You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అజిత్ పవార్ మృతి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడేం జరగనుంది? ఫడణవీస్ ప్రభుత్వ మనుగడకు ఇబ్బందులు వస్తాయా?
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించారు. 66 ఏళ్ల అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం మహారాష్ట్రలోని బారామతిలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదానికి గురైంది.
అజిత్ పవార్ తన బాబాయి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీపై 2023 జులైలో తిరుగుబాటు చేసి, ఆ పార్టీని చేజిక్కించుకున్నారు.
2023 జులై 1 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ 2023 జులై 2న తన పార్టీకి చెందిన మరో 8 మంది సభ్యులతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు.
ఆ తర్వాత ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వంలో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం అజిత్ పవార్ ఎన్డీయే శిబిరంలో చేరారు.
ఈ శిబిరంలో చేరేందుకు పవార్ 2019 నుంచే ప్రయత్నిస్తున్నారని చెప్పేవారు.
తాను శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వంలో చేరాలని తీసుకున్న నిర్ణయంపై అజిత్ పవార్ అప్పట్లో మాట్లాడుతూ.. "ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోంది. అందుకే బీజేపీతో కొన్ని విభేదాలు ఉన్నా మహారాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వంతో చేతులు కలపాలని ఎన్‌సీపీ నిర్ణయించింది" అన్నారు.
శరద్ పవార్‌కు దెబ్బ
అజిత్ పవార్ వైఖరి శరద్ పవార్‌కు రాజకీయంగా ఎదురుదెబ్బే కాకుండా, మానసికంగానూ ఇబ్బంది కలిగించింది.
దీనిపై శరద్ పవార్ మాట్లాడుతూ ‘‘ఈ ఫిరాయింపుకు ప్రధాని మోదీనే బాధ్యుడు’’ అని చెప్పారు.
‘‘తన అధికారాన్ని ఉపయోగించి మోదీ ఇదంతా చేయిస్తున్నారు. మేం ప్రజల వద్దే తేల్చుకుంటాం'' అని అప్పట్లో చెప్పారు శరద్ పవార్. పార్టీని పునర్నిర్మిస్తామని తెలిపారు.
అజిత్ పవార్ వర్గానికి పార్టీ పేరు, గుర్తు లభిస్తుందా అనే ప్రశ్నపైనా అప్పట్లో పవార్ మాట్లాడుతూ ''వివిధ గుర్తులపై, నాలుగు వేరువేరు పార్టీల పేర్లతో అనేక ఎన్నికల్లో పోటీ చేశాను. ఇప్పుడది పెద్ద విషయం కాదు. నేను కోర్టు గుమ్మం తొక్కను. నేరుగా ప్రజల వద్దకే వెళతాను. మహారాష్ట్ర ప్రజలపై ప్రత్యేకించి యువతపై నమ్మకం ఉంది'' అన్నారు.
2024 ఎన్నికల్లో అజిత్ ఆధిపత్యం
మహారాష్ట్రలో 2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ తన పట్టేమిటో చూపింది. అంతకు 6 నెలల ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.
ఆ సమయంలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో అత్యంత బలహీనమైన పార్టీ అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీనే అని భావించేవారు.
కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ బలంగా ఎదిగారు. 41 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడమే కాక, తన బాబాయికు చెందిన ఎన్‌సీపీ(ఎస్పీ)తో పోల్చినప్పుడు తన బలం నిరూపించుకున్నారు.
ఎన్‌సీపీ(ఎస్పీ) కేవలం 10 అసెంబ్లీ సీట్లే గెలుచుకుంది.
అజిత్ పవార్ రికార్డు స్థాయిలో ఆరోసారి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా డిసెంబర్ 5, 2024న ప్రమాణ స్వీకారం చేశారు.
కానీ ముఖ్యమంత్రి కావాలనే తన ఆకాంక్షను చాలా కాలం నుంచి అణగదొక్కుతున్నారని ఆయన నమ్మేవారు.
ముఖ్యంగా 2004 నుంచి తన బాబాయి శరద్‌పవార్ ముఖ్యమంత్రి పదవి విషయంలో తనను విస్మరించారని అజిత్ నమ్మేవారు.
''అజిత్ పవార్‌కు తాను ముఖ్యమంత్రి కాలేదనే బాధ ఎప్పడూ ఉండేది'' అని మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరాఠ్వాడా యూనివర్శిటీలో జర్నలిజం మాజీ ప్రొఫెసర్ జైదీప్ డోల్ అన్నారు.
"2004లో అజిత్ పవార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, కానీ అది జరగలేదు. అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య మౌలికమైన తేడా ఏమిటంటే.. శరద్ పవార్ ఉన్నత విద్యావంతుడైన నాయకుడు, కానీ అజిత్ పవార్ కార్యదక్షుడు" అని జైదీప్ డోల్ చెప్పారు.
అజిత్, మరో ముగ్గురు ఎన్‌సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, చగన్ భుజ్‌బల్, హసన్ ముష్రిఫ్ ఈడీ విచారణలో ఉన్న సమయంలో బీజేపీ శిబిరంలో చేరారు.
బాబాయి ‘నీడ’లో ఎదగలేనని..
శరద్ పవార్ నీడలో 20 ఏళ్లపాటు రాజకీయ ప్రస్థానం కొనసాగించిన అజిత్ పవార్, తన మార్గానికి బాబాయి పవార్ అడ్డంకిగా మారారనే ఆలోచనకు వచ్చారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1999లో ఏర్పడింది.
ఆనాటి నుంచి తన పాతికేళ్ల ప్రస్థానంలో 2004 ఎన్నికలలో అత్యుత్తమ ఫలితాలు సాధించింది.
ఆ ఎన్నికలలో ఎన్‌సీపీ 71 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ బలం 69కు పరిమితమైంది.
ఈ పరిణామం అజిత్ పవార్ సీఎం అయ్యేందుకు అందివచ్చిన అవకాశం. కానీ ఓ వారంపాటు సాగిన సంకీర్ణ చర్చల తరువాత కాంగ్రెస్‌కు చెందిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ సీఎం అయ్యారు.
ఎన్‌సీపీకి చెందిన ఆర్.ఆర్. పాటిల్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
"అప్పటికీ అజిత్‌కు చాలామంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్న శరద్ పవార్ ముఖ్యమంత్రి పదవిని ఆయన నుంచి లాక్కున్నారని వారు విశ్వసించారు. బహుశా రాష్ట్ర రాజకీయాలపై తన నియంత్రణను వదులుకోవడానికి శరద్ పవార్ ఇష్టపడకపోయి ఉండొచ్చు" అని జైదీప్ డోల్ అన్నారు.
"కుటుంబ పరిస్థితులు కూడా శరద్ పవార్, అజిత్ మధ్య సంబంధాన్ని మరింత దెబ్బతీశాయి. శరద్ పవార్ 2005లో తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. రాజ్యసభ సభ్యురాలిగా సుప్రియా సూలే మొదట్లో రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నారు, కానీ తరువాత మహారాష్ట్ర ఎన్‌సీపీ వ్యవహారాల్లో ఆమె జోక్యాన్ని విస్మరించడం కష్టమని అజిత్ అర్ధం చేసుకున్నారు'' అని డోల్ చెప్పారు.
"2009లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్‌సీపీ రెండో స్థానానికి పడిపోయినప్పుడు, అజిత్ ఉప ముఖ్యమంత్రి కావడానికి తన శాయశక్తులా ప్రయత్నించారు. కానీ పవార్, ప్రఫుల్ పటేల్ కలిసి ఛగన్ భుజ్‌బల్‌ను ప్రోత్సహించారు. దీంతో ఆగ్రహించిన అజిత్ ప్రజా జీవితం నుంచి కొంతకాలం వైదొలిగారు. కానీ తరువాత కాలంలో అప్పట్లో బీజేపీ మొదట తనను సంప్రదించిందని, అప్పటి మిత్రపక్షమైన శివసేనతో కలిసి పవార్ నుంచి విడిపోవాలని కోరిందని అంగీకరించారు" అని డోల్ .
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో 2010లో, అశోక్ చవాన్ పేరు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆయన స్థానంలో పృథ్వీరాజ్ చవాన్‌ను ముఖ్యమంత్రిగా నియమించినప్పుడు అజిత్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
డిప్యూటీ సీఎం అయినప్పటికీ అజిత్ అసౌకర్యంగానే ఉండేవారు. 1999 నుంచి 2009 మధ్య మహారాష్ట్ర జలవనరుల శాఖామంత్రిగా తన పదవిని ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకున్నారనే బీజేపీ ఆరోపణలతో 2012లో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఇప్పుడేం జరుగుతుంది?
మహారాష్ట్ర జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం కోసమే అజిత్ పవార్ బారామతికి బయల్దేరారు.
ఆయన ఇక్కడ బహిరంగ సభ కూడా నిర్వహించాల్సి ఉంది.
ఎన్‌సీపీ బాధ్యత అంతా అజిత్ పవార్‌పైనే ఉంది.
శరద్ పవార్ రాజకీయంగా బలహీనంగా మారిన సమయంలో అజిత్ పవార్ మరణించారు.
"జిల్లా పరిషత్ ఎన్నికల్లో అజిత్ పవార్ తన బాబాయితో కలిసి పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు శరద్ పవార్ వైపు సానుభూతి పవనాలు వీచే అవకాశం ఉంది. బీజేపీ ఎదుగుదలతో మహారాష్ట్రలో మరాఠా నాయకుల ప్రతిష్ఠ బలహీనపడింది. ఈ విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు" అని జైదీప్ డోల్ అన్నారు.
దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంలో ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ ఉన్నాయి.
మహారాష్ట్ర శాసనసభలో 288 స్థానాలకు గానూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధారణ మెజార్టీకన్నా 12 సీట్లు తక్కువగా 132 సీట్లు గెలుచుకుంది. 57 మంది శివసేన ఎమ్మెల్యేలు, 41 మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.
అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్‌సీపీ ఈ ప్రభుత్వం నుంచి ఒకవేళ ఏదైనా కారణంతో వైదొలగినా ఫడణవీస్ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా ఉండదు.
అయితే అధికారం వారిచేతుల్లోనే ఉన్నా పరిస్థితులు వేరుగా ఉంటాయని జైదీప్ డోలే అన్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో హిందూత్వ ప్రభావం పెరుగుతున్నప్పటికీ అజిత్ పవార్ తన బలాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద విషయం అని ‘ది హిందూ’ మహారాష్ట్ర బ్యూరో చీఫ్ వినయ్ దేశ్‌పాండే అన్నారు.
"బీజేపీ, శివసేన రెండూ హిందూత్వ రాజకీయాలను ఆచరిస్తాయి. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ శివసేన సిద్దాంతపరంగా జాతీయవాది. ఈ సందర్భంలో అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రాంతీయ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి. కిందటి ఎన్నికల్లో ఎన్‌సీపీపై శరద్ పవార్ కన్నా తనకే ఎక్కువ పట్టుందని నిరూపించారు'' అని చెప్పారు దేశ్‌పాండే.
"బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది, కానీ మరాఠా రాజకీయాలు పురుడుపోసుకోవచ్చు. శరద్ పవార్ నేతృత్వంలో ఎన్‌సిపి తిరిగి ఏకం కావచ్చు. ఇది బీజేపీ బలానికి ఎదురుదెబ్బ" అన్నారు వినయ్ దేశ్‌పాండే
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)