You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుంపు నుంచి ఆ పెంగ్విన్ ఎందుకలా ఒంటరిగా వెళ్లిపోయింది?
చివరికి ఆ పెంగ్విన్ ఎందుకు వెళ్లిపోయింది. అందరినీ, అన్నింటినీ వదిలేసి..
ఆకలి తప్ప మరేమీ దొరకని, ఒంటరితనం తప్ప తోడు దొరకని ఆ దారిలోకి ఎందుకు అడుగులు వేసింది?
కానీ వెళ్తూ వెళ్తూ... అది ఒక్క క్షణం ఆగింది. కేవలం ఒక్క క్షణం పాటు ఆగి వెనక్కి తిరిగి చూసింది.
తన వాళ్ళను, తనకు అలవాటైన ప్రదేశాన్ని, ఇప్పటి వరకు తాను గడిపిన జీవితాన్ని చివరగా ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నట్లుగా అది చూసింది.
ఆ క్షణంలో ఆ పెంగ్విన్ ఏం ఆలోచించి ఉంటుంది? భయపడిందా? లేక మన అవగాహనకు, మన మెదడుకు అంతుపట్టని మరేదైన భావన దాన్ని నడిపించిందా?
ఈ ప్రశ్నకు సమాధానం కోసం నేడు కోట్లాది మంది వెతుకుతున్నారు.
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఎంతగా ట్రెండ్ అయ్యిందో.. ఇప్పుడు ఈ ఒంటరి పెంగ్విన్ మీద చర్చ అంతగా నడుస్తోంది.
చెదిరిపోయిన నమ్మకానికి సంకేతమా?
బహుశా.. మీ సోషల్ మీడియా ఫీడ్‌లో కూడా ఆ వైరల్ పెంగ్విన్ క్లిప్ కనిపించే ఉంటుంది.
నివేదికల ప్రకారం, ఈ క్లిప్.. జర్మన్ ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జోగ్ రూపొందించిన 2007నాటి 'ఎన్‌కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్' అనే డాక్యుమెంటరీలోది.
ఒంటరిగా.. కొండల వైపు నడుస్తున్న ఆ పెంగ్విన్‌ను చూపిస్తూ హెర్జోగ్ డాక్యుమెంటరీలో ఇలా అంటారు.
'ఈ పెంగ్విన్ ఇక సముద్రం వైపు వెళ్లదు. తన మంద దగ్గరికి కూడా తిరిగి రాదు. అది నేరుగా పర్వతాల వైపు వెళ్లిపోతోంది. అది వెళ్తున్న దిశలో సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు దానికి ఎలాంటి ఆహారం గానీ, మనుగడ సాగించడానికి అనుకూల పరిస్థితులు గానీ లేవు. ప్రాణం నిలవడానికి ఆస్కారమే లేదు' అని హెర్జోగ్ వివరిస్తారు.
అలాగే పెంగ్విన్ల నిపుణుడు, ఎకాలజిస్ట్ డాక్టర్ ఎయిన్లీ చెప్పిన మాటలను డాక్యుమెంటరీలో ఆయన ఉటంకిస్తారు.
'ఒకవేళ దాన్ని పట్టుకుని తిరిగి వెనక్కి తీసుకువచ్చినా, అది వెనుదిరిగి అదే దిశలో ప్రయాణం మొదలుపెడుతుంది. అస్సలు ఆగదు...BUT WHY?'
అక్కడితో ఆ క్లిప్ ముగుస్తుంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో జనం తమకు తోచినట్లుగా దీనికి సమాధానాలు వెతుకు తున్నారు. కొందరికి ఆ పెంగ్విన్ తీసుకున్న నిర్ణయం గొప్ప ప్రేరణగా కనిపిస్తే, మరికొందరికి చెదిరిపోయిన నమ్మకంలా అనిపిస్తోంది.
కొందరికి ఇందులో జీవితంలోని చేదు నిజం కనిపిస్తుంటే, ఇంకొందరికి వైరాగ్యపు స్థితి కనిపిస్తోంది.
అయితే ఇందులో ఏదీ నిజం కాకపోవచ్చు. లేదా, ఇవన్నీ కలిపి ఆ ఒక్క చర్యలో ఉండవచ్చు.
దిశా నిర్దేశం కోల్పోవడం
ఆ డాక్యుమెంటరీ క్లిప్‌లో ఒక పెంగ్విన్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టడం చూపిస్తే, మరో పెంగ్విన్ అప్పటికే దారి తప్పి చాలా దూరం వెళ్లడాన్ని ఉదాహరణగా చూపించారు.
'పెంగ్విన్లలో ఈ రకమైన ప్రవర్తనను డిస్ ఓరియెంటేషన్ అంటే.. దిశా నిర్దేశం కోల్పోవడం లేదా డీరేంజ్డ్ అంటే విపరీత ప్రవర్తన అని పిలుస్తారు. పెంగ్విన్ అంతర్గత దిక్సూచి వ్యవస్థ దెబ్బతినడం వల్ల అది దారి తప్పిపోతుంది' అని డాక్యుమెంటరీలో డాక్టర్ ఎయిన్లీ వివరణ ఉంటుంది.
'పెంగ్విన్ల మెదడులో దిశను గుర్తించే ఒక రకమైన 'బయోలాజికల్ కంపాస్' ఉంటుంది. సూర్యుడి స్థానాన్ని, భూ అయస్కాంత క్షేత్రాలను బట్టి అవి ప్రయాణిస్తాయి' అని 'ది సైన్స్ బిహైండ్ పెంగ్విన్ నావిగేషన్' అనే కథనంలో అమెరికాకు చెందిన 'పెంగ్విన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్' అనే వెబ్‌సైట్ పేర్కొంది.
పెంగ్విన్ జాతుల సంరక్షణ, వాటిపై శాస్త్రీయ పరిశోధనలను ఇది ప్రచురిస్తుంది.
దీనికి ఉదాహరణగా, డాక్యుమెంటరీ వీడియోలో న్యూ హార్బర్ డైవింగ్ క్యాంప్ వద్ద కనిపించిన మరో పెంగ్విన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
డీరేంజ్డ్ పరిస్థితి కారణంగానే ఆ పెంగ్విన్ ఉండాల్సిన ప్రదేశం నుంచి అప్పటికే 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా డాక్టర్ అనీలీ పేర్కొన్నారు.
'ఇలాంటి పెంగ్విన్లు కనిపించినప్పుడు మనుషులు వాటి ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. వాటిని పట్టుకోకూడదు. అవి వెళ్తున్నప్పుడు నిశ్శబ్ధంగా నిలబడి వాటి దారిన వాటిని వదిలేయాలి' అని వర్నర్ హెర్జోగ్ వివరిస్తారు.
పెంగ్విన్ల గురించి వింత ప్రశ్నలు
వర్నర్ హెర్జోగ్ తన డాక్యుమెంటరీలో పెంగ్విన్ల ప్రవర్తన గురించి చాలా వింతైన ప్రశ్నలు అడుగుతారు.
కేవలం శాస్త్రీయ విషయాలకే పరిమితం కాకుండా, వాటి భావోద్వేగాల గురించి ఆయన డాక్టర్ ఎయిన్లీని ప్రశ్నిస్తారు.
''పెంగ్విన్లలో మతిస్థిమితం కోల్పోవడం లాంటివి ఉంటాయా?
ఎప్పుడైనా తమ గుంపు పట్ల విసుగు చెంది, "ఇక చాలు" అని దూరంగా వెళ్లిపోయే పెంగ్విన్లు ఉంటాయా?
రాళ్లకు తల కొట్టుకొని చనిపోయే పెంగ్విన్లను ఎప్పుడైనా చూశారా?'' అని ఆయన ప్రశ్నిస్తారు.
దీనికి డాక్టర్ ఎయిన్లీ సమాధానమిస్తూ, తాను ఎప్పుడూ అలాంటివి చూడలేదని, కానీ అవి దారి తప్పి వింత ప్రదేశాలకు చేరుకుంటాయని చెపుతారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)