ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏమంటున్నాయి?

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు (కేసీఆర్)కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నంది నగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి.. ఆయన వ్యక్తిగత కార్యదర్శికి నోటీసులు అందించింది.

ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది.

ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను సిట్ విచారించింది.

తాజాగా కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి జనవరి 30 మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు స్పష్టం చేశారు.

దీనిపై కేసీఆర్ స్పందించాల్సి ఉంది.

కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుండగా.. దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే నోటీసులు జారీ అయ్యాయని కాంగ్రెస్ అంటోంది.

సిట్ నోటీసుల్లో ఏముందంటే...

2024 మార్చి 10న పంజాగుట్ట పొలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నం. 243/2024 కేసులో విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసినట్లుగా సిట్ అధికారులు పేర్కొన్నారు.

''కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు, వాస్తవాలపై మీకు అవగాహన ఉన్నట్లుగా తెలిసింది. కేసు తదుపరి విచారణలో భాగంగా మిమ్మల్ని (కేసీఆర్) విచారించాల్సి ఉంది'' అని నోటీసులో పేర్కొన్నారు.

ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 20న మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును సిట్ విచారించింది.

జనవరి 23న మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు (కేటీఆర్), జనవరి 27న మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను సిట్ విచారించింది.

ఈ ముగ్గురూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.

కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులలో విచారణ కోసం స్థలాన్ని ఆయనే చెప్పాలని సిట్ కోరింది.

''మీరు (కేసీఆర్) 65 ఏళ్లు పైబడిన వారు కావడంతో 1973 సీఆర్పీసీ సెక్షన్ 160 కింద పోలీస్ స్టేషన్‌కు హాజరుకావడం తప్పనిసరి లేదు. మీ ఇష్టపూర్వకంగా రావాలనుకుంటే జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు విచారణకు హాజరు కావొచ్చు లేదా హైదరాబాద్ నగర పరిధిలో ఏదైనా ప్రాంతాన్ని ఎంచుకుని చెప్పవచ్చు'' అని సిట్ నోటీసుల్లో పేర్కొంది.

దీనిపై కేసీఆర్ ఇంకా స్పందించాల్సి ఉంది.

నోటీసులపై బీఆర్ఎస్ ఏమంటోందంటే...

కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది.

''తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం'' అంటూ 'ఎక్స్'లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

''ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు.. ప్రజల తీర్పుతోనే రాస్తారు'' అని అన్నారాయన.

మరో సీనియర్ నేత హరీష్ రావు కూడా దీనిపై స్పందించారు.

''కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే రేవంత్'' అంటూ 'ఎక్స్'లో పోస్టు చేశారు.

కల్వకుంట్ల కవిత ఏమన్నారంటే..

ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదో ఒక దశలో ముగింపునకు రావాలని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

''మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చినట్లుగా అర్థమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం భాధాకరం. కేసు దర్యాప్తు పూర్తి చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా.. లేదా.. అన్నది వేచి చూడాలి'' అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏమందంటే…

వాస్తవాలు తెలుసుకోవడానికే సిట్ వేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. చట్టం ముందు అందరూ సమానమేనని ఎంపీ మల్లు రవి అన్నారు.

''ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారణ కోసం పిలిచారు. అదే క్రమంలో కేసీఆర్‌ను కూడా పిలిచారు. పోలీసులకు లభించిన ఆధారాలను బట్టి వారు చర్యలు తీసుకుంటారు. దీంట్లో ఎవరి ప్రమేయం ఉన్నా.. చట్టపరంగా చర్యలు ఉంటాయి'' అని దిల్లీలో మీడియాతో చెప్పారాయన.

ఇదే విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని అన్నారు.

''ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శక విచారణ జరగాలి. వాస్తవాలు తెలుసుకోటానికి సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చు. సిట్ సంపూర్ణ విచారణ జరిగితేనే నిజాలు బయటికి వస్తాయి'' అన్నారు మహేశ్ కుమార్ గౌడ్.

బీజేపీ ఏమంటోందంటే...

ఫోన్ ట్యాపింగ్ సహా కాళేశ్వరం వంటి కేసులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది.

''ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో నిజమైన విచారణ జరగడం లేదు. జరుగుతున్నది అంతా యాక్టింగ్ మాత్రమే. యాక్షన్ తీసుకోవడం లేదు. నోటీసులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవడానికే పరిమితమవుతున్నారు'' అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు జరిగిందిదీ..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మొట్టమొదటగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావుపై ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ డి. రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. 2024 మార్చి 10న 243/2024 ఎఫ్ఐఆర్ నమోదైంది.

అయితే, నేరుగా ఫోన్ ట్యాపింగ్ అని లేకపోయినా, గుర్తుతెలియని వ్యక్తుల ప్రొఫైల్స్ రూపొందించి రహస్యంగా పర్యవేక్షించారని అందులో పేర్కొన్నారు.

''ఎస్ఐబీ ఇన్‌స్పెక్టర్, డీఎస్పీగా పనిచేస్తున్న క్రమంలో ప్రణీత్ రావు ప్రత్యేకంగా ‌‍ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల ప్రొఫైల్స్ సిద్ధం చేసుకున్నారు. వారి కదలికలను అక్రమంగా, రహస్యంగా గమనించేవారు. దీనికోసం ప్రత్యేకంగా 17 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని డేటా బేస్ ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ 2023 డిసెంబరు 4న ఎస్ఐబీ కార్యాలయానికి వచ్చి ధ్వంసం చేశారు. డేటాను కంప్యూటర్ల నుంచి డిలీట్ చేశారు'' అని అదనపు ఎస్పీ రమేశ్ తన ఫిర్యాదులో రా‌‍శారు.

''ఆఫీసుకు వచ్చినప్పుడు ఎలక్ట్రీషియన్ సహాయంతో సీసీ కెమెరాలు పనిచేయకుండా నిలిపేశారు. సీసీ కెమెరాలను నిలిపివేసి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. అందులోని ఐఎంఈఐ నంబర్ల డేటా తీసేశారు. దీని వెనుక నేరపూరిత కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్ 409, 427, 201, 120(బి), ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్-1984 సెక్షన్ 3, ఐటీ చట్టం సెక్షన్ 65, 66, 70 ప్రకారం చర్యలు తీసుకోవాలి'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు రమేశ్.

ఫోన్‌ ట్యాపింగ్ చేసి, బెదిరించారంటూ కొందరు వ్యాపారులు కూడా ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వరుసగా పోలీసు అధికారుల అరెస్టులు

2024 మార్చి 12న ప్రణీత్ రావును పోలీసులు అరెస్టు చేయగా, అదనపు డీసీపీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్నలను మార్చి 23న అరెస్టు చేశారు పోలీసులు. అదే నెల 29న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధా కిషన్ రావును సిట్ అధికారులు అరెస్టు చేశారు.

అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు 2024 డిసెంబరులో రాధా కిషన్ రావు జైలు నుంచి బెయిల్‌పై విడుదల కాగా, 2025 జనవరిలో భుజంగరావు, తిరుపతన్నలకు బెయిల్ మంజూరైంది.

2025 ఫిబ్రవరిలో ప్రణీత్ రావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు విచారణ

కేసులో అప్పటి ఎస్ఐబీ ఛీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావును కేసులో కీలక నిందితుడిగా పేర్కొంటూ 2024లోనే పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. అనంతరం ప్రభాకరరావుతోపాటు శ్రవణ్ రావు అనే వ్యక్తి అమెరికాలో ఉన్నట్లుగా గుర్తించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.

అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకరరావు అమెరికా నుంచి వచ్చి 2025 డిసెంబరు 12న దర్యాప్తు అధికారుల ముందు హాజరై తన స్టేట్మెంట్ రికార్డు చేశారు.

డిసెంబరు 26న మరోసారి పోలీసులు ఆయన్ను విచారించారు.

సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం

కేసు దర్యాప్తు చేసేందుకు 2025 డిసెంబరు 19న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో తొమ్మిది మంది అధికారులతో సిట్ ఏర్పాటైంది. దర్యాప్తు అధికారిగా అప్పటివరకు విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరినే కొనసాగించింది.

దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తూ వస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)