You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బంగారం ధర ఇంకా ఎంత పెరుగుతుంది, ఇప్పుడు కొనడం సురక్షితమేనా?
- రచయిత, రౌనక్ భేడా
- హోదా, బీబీసీ ప్రతినిధి
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జనవరి 26న, బంగారం ధర మొదటిసారిగా ఔన్సుకు (అంటే 28.35 గ్రాములు) 5,000 డాలర్ల మార్కును దాటింది.
అంటే ఔన్సు ధర రూ.4,57,000కు చేరుకుంది. దీని ప్రకారం, 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,000 రూపాయలు.
సంప్రదాయ పెట్టుబడులకు ఇప్పటికీ ఆదరణ ఉందని ఇది నిరూపించింది.
అలాగే, 2025లో బంగారం ధరల్లో ఎన్నడూ లేనంతగా ర్యాలీ స్పష్టంగా కనిపించింది. ఫలితంగా, ఒక్క ఏడాదిలోనే 60 శాతానికి పైగా పెరిగింది. 1979 తర్వాత బంగారం ధరల్లో ఇంత భారీ వార్షిక పెరుగుదల నమోదు కావడం గత ఏడాదే మొదటిసారి.
అయితే, బంగారం ధరల ఈ పెరుగుదల ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? ఈ పెరుగుదల వెనకున్న కారణాలేంటి ? ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బంగారం ధరల పెరుగుదలకు 3 మూడు ప్రధాన కారణాలేమిటి?
బంగారం ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి, అయితే అవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి.
ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరుగుతోంది. పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడం కంటే సంప్రదాయ ఆస్తులలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు కూడా డాలర్ వినియోగం తగ్గేందుకు, బంగారంపై ఆధారపడడం పెరగడానికి దారితీస్తున్నాయి.
"ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి" అని ఎసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ స్ప్రౌట్ ఇంక్ అధ్యక్షులు రెయాన్ మెక్‌యింటైర్ అన్నారు.
అమెరికన్ డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర బ్యాంకులు నిరంతరం బంగారం కొనుగోళ్లు జరుపుతున్నాయని పేర్కొన్నారు.
సాధారణంగా బంగారం, ఇతర విలువైన లోహాలను సురక్షితమైన పెట్టుబడులుగా పరిగణిస్తారు.
బంగారం ధర పెరగడానికి 3 కారణాలివే..
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధానాలు స్టాక్ మార్కెట్‌లో అనేక ఒడిదొడుకులకు కారణమయ్యాయి. ఫలితంగా, పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి లోహాలపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు.
వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో నిర్బంధం తర్వాత బంగారం ధరలు పెరిగాయి. అలాగే, ఇరాన్ నిరసనకారులను హింసాత్మకంగా అణచివేస్తున్నారంటూ ట్రంప్ ఆ దేశ ప్రభుత్వంపై బెదిరింపులకు దిగారు. గ్రీన్‌లాండ్ స్వాధీనం గురించి కూడా ప్రస్తావించారు.
సుంకాలు విధిస్తామంటూ యూరోపియన్ యూనియన్ దేశాలపై కూడా ఆయన బెదిరింపులకు దిగారు. వైట్‌హౌస్ నుంచి కొనసాగుతున్న ఈ అనిశ్చితి మార్కెట్లను భయాందోళనకు గురిచేస్తోంది.
చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తే 100 శాతం సుంకాలు విధిస్తామంటూ గత శనివారం డోనల్డ్ ట్రంప్ కెనడాను హెచ్చరించారు. అయితే, తమకు అలాంటి ఉద్దేశం లేదని కెనడా ఆ తర్వాత పేర్కొంది.
ఇవన్నీ పెట్టుబడిదారులను భయాందోళనకు గురిచేశాయి. ప్రపంచంలో ఏవైనా యుద్ధాలు, దురాక్రమణ, రాజకీయంగా భారీ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ప్రజలు తమ డబ్బును స్టాక్ మార్కెట్ లేదా అలాంటి ఇతర ప్రమాదకరమైన ఆస్తుల నుంచి వెనక్కుతీసుకుని.. బంగారం వంటి సంప్రదాయ, సురక్షిత ఆస్తులవైపు మళ్లించేందుకు మొగ్గుచూపుతారు.
ఈ అనిశ్చితి, ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపారు. ఈ మొగ్గు బంగారం డిమాండ్‌ను పెంచడంతో పాటు ధరలు వేగంగా పెరగడానికి కారణమైంది.
అలాగే, 2025లో ట్రంప్ చాలా దేశాలపై సుంకాలు విధించిన సమయంలోనూ పెట్టుబడిదారులు "సురక్షిత పెట్టుబడులకు" మళ్లారు. ఫైనాన్షియల్ మార్కెట్లు నష్టాల బాటపట్టినా కూడా తమ పెట్టుబడుల విలువ తగ్గకుండా నిలుపుకునే ఆస్తులను "సురక్షిత పెట్టుబడులు" (సేఫ్ హెవెన్స్)గా వ్యవహరిస్తారు. క్లిష్టతర పరిస్థితుల్లోనూ వీటి విలువ పెరుగుతుంటుంది.
వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఈ కొనుగోళ్లు 2022 నుంచి క్రమంగా పెరుగుతూ, 2025లో మరింత వేగవంతమై బంగారం ధరలను రికార్డు స్థాయికి చేర్చాయి.
అమెరికన్ డాలర్ ఆధిపత్యం తగ్గుతుండడంతో చైనా పోలాండ్, తుర్కియే, భారత్, కజికిస్తాన్ తదితర దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని రిజర్వ్ ఆస్తిగా చూస్తున్నాయి.
ఆంక్షలు, వాణిజ్య యుద్ధాలు, ప్రపంచ అస్థిరతకు బంగారం ఒక బీమా తరహాలో పనిచేస్తుంది. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతల (రష్యా - యుక్రెయిన్, మిడిల్ ఈస్ట్, ట్రేడ్ వార్స్) కారణంగా కూడా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి.
గోల్డ్‌మన్ శాక్స్ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలు నెలకు సగటున 60 టన్నుల బంగారం కొనుగోలు చేస్తున్నాయి. 2025 చివరి నాటికి పోలాండ్ సెంట్రల్ బ్యాంకు దగ్గర 550 టన్నుల బంగారం నిల్వలున్నాయి. తమ బంగారం నిల్వలను 700 టన్నులకు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ దేశ గవర్నర్ ఆడమ్ గ్లాపిన్స్కీ ఇదే నెలలో వ్యాఖ్యానించారు. ఆ దిశగా పోలాండ్ ప్రయత్నాలు కూడా చేస్తోంది. చైనా ఇప్పటికే గత 14 నెలలుగా వరుసగా బంగారం కొంటూనే ఉంది.
కేంద్ర బ్యాంకులు ధరలతో సంబంధం లేకుండా (అంటే, ధరలు పెరిగినా కూడా) పెద్దయెత్తున బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఇది మార్కెట్లో బంగారం సరఫరా తగ్గడానికి కారణం కావడంతో పాటు ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఎందుకంటే, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు.. ప్రైవేట్ పెట్టుబడిదారులు, ఈటీఎఫ్‌లు, రిటైల్ పెట్టుబడిదారులు కూడా అటువైపే మొగ్గుచూపుతారు. ఈ ధోరణి డిమాండ్‌ను మరింత పెంచుతుంది.
సాధారణంగా, అమెరికన్ డాలర్ బలహీనపడితే.. బంగారం ధరలు పెరుగుతాయి.
ఎందుకంటే, బంగారం క్రయవిక్రయాలు డాలర్లలో జరుగుతాయి. డాలర్ బలహీనపడితే, ఇతర దేశాల్లో బంగారం ధరలు తగ్గుతాయి. కాబట్టి, కొనుగోళ్లు పెరుగుతాయి. ఇది డిమాండ్‌ను పెంచడంతో పాటు ధరలనూ పెంచుతుంది.
ద్రవ్యోల్బణం, లేదా ఆర్థిక అనిశ్చితి కారణంగా డాలర్ బలహీనపడుతుంటుంది. అలాంటి సమయాల్లో, ప్రజలు బంగారాన్ని సురక్షిత మార్గంగా భావిస్తారు.
వాటికితోడు.. బలహీనమైన డాలర్, అమెరికాలోని తక్కువ వడ్డీరేట్లతో కలిపి బంగారంపై పెట్టుబడులు పెట్టడం తక్కువ రిస్క్ కలిగిస్తుంది. డాలర్ నుంచి దూరం జరగడమే బంగారం ధర పెరుగుదలకు దారితీసినట్లు అనలిస్టులు భావిస్తున్నారు.
యెన్(జపాన్ కరెన్సీ)ను బలపరచడంలో అమెరికా, జపాన్ ప్రయత్నాలతో డాలర్ బలహీనపడింది. బలహీనపడిన డాలర్ విదేశీ కొనుగోలుదారులకు బంగారం ధరలను తగ్గిస్తుంది. ఎందుకంటే, క్రయవిక్రయాలు డాలర్లలో జరుగుతాయి కాబట్టి. అందువల్ల, ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి.
ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుందా?
ప్రస్తుతానికైతే, బంగారం ధర పెరుగుతూనే ఉంటుందనేది నిపుణుల అంచనా.
మధ్యమధ్యలో కాస్త తగ్గినప్పటికీ, మొత్తంగా 2026లో బంగారం ధర ఎక్కువగానే ఉంటుందని వివిధ నివేదికలు సూచిస్తున్నాయి.
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి సీఏ సురిందర్ మెహతా బీబీసీతో మాట్లాడుతూ, "బంగారం ధరలు పెరగడానికి గల కారణాలన్నీ అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అదే జరిగితే, సురక్షిత పెట్టుబడుల వైపు పరుగులు తీసే వారి సంఖ్య పెరుగుతుంది. దానివల్ల బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది" అని అన్నారు.
లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ తాజా సర్వేలో.. 2026లో, బంగారం ధర 7,150 డాలర్లకు చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అలాగే, ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర 5,400 డాలర్లకు చేరుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది.
ఔన్సు బంగారం సగటు ధర 5,735 డాలర్లుగా ఉంటూ, గరిష్ఠంగా 6,400 డాలర్ల వరకూ చేరొచ్చని ఇండిపెండెంట్ అనలిస్ట్ రోజ్ నార్మన్ అంచనా. ఈ అనిశ్చితి ఇంకొంతకాలం కొనసాగుతుందని, అది బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని ఆయన విశ్వసిస్తున్నారు.
జేపీ మోర్గాన్ తెలిపిన దాని ప్రకారం, ఈ బంగారం ధరల ర్యాలీ ఇంకా ముగియలేదు. ధరల పెరుగుదల నిరంతరం అలాగే ఉండకపోవచ్చు. అంటే హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ.. ఈ ధరల పెరుగుదల ట్రెండ్ ప్రకారం, బంగారం విలువ మరింత పెరగొచ్చు. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, బ్యాంకులు డాలర్ నుంచి బంగారం వైపు మళ్లుతున్నారు.
దీని ప్రకారం, 2026 చివరినాటికి బంగారం ధర ఔన్సుకు సుమారు 5,000 డాలర్లకు చేరుతుంది. 2026 చివరి త్రైమాసికంలో సగటున ఔన్సుకు 5,055 డాలర్లు ఉండొచ్చు. 2027 చివరి నాటికి ఇది మరింత పెరిగి ఔన్సు 5,400 డాలర్లకు చేరవచ్చు.
భారత్‌లో ట్రెండ్ ఎలా ఉంది?
భారత్‌లోనూ బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే, అధిక ధరల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు మాత్రం తగ్గాయి. అమ్మకాలు దాదాపు సగానికి పడిపోయాయి.
సురిందర్ మెహతా బీబీసీతో మాట్లాడుతూ, "దేశంలో నగల కొనుగోళ్లు తగ్గాయి. అమ్మకాలు 40 నుంచి 50 శాతం వరకూ పడిపోయాయి. భవిష్యత్తులోనూ బంగారం ధర ఇదే స్థాయిలో పెరుగుతూ పోతే, ప్రజలు ఆభరణాల వైపు మొగ్గు చూపరు. కానీ, ధర కాస్త స్థిరపడితే.. ఆభరణాల మార్కెట్ మళ్లీ పుంజుకోవచ్చు" అని అన్నారు.
అలాగే, "నగలు కొనడం తగ్గినప్పటికీ, బంగారంలో పెట్టుబడులు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల 15 నుంచి 20 శాతం ఉంది. భవిష్యత్తులోనూ బంగారం ధరలు పెరుగుతాయని ప్రజలు భావిస్తుండడమే దీనికి కారణం" అన్నారాయన.
పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలా?
బంగారం ధరలు పెరగడంతో, బంగారంలో పెట్టుబడులు కూడా పెరిగాయి. మరికొంతకాలం బంగారం ధరలు ఇలాగే పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.
ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. పెద్దమొత్తంలో బంగారం కొనుగోళ్లు అంత మంచిది కాదు, మరీముఖ్యంగా బంగారం ధరలు భారీగా ఉన్నప్పుడు.
బంగారంలో పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటూ, మీ మొత్తం పెట్టుబడుల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం ఉత్తమం.
బెల్‌ఫాస్ట్ యూనివర్సిటీలో ఎకనామిక్ హిస్టారియన్ డాక్టర్ ఫిలిప్ ఫ్లయర్స్ గత ఏడాది మాట్లాడుతూ, "బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి, వీటిపై ఎక్కువగా ఆధారపడడం ప్రమాదకరం. ప్రభుత్వాలు కచ్చితమైన నిర్ణయాలు తీసుకుని, మార్కెట్లు స్థిరపడితే.. పెట్టుబడిదారులు మళ్లీ బంగారం నుంచి పక్కకు మళ్లడం ప్రారంభిస్తారు" అని అన్నారు.
ఒకవేళ బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, దీర్ఘకాలిక పెట్టుబడులకు వెళ్లాలని ఆయన సలహా ఇస్తున్నారు.
"అమెరికన్ స్టాక్ మార్కెట్, బంగారం మార్కెట్ కంటే సుమారు 200 రెట్లు పెద్దది" అని గోల్డ్‌మన్ శాక్స్ సంస్థకు చెందిన డాన్ స్ట్రూవెన్ అన్నారు.
అంటే, స్టాక్ మార్కెట్ లేదా బాండ్ మార్కెట్ నుంచి కొద్దిపాటి డబ్బు బంగారం మార్కెట్‌లోకి వచ్చినా.. అది బంగారం మార్కెట్‌లో భారీ పెరుగుదలకు దారితీస్తుంది.
"అయితే.. బంగారం ధర ఇంత వేగంగా, ఇంత భారీగా పెరగడం వల్ల ఒక బుడగ ఏర్పడుతోందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అంటే, ధర అకస్మాత్తుగా పడిపోవచ్చు. అందువల్ల, పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)