You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అజిత్ పవార్: విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన మరణాన్ని డీజీసీఏ ధ్రువీకరించింది.
సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు పేర్కొంది.
వీటీ -ఎస్ఎస్‌కే రిజిస్ట్రేషన్‌తో, వీఎస్సార్ కంపెనీ ఆపరేట్ చేస్తున్న లియర్‌జెట్(ఎల్జే)45 విమానం బారామతిలో క్రాష్ ల్యాండింగ్ అయినట్లు డీజీసీఏ తెలిపింది.
కూలిపోయిన విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, సెక్యూరిటీ సిబ్బంది ఒకరు, పైలట్, కో పైలట్ ఉన్నట్లు పేర్కొంది.
ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని డీజీసీఏ తెలిపింది.
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినట్లు ఆయన వ్యక్తిగత సహాయకుడు అనిల్ ధిక్లే కూడా బీబీసీ మరాఠీకి ధ్రువీకరించారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోయిందని పీటీఐ రిపోర్ట్ చేసింది.
బారామతిలో క్రాష్ ల్యాండింగ్ జరిగినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.
విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో, ఉదయం 8.48 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
రానున్న జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల ప్రచారంలో భాగంగా బారామతిలో నాలుగు బహిరంగ సభలు ఏర్పాటు చేశారు.
ఆ సభల్లో పాల్గొనేందుకు, ఆయన ముంబై నుంచి విమానంలో బారామతి బయలుదేరారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదం జరగడంతో అజిత్ పవార్ సహా విమానంలోనూ ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాని మోదీ సంతాపం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
"అజిత్ పవార్ గారు ప్రజానాయకులు. కష్టపడి పనిచేసే వ్యక్తి. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందుండేవారు. పరిపాలనా విషయాలపై ఆయనకున్న అవగాహన, పేదలు, అణగారిన వర్గాల సాధికారతపై ఆయన తపన ప్రశంసనీయం. ఆయన అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి." అని ప్రధాని పోస్ట్ చేశారు.
"మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని ఆయన రాశారు.
చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"ఈరోజు ఉదయం విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాత్తుగా మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను" అని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసినట్లు తెలంగాణ సీఎంవో ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
లియర్‌జెట్ విమానం..
పవార్ ప్రయాణించిన లియర్‌జెట్-45 (LJ45) ఒక మధ్య తరహా విమానం. సాధారణంగా, దీనిని బిజినెస్ జెట్‌గా లేదా చార్టర్ ఫ్లైట్‌గా ఉపయోగిస్తారు.
కెనడియన్ విమాన తయారీ సంస్థ బాంబార్డియర్ తయారు చేసిన ఈ లియర్‌జెట్ విమానాలను అనేక చార్టర్ కంపెనీలు వాడుతున్నాయి.
దీనిలో రెండు హనీవెల్ TFE731-20AR/BR టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయి. ఒకేసారి 8 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. దాదాపు 3 వేల కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించగల విమానంగా దీనికి పేరుంది.
(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)