ట్రంప్ సంతకాలు: క్యాపిటల్ హిల్ అల్లర్ల దోషులకు క్షమాభిక్ష, విడుదల కానున్న 1,600 మంది

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి రోజు పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో పలు కీలకమైన ఆర్డర్లు ఉన్నాయి.
పారిస్ ఒప్పందం నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా వైదొలగడం లాంటి కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు.
2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనం మీద దాడి చేసిన కేసులో దోషులుగా తేలిన సుమారు 1,600 మందికి క్షమాభిక్ష పెడుతూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో, నాటి అల్లర్ల ప్రధాన సూత్రధారితో సహా వందల మంది జైళ్ల నుంచి విడుదల కానున్నారు.
మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు.
ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన చోటే మొదట పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు.
అనంతరం వైట్‌హౌస్‌కు వెళ్లిన తర్వాత మరికొన్ని కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన ఆర్డర్లను జారీ చేశారు.

ఫొటో సోర్స్, Reuters
తొలి సంతకం
జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేస్తూ ట్రంప్ తొలి సంతకం చేశారు.
కొత్త ప్రభుత్వం పాలనపై పూర్తిస్థాయి పట్టు సాధించేదాకా అధికారులు కొత్తగా ఎలాంటి నియంత్రణలు విధించే అవకాశం లేకుండా నిరోధించే ఆర్డ్‌ర్‌పై ట్రంప్ రెండో సంతకం చేశారు.
కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో పట్టు సాధించే వరకూ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తూ ట్రంప్ మరో ఆర్డర్ జారీ చేశారు. అయితే, సైన్యంతో పాటు మరికొన్ని విభాగాల్లో నియామకాలకు మినహాయింపు ఉంటుంది.
ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసుల్లో విధులకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలన్నారు.
ఫెడరల్ ప్రభుత్వ శాఖలు, సంస్థలన్నీ ప్రజల జీవన వ్యయానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా పనిచేయాలంటూ మరో ఫైల్ మీద సంతకం చేశారు.

ఫొటో సోర్స్, Reuter
పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేశారు.
భావప్రకటన స్వేచ్ఛ పునరుద్ధరణకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహిస్తానని, సెన్సార్‌షిప్‌కు తాను వ్యతిరేకమని ట్రంప్ గతంలో అన్నారు.
ఆన్‌లైన్‌లో ప్రజలు నిర్భయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ లేకుండా బైడెన్ ప్రభుత్వం అణచివేసిందని ట్రంప్ ఆరోపించారు.
పుట్టుకతో పౌరసత్వం(బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) నిర్వచనానికి సంబంధించిన ఫైల్ మీద ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం వస్తుందనే 150 ఏళ్ల నాటి రాజ్యాంగబద్దమైన హక్కు హాస్యాస్పదమైనదని, దీన్ని తొలి రోజునే తొలగిస్తానని ట్రంప్ చెప్పారు.
వీటితో పాటు మరికొన్ని ఆర్డర్లపై కూడా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చకచకా సంతకాలు పెట్టారు.
ఈ ఫైళ్లపై సంతకాలు పూర్తయ్యాక.. ఆ పెన్నులను జనంలోకి విసిరేశారు. దాంతో అంతా ఆశ్చర్యపోయారు.
అనంతరం వైట్‌హౌస్‌లోని తన కార్యాలయానికి వెళ్లి మరికొన్ని కీలకమైన ఆర్డర్లను జారీ చేశారు.
అందులో ఒకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా వైదొలిగే ప్రక్రియను ప్రారంభించేందుకు ఉద్దేశించినది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














