You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అజిత్ పవార్: విమాన ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు ఏం జరిగింది?
"ల్యాండింగ్ సమయంలో ఏదో తేడాగా కనిపించింది. విమానం కూలిపోతుందని అనిపించింది"
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూ కుప్పకూలడాన్ని ప్రత్యక్షంగా చూసినవారు చెప్పిన మాట ఇది.
ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తోపాటు విమానంలో ఉన్న సుమిత్ కపూర్, శాంభవి పాఠక్, విదిప్ జాదవ్, పింకీ మాలీ మృతి చెందారు.
మరోవైపు విమానం బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ముందు పైలట్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) మధ్య జరిగిన సంభాషణ వివరాలను కూడా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ఆ ఆడియోలో విమాన ప్రమాదానికి ముందు అక్కడి పరిస్థితుల గురించి పైలట్, ఏటీసీల మధ్య జరిగిన సంభాషణ ఉంది.
ప్రాథమిక విచారణ గురించి విమానయాన శాఖ ఏం చెప్పింది?
ఈ ప్రమాదంపై విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి పీఐబీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం, బారామతి ఒక అన్‌కంట్రోల్డ్ ఎయిర్‌ఫీల్డ్ (అంటే, ఏటీసీ టవర్ లేనిది). ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ సమాచారాన్ని బారామతిలో ఉన్న ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఇన్‌స్ట్రక్టర్లు, లేదా పైలట్లు అందిస్తారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా ఈ విషయంపై వివరణాత్మక ప్రకటనను విడుదల చేసింది. అందులో ఇలా పేర్కొంది.
అక్కడ ఏటీసీ నిర్వహిస్తున్న వ్యక్తి చెప్పిన దాని ప్రకారం, జనవరి 28 ఉదయం 8.18 గంటలకు VI-SSK విమానం మొదటిసారి బారామతిని సంప్రదించింది.
అనంతరం, పుణె పరిధి దాటిన తర్వాత.. 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు పైలట్ బారామతికి కాల్ చేశారు.
అక్కడ కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులను బట్టి ల్యాండ్ కావొచ్చని పైలట్‌కు సూచన అందింది.
అప్పుడు.. అక్కడ గాలి ఎలా ఉంది, రన్‌వే విజిబిలిటీ గురించి విమాన సిబ్బంది ఆరా తీశారు. గాలి ప్రశాంతంగానే ఉందని, సుమారు 3000 మీటర్ల నుంచి విజిబిలిటీ కూడా ఉందని వారికి సమాచారం అందింది.
ఆ తర్వాత రన్‌వే 11పై దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమానం సిబ్బంది రిపోర్ట్ చేశారు. కానీ వారికి రన్‌వే కనిపించలేదు. మొదటి ప్రయత్నంలో గో అరౌండ్ ( ల్యాండింగ్‌కు వీలుకాని పక్షంలో విమానాన్ని మరోసారి గాలిలో చక్కర్లు కొట్టించడం) చేశారు.
గో అరౌండ్ తర్వాత, విమానం ప్రస్తుత పరిస్థితేంటని అడిగినప్పుడు.. తాము రన్‌వే 11పై దిగబోతున్నట్లు (ఫైనల్ అప్రోచ్) సిబ్బంది తెలిపారు.
రన్‌వే కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచనలు అందాయి. అందుకు వారు "ప్రస్తుతానికైతే రన్‌వే కనిపించడం లేదు. కనిపించగానే చెబుతాం" అని సమాధానం ఇచ్చారు.
కొద్ది సెకన్ల తర్వాత, రన్‌వే కనిపిస్తోందని చెప్పారు.
ఉదయం 8.43 గంటలకు, రన్‌వే 11పై విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించింది. కానీ, సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన (రీడ్‌బ్యాక్) రాలేదు.
ఆ తర్వాత, 8.44 గంటలకు రన్‌వే 11 మొదట్లో మంటలను గమనించింది ఏటీసీ. అనంతరం అత్యవసర సేవల విభాగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
రన్‌వే ప్రారంభానికి ముందు, ఎడమవైపున విమానం శిథిలాలు కనిపించాయి.
"ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం వచ్చిన తర్వాత తెలియజేస్తాం" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు?
ఒక ప్రత్యక్ష సాక్షి ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "నేను కళ్లారా చూశాను. చాలా బాధాకరం. విమానం కిందకు దిగుతున్నప్పుడే, అది ల్యాండ్ కావడం సాధ్యం కాదేమో అనిపించింది. చివరికి అదే జరిగింది. ఆ వెంటనే, పేలిపోయింది. చాలా తీవ్రమైన పేలుడు. మేం అక్కడికి వెళ్లి చూస్తే, విమానం మంటల్లో కాలిపోతూ కనిపించింది" అని చెప్పారు.
"ఆ తర్వాత, మరో నాలుగు ఐదు పేలుళ్లు జరిగాయి. ఇంకొంతమంది వచ్చిన తర్వాత, విమానంలోని వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, మంటలు చాలా తీవ్రంగా ఉండడంతో ఎవరూ ముందుకెళ్లలేకపోయారు. అజిత్ పవార్ కూడా విమానంలో ఉన్నారు, చాలా బాధాకరం. అది మాటల్లో చెప్పలేను" అని ఆ ప్రత్యక్ష సాక్షి అన్నారు.
విమానాశ్రయానికి సమీపంలోనే నివసించే మరో వ్యక్తి ఏఎన్‌ఐతో మాట్లాడుతూ,
"మేం ఈ ఏరియాలోనే ఉంటాం. మా వెనుక ఒక ఎయిర్‌స్ట్రిప్ ఉంది. విమానం రావడం మేం చూశాం. కానీ అది ల్యాండ్ కాలేదు. కొద్దిగా ముందుకెళ్లింది, కాసేపటి తర్వాత ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. కానీ రన్‌వేకు ముందే కూలిపోయింది" అని చెప్పారు.
"అది చూసిన వెంటనే, రన్‌వే చుట్టుపక్కల ఉన్న తెలిసిన వారికి సమాచారం ఇచ్చాం. ఆ తర్వాత పోలీసులు, మిగతా వాళ్లు అక్కడకు వచ్చారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సుమారు 15 నిమిషాల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి"
"దగ్గరకు వెళ్లి చూస్తే, మృతదేహం పూర్తిగా కాలిపోయి కనిపించింది. గుర్తుపట్టలేకపోయాం. కానీ, చేతిలో ఏదో ఉంది, దానిని బట్టి అది దాదా (అజిత్ పవార్) మృతదేహం అని మాకు అర్థమైంది" అని అన్నారు.
విమానం ఏ కంపెనీది, వివరాలేంటి?
పౌర విమానయాన మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ పీఐబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. VT-SSK, LJ-45 విమానం ముంబయి నుంచి బారామతి వెళ్తోంది.
ఈ లియర్‌జెట్ 45 మోడల్ విమానం.. కెనడాకు చెందిన బాంబార్డియర్ ఏరోస్పేస్ కంపెనీ తయారు చేసిన ఓ మధ్యరకం బిజినెస్ జెట్. ప్రపంచవ్యాప్తంగా అనేక చార్టర్ విమానయాన సంస్థలు ఈ మోడల్ విమానాలను వాడుతున్నాయి. ఇందులో గరిష్ఠంగా 8 మంది ప్రయాణించవచ్చు.
రెండు హనీవెల్ TFE731-20AR/BR టర్బోఫ్యాన్ ఇంజిన్లతో ఈ విమానం నడుస్తుంది.
మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం, ఈ విమానం దిల్లీకి చెందిన VSR వెంచర్స్ ఏవియేషన్ కంపెనీకి చెందినది. 2010లో తయారైంది.
ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ విమానాల ఆఖరి రెగ్యులేటరీ ఆడిట్ 2025 ఫిబ్రవరిలో జరిగింది. అప్పుడు ఎలాంటి లోపాలు బయటపడలేదు.
గతంలో ఇదే కంపెనీకి చెందిన, ఇదే తరహా విమానం 2023లో ముంబయిలో ల్యాండ్ అవుతూ కూలిపోయింది.
ఇదే వీఎస్సార్ సంస్థ యాజమాన్యంలోని లియర్‌జెట్ 45XR, VT-DBL విమానం 2023 సెప్టెంబర్ 14న ముంబయిలో ల్యాండ్ అవుతూనే రన్‌వే నుంచి పక్కకు జారిపోయి, రెండు ముక్కలైంది. అయితే, విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకారం, ఏఏఐబీ ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది.
సిబ్బంది గురించి..
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకారం, విమానంలో ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
ఒక పైలట్‌కు ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ (ATPL) ఉంది. అలాగే, 15 వేల గంటలు విమానం నడిపిన అనుభవముంది.
రెండో పైలట్‌కు కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL), 1,500 గంటల విమానయాన అనుభవం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)