుంటోంది? పాకిస్తాన్ క్రికెట్ కోసం బంగ్లాదేశ్ ఏం చేసింది? ఇందులో నాకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. పాకిస్తాన్ ఆటగాళ్లు క్రికెట్‌పై దృష్టి సారించి ప్రపంచ కప్ గెలవడానికి ప్రయత్నించాలి" అన్నాడు .
పాకిస్తాన్ ప్రస్తుతానికి టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలగలేని పరిస్థితి ఉందని నీరూ భాటియా అన్నారు.
"ఐసీసీ ఈవెంట్లలో భాగం కావడం వల్ల పార్టిసిపేషన్ ఫీజు అందుతుంది. ఇది పీసీబీకి చాలా ముఖ్యం. చాలా దేశాల జట్లు పాకిస్తాన్‌లో పర్యటించేందుకు రావడం లేదు. అందువల్ల ఐసీసీ వారికి పెద్ద ఈవెంట్" అని నీరూ భాటియా అభిప్రాయపడ్డారు.
"పాకిస్తాన్ రిస్క్ తీసుకున్నప్పటికీ, ఐసీసీలో భాగమైన మరే ఇతర దేశమూ దానికి మద్దతుగా ముందుకు రాలేదు" అని విశ్లేషించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)