You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సునీతా విలియమ్స్‌తో బీబీసీ స్పెషల్ ఇంటర్వ్యూ: ‘‘అంతరిక్షం నుంచి చూస్తే, భూమి మీద జరిగే ఈ గొడవలు, ఘర్షణలు చిత్రంగా అనిపిస్తాయి’’
- రచయిత, దివ్యా ఉప్పల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సునీతా విలియమ్స్ (సుని) దాదాపు మూడు దశాబ్దాల పాటు నాసా (ఎన్‌ఏఎస్‌ఏ) వ్యోమగామిగా వృత్తి జీవితాన్ని సాగించారు.
తన 27 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితం అనంతరం గత డిసెంబర్‌లో నాసా నుంచి పదవీ విరమణ చేసిన ఆమె, ఇటీవల కోజికోడ్‌లో జరిగిన 'కేరళ లిటరేచర్ ఫెస్టివల్'లో పాల్గొనడానికి భారతదేశానికి వచ్చారు.
దాదాపు పదేళ్ల తర్వాత భారతదేశంలో ఆమె చేసిన సుదీర్ఘ పర్యటన ఇదే.
దిల్లీ, కేరళ పర్యటనల సందర్భంగా సునీత పలువురు విద్యార్థులు, శాస్త్రవేత్తలు, లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్నవారితో ముచ్చటించారు.
తన అంతరిక్ష యానం, వృత్తి జీవితంలో అనూహ్యమైన ఘట్టాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆమె బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో మూడు సుదీర్ఘ మిషన్ల ద్వారా, సునీతా విలియమ్స్ 600 రోజులకు పైగా కక్ష్యలో గడిపారు.
అత్యధిక సంఖ్యలో 'స్పేస్‌వాక్' చేసిన మహిళగా రికార్డు కూడా ఆమెదే.
''నాసాలో ఉద్యోగం వస్తుందని అనుకోలేదు, అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం లభిస్తుందని అసలు ఊహించలేదు'' అని సునీత అన్నారు.
తన వృత్తి జీవితంలో ఘట్టాలను నెమరువేసుకుంటూ, తనకు గుర్తుండిపోయేవి కేవలం ఆ మిషన్లు మాత్రమే కావన్నారు.
''నన్ను నడిపించిన, మార్గదర్శకత్వం చేసిన, నన్ను ఈ స్థాయికి చేర్చిన అద్భుతమైన వ్యక్తుల గురించి ఆలోచిస్తాను. అలాంటివారితో కలిసి పని చేయడం నాకు అతిపెద్ద జ్ఞాపకం" అని సునీత అన్నారు.
అనుకున్నదానికన్నా ఎక్కువ రోజులు అంతరిక్షంలో...
సునీతా విలియమ్స్ 2024లో చేపట్టిన తన చివరి అంతరిక్ష యాత్ర కేవలం కొన్ని రోజులు మాత్రమే సాగాల్సి ఉంది. కానీ, అంతరిక్ష నౌక స్టార్‌లైనర్‌లో అనూహ్యంగా తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఆమె 9 నెలలకు పైగా ఐఎస్ఎస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
అలాంటి సంక్లిష్ట పరిస్థితులను కూడా ఆమె ఎంతో పాజిటివ్‌గా తీసుకున్నారు.
''నాకు అంతరిక్షంలో ఉండటమంటే చాలా ఇష్టం. కాబట్టి నాకేమీ ఇబ్బందిగా అనిపించలేదు'' అని ఆమె చెప్పారు.
''అదొక అద్భుతమైన ప్రయోగశాల. కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూడటం, జర్నల్ రాసుకోవడం, ప్రయోగాలు చేయడం వంటి నాకు ఇష్టమైన పనులెన్నో అక్కడ చేసుకునే అవకాశం దొరికింది'' అని సునీత అన్నారు.
శాస్త్రీయ ప్రయోగాలు, రోబోటిక్ ఆర్మ్ శిక్షణ, పరికరాల మరమ్మతులు, గ్రౌండ్ టీమ్‌లతో సమావేశాలు, గంటల కొద్దీ వ్యాయామంతో ఆమె దినచర్య తీరిక లేకుండా గడిచిపోయేదని చెప్పారామె.
''ప్రతి రోజూ ప్రత్యేకమే. ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది కాబట్టే చాలా సరదాగా ఉంటుంది'' అని సునీత చెప్పారు.
అయినప్పటికీ, అంతరిక్షంలో ఆ సుదీర్ఘ నిరీక్షణ మానసికంగా కొంత కష్టమే అనిపిస్తుంది.
''మా కుటుంబంతో కొన్ని ప్లాన్స్ చేసుకున్నాను. ముఖ్యంగా 80 ఏళ్ల వయసున్న మా అమ్మతో గడపాలనుకున్నాను'' అని సునీత అన్నారు.
''అమ్మతో ఉండలేకపోయినందుకు, అలాగే నా మేనకోడలు, మేనల్లుడితో కలిసి కొన్ని పనులు చేయలేకపోయినందుకు, కొంత టైమ్ మిస్సయ్యానన్న భావన కలిగింది'' అని చెప్పారు.
కానీ, కుటుంబం ఇచ్చిన మద్దతే తనను నిలబెట్టిందని ఆమె అన్నారు.
''నువ్వు ముందుకు సాగు, అక్కడ సంతోషంగా ఉండు, ఆలోచనల్లో మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకెళ్లు. క్షేమంగా తిరిగి రా’’ అంటూ తన కుటుంబసభ్యులు చెప్పిన మాటలు తనకెంతో భరోసా ఇచ్చాయని సునీత వివరించారు.
‘భారతదేశంలో మార్పు కనిపిస్తోంది.. ’
భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ, గత పర్యటన కంటే ఈసారి పరిస్థితి ఎంతో భిన్నంగా ఉందనిపిస్తుందని సునీతా విలియమ్స్ చెప్పారు.
''నేను ఇక్కడికి కొన్నిసార్లు వచ్చాను, వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు కనిపిస్తూనే ఉంది. రోడ్లు, ఫ్లైఓవర్లతో ప్రయాణం ఇప్పుడు చాలా సులభంగా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా సాంకేతికత కనిపిస్తోంది'' అని చెప్పారు.
ముఖ్యంగా సైన్స్, ఆవిష్కరణల రంగంలో భారతదేశం చూపుతున్న ఎదుగుదల తనను ఎంతగానో ఆకట్టుకుందని చెబుతారు సునీత.
''సాంకేతిక రంగంలో ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వాటిలో అంతరిక్ష రంగం కూడా ఒకటి'' అని సునీత అన్నారు.
వ్యక్తిగతంగా భారతదేశంతో ఆమెకున్న అనుబంధం చాలా దృఢమైంది.
సునీతా పూర్వీకుల గ్రామమైన గుజరాత్‌లోని ఝులాసన్ ప్రజలు, ఆమె విజయాలను తమ సొంతవిగా భావిస్తారు.
''వారి అభిమానం నన్ను ఎంతో వినమ్రురాలిని చేస్తుంది'' అని ఆమె అన్నారు.
''అక్కడికి మా నాన్న, కుటుంబంతో కలిసి వెళ్లాను. అందుకే ఆ అనుభూతి మరింత హృద్యంగా ఉంటుంది. అక్కడి ప్రజలు నాకు బాగా తెలుసు" అని చెప్పారు.
త్వరలోనే తన సోదరి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి మళ్లీ అక్కడికి వెళ్లాలని ఆమె ఆశిస్తున్నారు. ''మా నాన్న ఎంతో గొప్పగా చెప్పే, భారతదేశంలో ఒక విభిన్న ప్రాంతమైన కేరళను సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. కానీ, మా ఊరు ఝులాసన్‌కు కచ్చితంగా మళ్లీ వెళ్లాలి'' అని అన్నారామె.
‘అడ్డుగోడలు, గొడవలు అర్థంలేనివి...’
అంతరిక్షంలో కక్ష్య నుంచి భూగోళం వైపు చూసినప్పుడు దేశాల మధ్య ఉన్న అడ్డుగోడలు, గొడవలు అసలు అర్థం లేనివిగా అనిపిస్తాయని సునీతా విలియమ్స్ అన్నారు.
''మన గ్రహంవైపు చూస్తే, మనమంతా కలిసి ఈ ఒక్కచోట ఉన్నామనే నిజం అర్థమవుతుంది. అందరికీ ఒకే నీరు, ఒకే గాలి, ఒకే భూమి ఉన్నాయి’’ అని సునీత అన్నారు.
ఈ దృక్పథం వల్ల మనుషుల మధ్యనున్న విభజనలు చాలా చిన్నవిగా అనిపిస్తాయని ఆమె భావిస్తున్నారు.
''మనం ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు చాలా విషయాల్లో మునిగిపోయి, అనేక కారణాల వల్ల పరధ్యానంలో పడతాం. కానీ అంతరిక్షంలో ఉండి మనుషులపై ద్వేషం పెంచుకోవడం ఊహించలేను'' అని అన్నారు.
''అక్కడ నుంచి చూస్తే మనుషులు వాదులాడుకోవడం, తగాదాలు పడటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది'' అని ఆమె అభిప్రాయపడ్డారు.
''బహుశా మనమందరం కాసేపు ఆగి, ప్రకృతిలోకి వెళ్లి ప్రశాంతంగా ఉండాలేమో'' అని ఆమె అన్నారు.
''ఒకరి మాట ఒకరు వినాలి. ఎందుకంటే, ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక మంచి విషయం కచ్చితంగా ఉంటుంది" అని సునీతా విలియమ్స్ చెప్పారు.
‘కృత్రిమ మేధస్సుకు పరిమితులు ఉంటాయి...’
శాస్త్ర విజ్ఞానం, అంతరిక్ష యాత్రల్లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) అనేది ఒక శక్తిమంతమైన సాధనం అని సునీతా విలియమ్స్ అభివర్ణించారు. అయితే దీనికీ కొన్ని పరిమితులు ఉంటాయన్నారు.
''డేటాను చాలా వేగంగా ఏఐ విశ్లేషించగలదు, లెక్కలు కట్టగలదు, సమాచారాన్ని క్రోడీకరించగలదు'' అని చెప్పారు.
"పదేపదే చేసే పనులను రోబోట్లు సులభంగా చేయగలవు. అందువల్ల మనుషులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెట్టవచ్చు" అని ఆమె అన్నారు.
అయితే, ఏఐ అనేది కేవలం ఒక సాధనంగా మాత్రమే ఉండాలి తప్ప, అది మనిషికి ప్రత్యామ్నాయం కాకూడదని నొక్కి చెప్పారు.
''ఏఐ అనేది అంతిమమైనది కాదు. మనం మరింత లోతుగా అన్వేషించడానికి సహాయపడే సాధనం మాత్రమే'' అని అభిప్రాయపడ్డారు.
''అద్భుతాలు చేయగల మేధస్సు, అపారమైన మానవ శక్తి భారతదేశం సొంతం. ఈ దేశానికి ఆకాశమే హద్దు'' అని సునీత విశ్వాసం వ్యక్తం చేశారు.
‘ఇక పర్వతాలను అధిరోహించడమే.. ’
తన జీవితంలో తదుపరి ఘట్టం ఏమిటంటే, ప్రయాణాలు, కుటుంబం, కొత్త సవాళ్లతో నిండి ఉంటుందని సునీతా విలియమ్స్ చెప్పారు.
కేరళ తీర ప్రాంతాల నుంచి లద్దాఖ్ పర్వతాల వరకు భారతదేశాన్ని మరింతగా చుట్టి రావాలని ఆమె ఆశిస్తున్నారు.
''నేను పర్వతాలను ఇష్టపడే వ్యక్తిని, ఎప్పటికైనా ఆ దిశగా వెళ్లాలి'' అని ఆమె అన్నారు.
అంతరిక్షం ఏం నేర్పింది అన్న ప్రశ్నకు ఆమె క్షణకాలం ఆగి, ''ఓర్పుతో ఉండటం, ఒకరి మాట ఒకరు వినడం'' అని సమాధానమిచ్చారు.
చివరగా, రిటైర్మెంట్ తర్వాత తనకు అత్యంత ఉత్సాహపరిచే విషయమేమిటని అడిగితే, సునీత తడుముకోకుండా వెంటనే ఇచ్చిన సమాధానం... ‘‘పర్వతాలను అధిరోహించడం’’
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)