You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌కు ఆ పేరు ఎవరు పెట్టారు?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వి.నవీన్ యాదవ్ 24,729 ఓట్లతో గెలుపొందినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇంతకీ జూబ్లీహిల్స్‌కు ఆ పేరు ఎలా వచ్చింది.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉందా..?
జూబ్లీహిల్స్ ప్రాంతానికి 88 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతున్నారు చరిత్రకారులు.
జూబ్లీహిల్స్ ప్రాంతం మొదటగా వెయ్యి ఎకరాల్లో ఏర్పడిందని హైదరాబాద్ కు చెందిన చరిత్రకారుడు మొహమ్మద్ సఫీవుల్లా బీబీసీతో చెప్పారు.
''అప్పటికే బంజారాహిల్స్ ప్రాంతం ఏర్పడింది. ఏడో నిజాం పాలనకు 25 ఏళ్లు అయిన సందర్భంగా బంజారాహిల్స్ పక్కనే వెయ్యి ఎకరాల్లో జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని నిజాం ప్రభుత్వం నోటిఫై చేసింది. అక్కడ నివాసాలకు అనుమతించాలని నిర్ణయించింది" అని చెప్పారు మొహమ్మద్ సఫీవుల్లా.
ఆ స్థలాన్ని మొదట బంజారాహిల్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ కు అప్పగించారని వివరించారు.
నిజాం పాలనకు 25 ఏళ్లు కావడంతో "సిల్వర్ జూబ్లీ" పదంలోంచి జూబ్లీని తీసుకుని ఆ ప్రాంతానికి జూబ్లీహిల్స్ అని పేరు పెట్టినట్లుగా మొహమ్మద్ సఫీవుల్లా బీబీసీతో చెప్పారు.
ఆ తర్వాత 1967 ప్రాంతంలో అప్పటి ఐఏఎస్ అధికారి సీహెచ్.నరసింహం ఇక్కడ తొలిసారిగా ఇల్లు కట్టుకున్నారని, అక్కడి నుంచి నివాసాలు బాగా పెరిగాయని చెబుతున్నారు.
హై ప్రొఫైల్ ప్రాంతంగా గుర్తింపు
జూబ్లీహిల్స్ ప్రాంతం హై ప్రొఫైల్ ప్రాంతంగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందింది.
ఇక్కడ సినిమా నటులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీల నివాసాలు, అన్నపూర్ణ స్టూడియో వంటివి ఉన్నాయి.
ఆధ్యాత్మికంగా పెద్దమ్మ తల్లి టెంపుల్, జగన్నాథ్ టెంపుల్ ఉన్నాయి.
జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఆనుకుని కేబీఆర్ పార్కు, దుర్గం చెరువు వంటి ప్రాంతాలున్నాయి. ప్రముఖ విద్యా సంస్థలు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, మీడియా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడి నుంచే పనిచేస్తున్నాయి.
నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ప్రాంతం కనిపించదు
విచిత్రంగా జూబ్లీహిల్స్ పేరుతో ఏర్పడిన నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ప్రాంతం కనిపించదు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సుమారు 91 రోడ్లు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.
"జూబ్లీహిల్స్ ప్రాంతం పేరుతో నియోజకవర్గం ఏర్పడినప్పటికీ, ఆ ప్రాంతం నియోజకవర్గంలో లేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో ఆ పేరు పెట్టారు'' అని సీనియర్ జర్నలిస్టు ప్రసాద్ చెప్పారు.
జూబ్లీహిల్స్ ప్రాంతమంతా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్ పేట, కృష్ణానగర్, యూసుఫ్ గూడ, రహ్మత్ నగర్, వెంగళరావునగర్, బోరబండ ప్రాంతాలు, బస్తీలు కనిపిస్తుంటాయి.
నగరంలోని కీలక ప్రాంతాలతో జూబ్లీహిల్స్ కు కనెక్టివిటీ కనిపిస్తుంటాయి.
అలాగే నగరంలో కీలకమైన బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలను కలుపుతుంది జూబ్లీహిల్స్ ప్రాంతం.
నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది?
జూబ్లీహిల్స్ నియోజవర్గం 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో విష్ణువర్దన్ రెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. అనంతరం ఆయన బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2018, 2023లో జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు మాగంటి గోపీనాథ్.
అయితే, ఈ ఏడాది (2025) జూన్ 8వ తేదీన మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక కారణంగా దాదాపు 11 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి చేజిక్కించుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)