భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమెరికాకు ఇచ్చిన సందేశమేంటి?

    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాకు ఎగుమతి చేస్తున్న వస్తువులకు భారత్ 50 శాతం సుంకాలను చెల్లిస్తోంది. అలాగే, యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలు 15 శాతం సుంకాలను చెల్లిస్తున్నాయి.

ఇక ఇప్పుడు భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందాన్ని అమెరికాకు ఒక సందేశంగా చూస్తున్నారు నిపుణులు.

భారత్‌పై యూరప్‌ కూడా పన్నులు విధించాలని అమెరికా కోరుకుంది. కానీ, అలా జరగలేదు.

ఈ విషయంపై జనవరి 24న అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. ''రష్యా నుంచి చమురు కొంటున్న భారత్‌పై పన్నులు విధించేందుకు మా యూరప్ మిత్రదేశాలు నిరాకరించాయి. ఎందుకంటే, భారత్‌తో వారు అతిపెద్ద వాణిజ్య ఒప్పందాన్ని కావాలనుకుంటున్నారు. యుక్రెయిన్‌పై జరుగుతోన్న యుద్ధంలో రష్యాకు యూరప్ పరోక్షంగా సహకరిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత నెలలో న్యూదిల్లీకి రాగా, తాజాగా భారత గణతంత్ర వేడుకలకు యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా వచ్చారు.

ఈయూ-భారత్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించిన యూనివర్సిటీ ఆఫ్ అల్బనీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ క్లారీ, ''ఈయూ-భారత్ వాణిజ్య ఒప్పందం, ఇతర దేశాలకు కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఒకవేళ అమెరికా తన ఆర్థిక ఆధిప్యతాన్ని ఆధారంగా చేసుకుని సుంకాల విధానాన్ని రూపొందించి, దాన్ని దుర్వినియోగం చేస్తే.. ఈ ఒత్తిడి ఎలాంటి ఉపయోగకరమైన ఫలితాలను ఇవ్వదు. అమెరికా ఏకపక్ష చర్యలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెరుగుతాయి'' అని అన్నారు.

అమెరికాపై భారత్ ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుందని ప్రముఖ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ చెప్పారు.

''సప్లై చెయిన్లకు అంతరాయం కలిగినప్పుడు, రక్షణవాదం పెరుగుతున్నప్పుడు ఈ సంక్షోభ సమయంలో, ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం కాకుండా అంతకంటేమించింది'' అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో బ్రహ్మ చెల్లానీ అన్నారు.

''ఇదొక వ్యూహాత్మక భద్రత ఒప్పందం. చైనా పరంగా కేంద్రీకృతమైన వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా భారత్, ఈయూలను ఒక ప్రజాస్వామ్య సమతుల్యత శక్తిగా ఈ ఒప్పందం నిలబెడుతుంది. సుంకాలను ఆయుధాలుగా మలుచుకునే ట్రంప్ వ్యూహాన్ని బలహీనరుస్తుంది. చైనా, అమెరికాలపై భారత్ ఆధారపడటాన్ని ఈ ఒప్పందం తగ్గిస్తుంది'' అని బ్రహ్మ చెల్లానీ సామాజిక మాధ్యమంలో రాశారు.

సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన న్యూదిల్లీలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ''భారత గగనతలంపై అమెరికా తయారు చేసిన విమానాలు ఎగరడం చూసి చాలా సంతోషంగా ఉంది'' అని అన్నారు.

అయితే, కేవలం అమెరికన్ జెట్లు మాత్రమే కాదు. భారత గగనతలంలో రష్యా జెట్లు కూడా విన్యాసాలు చేశాయి. రష్యాకు చెందిన ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా పరేడ్‌లో ప్రదర్శించారు.

అయితే, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లకు ఇది కాస్త అసౌకర్యంగా అనిపించవచ్చు.

రష్యాకు చెందిన ఈ ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను నాటో తనకు ముప్పుగా భావిస్తోంది.

''గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భారత తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈయూ నేతల సమక్షంలోనే.. రష్యా మిలటరీ హార్డ్‌వేర్, డిజైన్లతో తయారైన ఎస్-400 క్షిపణి వ్యవస్థ, టీ-90 ట్యాంకులతో పాటు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ప్రదర్శించింది'' అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ‘ది హిందూ’ పత్రిక డిప్లొమాటిక్ అఫైర్స్ ఎడిటర్ సుహాసిని హైదర్ పేర్కొన్నారు.

రష్యాకు భారత్ దగ్గర కావడం తగ్గించుకోవాలని ట్రంప్, యూరప్‌‌ కోరుకుంటున్నాయి. కానీ, భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా చేసినట్లుగా యూరప్ ఎలాంటి సుంకాలను విధించలేదు.

భారత గగనతలంలో అమెరికా జెట్లను చూసి ఆనందంగా ఉందని మాత్రమే సెర్గియో గోర్ చెప్పారు. అయితే, రష్యా జెట్లను, ఎస్-400ను ప్రదర్శించడం ఆయనకు కూడా అసౌకర్యంగా అనిపించి ఉండొచ్చు.

ఎఫ్‌టీఏ ఒక వ్యూహాత్మకమా?

అయితే, ఈ పరిణామం వల్ల తలెత్తే అసౌకర్యాన్ని భారత్ పట్టించుకోవడం లేదని, ట్రంప్‌కు ఈ విషయం నచ్చడం లేదని దిల్లీకి చెందిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ)కు చెందిన అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.

'' అమెరికాలో దౌత్య వాతావరణం ఎప్పుడూ ఒకేవిధంగా ఉండదు. ట్రంప్ పరిపాలన పూర్తిగా అంతర్గత రాజకీయాలు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిపైనే (లావాదేవీల ఆధారితంగా సాగే సంబంధాలపైనే) దృష్టిపెట్టింది. ఇవి సంప్రదాయంగా కొనసాగిన పరస్పర సహకార బంధాలకు గండికొట్టాయి. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని భారత్ కోరుకుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా దానిపై ఆధారపడటం ప్రమాదం కావొచ్చని భారత్ అర్థం చేసుకుంది'' అని అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.

''ట్రంప్ విదేశాంగ విధానంలో స్థిరత్వం లోపించింది. పాకిస్తాన్, చైనా, రష్యా లాంటి దేశాలపై తన వైఖరిని తరచూ మార్చుకుంటున్నారు ట్రంప్. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక వ్యూహాన్ని ఏర్పరుచుకోవడం భారత్‌కు కష్టం. అమెరికా అసౌకర్యానికి భారత్ నిత్యం తలొగ్గదు'' అని అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.

అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు భారత్ చాలా దేశాలతో ఎఫ్‌టీఏలను కుదుర్చుకుంటోంది.

''ఈయూ, భారత్ ఎఫ్‌టీఏ ఒప్పందం కుదరడానికి కారణం ట్రంప్ విధానాలే. ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు రెండు దేశాలు చాలా ఉదారంగా వ్యవహరించాయి. అయితే, ప్రశ్నేంటంటే.. ఈయూతో ఎఫ్‌టీఓ కుదుర్చుకోవడం ద్వారా ట్రంప్ సుంకాల ప్రభావాన్ని తగ్గిస్తుందా ?'' అని అజయ్ శ్రీవాస్తవ సందేహం వ్యక్తం చేశారు.

''ప్రతి దేశానికి అమెరికా పెద్ద మార్కెట్. గత రెండు నెలల్లో అమెరికాకు వెళ్లే భారత ఎగుమతులు 20 శాతం తగ్గాయి. అమెరికా నుంచి నష్టాలు కూడా వస్తున్నాయి. ఈయూతో జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడానికీ ఇంకో సంవత్సరం పడుతుంది. ఇది అమలైతే, భారత ఎగుమతులు పెరుగుతాయి. ట్రంప్ సుంకాల ఒత్తిడి తగ్గుతుంది. ఎవరిపైనా ఆధారపడవద్దనే నిజాన్ని తెలియజేసినందుకు ట్రంప్‌కు థ్యాంక్స్ చెబుతాను. ట్రంప్ వల్ల భారత్ ఇప్పటికే ఎన్నో సంస్కరణలను అమలు చేస్తోంది. ఎఫ్‌టీఏ చర్చలు కూడా జరుగుతున్నాయి. అమెరికాపై ఆధారపడటం ప్రమాదకరం'' అని శ్రీవాస్తవ అన్నారు.

అంతకుముందు, ఒమన్, న్యూజీలాండ్, యూకేలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై భారత్ సంతకాలు చేసింది. ఈయూతో ఎఫ్‌టీఏ చర్చలు ఎన్నో సంవత్సరాలుగా సాగాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న సమయంలో ఈ డీల్ ఖరారైంది.

ఈయూతో కుదిరిన ఈ ఎఫ్‌టీఏ ప్రభావమెంత?

అమెరికా, చైనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్, ఈయూ రెండూ కోరుకుంటున్నాయి. అంతకుముందు భారత్‌ తన పూర్తి మార్కెట్‌ను ప్రపంచ దేశాలకు తెరవకపోవడంతో, రక్షణాత్మక ధోరణి గల దేశంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ పేరును పోగొట్టుకోవాలని భారత్ చూస్తోంది.

ట్రంప్ విధానాల వల్ల కలిగిన నష్టాన్ని తగ్గించుకోవడం, రష్యాతో బలమైన సంబంధాలు కొనసాగిస్తూనే, తమకు అనుకూలంగా ఈయూతో ఎఫ్‌టీఏలోకి ప్రవేశించడం చిన్న విషయం కాదు.

ట్రంప్ విధానాల చుట్టూ నెలకొన్న అస్థిరమైన వాతావరణంలో.. దేశాలు గతంలో ఉన్న తమ విభేదాలను పక్కన పెట్టడం పెరుగుతుందని బ్లూమ్‌బర్గ్‌కు చెప్పారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ ట్రేడ్, ఎకనామిక్స్ రీసెర్చ్ హెడ్ అమితేందు పాలిత్ చెప్పారు.

ఒక్క వ్యక్తిపైనే ఆధారపడే స్వభావాన్ని తొలగించుకునేందుకు ఇది కచ్చితంగా చాలా అవసరమని పాలిత్ అన్నారు.

అమెరికా 50 శాతం సుంకాల తర్వాత.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త మార్కెట్ల వైపుకు చూస్తున్నారు. భారత్‌ను 'టారిఫ్ కింగ్' అని ట్రంప్ అంటున్నారు.

ఈయూతో కుదిరిన ఎఫ్‌టీఏతో యూరోపియన్ యూనియన్‌కు భారత ఎగుమతులు 2031 నాటికి 50 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ.4.58 లక్షల కోట్లకు) పెరుగుతాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ ఎకనామిస్ట్ మాధవి అరోరా చెప్పినట్లు ఓ కథనం పేర్కొంది.

భారత్, ఈయూ మధ్య గత ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 136.5 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.12.52 లక్షల కోట్లకు చేరుకుంది. భారత్ మొత్తం ఎగుమతుల్లో ఈయూ వాటా 17 శాతానికి పైగానే. ఈయూకు తొమ్మిదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్.

140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌ మార్కెట్ యాక్సెస్‌ను ఈయూ పొందనుంది.

భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. పరిశ్రమల శాఖ డేటా ప్రకారం.. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ 2024-25లో 131.84 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.12.09 లక్షల కోట్లు).

గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాతో జరిపిన వాణిజ్యంలో భారత్ 41.18 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.77 లక్షల కోట్ల) వాణిజ్య మిగులును సాధించింది.

అంటే, అమెరికా నుంచి భారత్ కొన్న వస్తువుల కంటే అమెరికాకు అమ్మిన వస్తువులే ఎక్కువ. ఈ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ సంతోషంగా లేరు. అమెరికాకు వాణిజ్య మిగులును సాధించాలని ఆయన చూస్తున్నారు.

భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికా. గతేడాది 87 బిలియన్ డాలర్ల (రూ.8.01 లక్షల కోట్ల) విలువైన ఉత్పత్తులను భారత్ అక్కడ అమ్మింది. బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్స్ ప్రకారం.. ట్రంప్ విధించిన సుంకాల వల్ల అమెరికాకు భారత్ ఎగుమతులు 52 శాతం తగ్గాయి.

ట్రంప్ సుంకాల వల్ల, 41 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య మిగులు తీవ్రంగా ప్రభావితమైంది. అయితే, ఎఫ్‌టీఏ ఒప్పందాలతో వెంటనే కాకపోయినా, వచ్చే ఒకట్రెండేళ్లలో ఈ నష్టాలను భర్తీ చేసుకోవాలని భారత్ ప్రయత్నిస్తుందని అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.

''అమెరికాతో పోలిస్తే భారత్‌కు యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలే మరింత ప్రయోజనకరం. యూరప్ నుంచి భారత్‌కు దిగుమతయ్యే ప్రధాన ఉత్పత్తుల్లో జెట్ ఇంజిన్లు, ఇండస్ట్రియల్ కంట్రోల్ వాల్వులు వంటి హైటెక్ మెషినరీ ఉంటాయి. దీనికి భిన్నంగా, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వాటిల్లో మొక్కజొన్న, సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులతో పాటు, స్క్రాప్ తర్వాత రీసైకిల్ చేసిన మెటీరియల్సే ఉంటున్నాయి. భారత్ నుంచి యూరప్‌కు వెళ్లే ప్రధాన ఎగుమతుల్లో వస్త్రాలు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి'' అని శ్రీవాస్తవ తెలిపారు.

ఈయూ-భారత ఎఫ్‌టీఏ ప్రకారం... 90 శాతానికి పైగా ఈయూ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం లేదా తీసేయడం చేసింది భారత్. దీనివల్ల ప్రతేడాది 4.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.44 వేల 074 కోట్లు) ఆదా అవుతుంది.

కార్లపై ఉన్న టారిఫ్‌లను క్రమంగా 110 శాతం నుంచి 10 శాతానికి తగ్గించనున్నారు. అలాగే కార్ల విడిభాగాలపై విధిస్తున్న సుంకాలను రానున్న ఐదు నుంచి పదేళ్ల కాలంలో పూర్తిగా తొలగిస్తారు.

తగ్గించిన సుంకాలను ప్రతేడాది గరిష్ఠంగా 2,50,000 కార్లకు అమలు చేయనున్నారు.

యంత్రాలు (మెషినరీ)పై 44 శాతం వరకు, రసాయనాలపై 22 శాతం వరకు, మందుల (ఫార్మాస్యూటికల్స్)పై 11 శాతం వరకు ఉన్న భారత సుంకాలను దాదాపు పూర్తిగా రద్దు చేస్తారని, యూరప్‌లోని చిన్న తరహా పరిశ్రమలకు కొత్త ఎగుమతి అవకాశాలు లభిస్తాయని యూరోపియన్ కమిషన్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

బ్రిటన్‌తోనూ ఎఫ్‌టీఏ

గతేడాది మే నెలలో భారత్, బ్రిటన్‌లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

బ్రిటన్ ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం 34 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ.3,12,456 కోట్లకు పెరగనుంది.

తమ ఉత్పత్తులపై భారత్ సుంకాలను 90 శాతం మేర తగ్గించిందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో, చాలా వరకు ఉత్పత్తులపై రాబోయే దశాబ్ద కాలంలో ఎలాంటి సుంకాలు ఉండవని పేర్కొంది.

బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే విస్కీపై సుంకాన్ని భారత్ సగానికి అంటే 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గించింది. దీని వల్ల భారత మార్కెట్‌లోకి ప్రవేశించే విషయంలో అంతర్జాతీయ పోటీదారుల మధ్య యూకే తక్షణం ఆధిపత్యాన్ని పొందుతుంది. 2035 నాటికి ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించనున్నారు.

బ్రిటిష్ కార్లు, ఏరోస్పేస్, ఎలక్ట్రికల్స్, వైద్య పరికరాలు, విస్కీ, మాంసం, బిస్కెట్లు, చాక్లెట్లు వంటి ఆహార పదార్థాలు భారత్‌లో చౌకగా లభిస్తాయి. భారత దుస్తులు, ఆభరణాలు యూకేలో చౌకగా మారనున్నాయి.

2024లో భారత్, బ్రిటన్ మధ్య వస్తు, సేవల మొత్తం వాణిజ్య విలువ 58 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.5,33,106 కోట్లు) ఉందని బ్రిటన్ ప్రభుత్వ డేటా పేర్కొంది. ఇది భారత్‌ను యూకేకు 11వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మార్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)