దిల్లీ: జంతర్‌మంతర్‌కు ‘తాళం’.. ఇక్కడి పోరాటాల చరిత్ర ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
మూడున్నర దశాబ్దాలుగా వివిధ పోరాటాలకు వేదికగా నిలిచిన దిల్లీలోని జంతర్ మంతర్‌లో ఇకపై నిరసనలకు అనుమతి లేదని దిల్లీ పోలీసులు ప్రకటించారు.
నిరసనలు, ఆందోళనల కోసం జంతర్‌మంతర్‌కు బదులుగా దిల్లీలోని మూడు ప్రాంతాలను ప్రతిపాదించారు. అవి రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు దిల్లీలోని సీబీడీ గ్రౌండ్.
జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి కోరుతూ సీజేపీ సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన సమయంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దీనికంటే ముందే, జంతర్ మంతర్‌ను నిరసనల కోసం కేటాయించిన స్థలాల జాబితా నుంచి తొలగించినట్లు దిల్లీ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
ప్రభుత్వ తాజా నిర్ణయం ఆమోదయోగ్యం కాదని సీజేపీ పేర్కొంది.
ఇది 'ప్రజలు శాంతియుతంగా సమావేశమయ్యే, నిరసన తెలిపే ప్రాథమిక హక్కుపై జరిగిన దాడి' అని సీజేపీ ఆరోపించింది.


నిరసనకు అనుమతి ఇవ్వాలని దిల్లీ పోలీసులకు 24 గంటల అల్టిమేటం జారీ చేసినట్లు సీజేపీ నాయకుడు సౌరవ్ దాస్ తెలిపారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలు అక్టోబర్ 2 నుంచి ఆందోళనలు చేస్తున్నాయి.
అక్టోబర్ 10న సీజేపీ నిరసన తర్వాత సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా.. కేటాయించిన స్థలంలో శాంతియుత నిరసనలకు అనుమతించాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు.
ఇంతకుముందు నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద భారీ జనసమూహం గుమిగూడింది.
జూలై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు, హింస జరిగాయి.
ఈసారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సీజేపీ సిట్-ఇన్ నిరసనను ప్రకటించింది.
దీనికి మద్దతుగా వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ అక్టోబర్ 2 నుంచి 10 వరకు ఉద్యమిస్తామన్న ప్రకటనతో జంతర్ మంతర్ పూర్తిగా మూతపడింది.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసుల నోటీసులో ఏముంది?
దేశ రాజధానిలో నిరసనల కోసం దిల్లీ పోలీసులు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు.
"నిరసనల కోసం ప్రత్యామ్నాయ ప్రాంతాలను సమీక్షించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా కొత్త ఏర్పాట్లను అమలు చేశారు" అని అక్టోబర్ 11న దిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ జారీ చేసిన స్టాండింగ్ ఆర్డర్‌లో పేర్కొన్నారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం దిల్లీలో నిరసనల కోసం రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు దిల్లీలోని సీబీడీ మైదాన్‌లను కొత్త ప్రాంతాలుగా నోటిఫై చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.
ఇందులో "ఈ మూడు ప్రాంతాలలో నిరసనలు నిర్వహించడానికి సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విడిగా జారీ చేస్తారు. ఇది ఏప్రిల్ 28, 2022న జారీ చేసిన మునుపటి స్టాండింగ్ ఆర్డర్ నంబర్ L&O/48/22 కి పాక్షిక సవరణ" అని పేర్కొన్నారు.
ఈ మూడు ప్రాంతాలు దిల్లీలోని వేర్వేరు చోట్ల ఉన్నాయి.
వీటి మార్పిడితో నిరసనలు ఇప్పుడు పార్లమెంట్ చుట్టుపక్కల ఉన్న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్‌కి దూరంగా జరుగుతాయి.
రాంలీలా మైదాన్ సెంట్రల్ దిల్లీలో ఉండగా, బురారీ మైదాన్ నార్త్ వెస్ట్ దిల్లీలో, సీబీడీ మైదాన్ ఈస్ట్ దిల్లీలో ఉన్నాయి.
రాంలీలా మైదాన్ జంతర్ మంతర్ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇది మిగిలిన రెండు ప్రాంతాల కంటే జంతర్ మంతర్‌కు దగ్గరగా ఉంటుంది.
బురారీ మైదాన్ జంతర్ మంతర్ నుండి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉండగా, సీబీడీ మైదాన్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రాంలీలా మైదానానికి 1975లో జయప్రకాశ్ నారాయణ్ ర్యాలీ, 2011లో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి నిరోధక ఉద్యమంతో సహా రాజకీయ ర్యాలీలు, ప్రజా ఉద్యమాల సుదీర్ఘ చరిత్ర ఉంది.
2020 రైతుల నిరసనల సమయంలో నిరసనకారులను అక్కడికి వెళ్లాలని ప్రభుత్వం కోరినప్పుడు బురారీ మైదాన్ వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, ANI
సీజేపీ ఏమి చెప్పింది?
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా నిర్ణయంపై సీజేపీ తీవ్రంగా స్పందించింది.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దీనిని నియంతృత్వ చర్యగా అభివర్ణించారు.
"ఈ రోజు మోదీ నిరసనల కోసం కేటాయించిన స్థలాల జాబితా నుండి జంతర్ మంతర్‌ను తొలగించారు. రేపు ఆయన జాబితా నుండి ప్రజాస్వామ్యాన్నే తొలగిస్తారు. నియంతకు నిరసనల స్థలంతో సమస్య లేదు. సమస్య ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు అనే ఆలోచనతోనే" అని అన్నారు.
కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్న లెఫ్ట్ విద్యార్థి సంఘం ఏఐఎస్ఏ నాయకురాలు నేహా బోరా బృందం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది.
"మేము మా జంతర్ మంతర్ కోసం పోరాడుతాం. ఇది కేవలం ఒక స్థలం కాదు. ప్రజల గొంతుక. మా గొంతును అణచివేయలేరు" అని అందులో రాశారు.
పోలీసుల నిర్ణయం ఆమోదయోగ్యం కాదని సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ ఇన్ స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టారు.
"నరేంద్ర మోదీ జంతర్ మంతర్ అంటే ఎందుకు భయపడుతున్నారు? జంతర్ మంతర్ భారత ప్రజలది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భారత ప్రజలను సంప్రదించిందా? ఏవైనా భాగస్వామ్య పక్షాలను సంప్రదించారా? ఏవైనా సంస్థలను సంప్రదించారా?" అని సౌరవ్ దాస్ తన పోస్టులో ప్రశ్నించారు.
"నిరసనల కోసం కేటాయించిన స్థలాల జాబితా నుండి జంతర్ మంతర్‌ను తొలగిస్తున్నట్లే, ప్రధాన మంత్రి త్వరలోనే భారతదేశం నుండి ప్రజాస్వామ్యాన్ని తొలగిస్తారని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఈ అడుగు ఆ దిశలోనే ఉంది" అని ఆయన అన్నారు.
"మేము ఈ ఏకపక్ష నిర్ణయాన్ని అంగీకరించము. ఇది ప్రజలు శాంతియుతంగా సమావేశమయ్యే, నిరసన తెలిపే ప్రాథమిక హక్కుపై జరిగిన దాడి. ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతోంది" అని సౌరవ్ దాస్ అన్నారు.
"ప్రజలు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడానికి దిల్లీకి వస్తారు. కానీ ప్రభుత్వం నిరసన స్థలాల జాబితా నుండి అదే స్థలాన్ని తొలగించింది. ఇంతకుముందు ఇది అనుమతి పొందే ఆటగా ఉండేది. ప్రజలు తమ గొంతు వినిపించడానికి స్థలాన్ని డిమాండ్ చేస్తుంటే నిరసన తెలిపే స్థలాన్నే వారి నుండి లాక్కుంటున్నారు" అని సీజేపీ లీగల్ సెల్ అధిపతి రత్నా సింగ్ ఇన్ స్టాగ్రామ్‌లో రాశారు.
"ప్రభుత్వం నిరసనలను దిల్లీ సరిహద్దుల్లోకి మార్చాలని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. వారు రాంలీలా మైదానంలో కూడా పెద్ద ప్రదర్శనలను అనుమతించరు. ఇది చట్టవిరుద్ధం" అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్‌లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
జంతర్ మంతర్ నిరసనలకు కేంద్రంగా ఎప్పుడు మారింది?
సీనియర్ జర్నలిస్ట్ త్రిభువన్ జంతర్ మంతర్ చరిత్రపై బీబీసీ కోసం ఒక కథనాన్ని రాశారు.
1960ల చివరి నుండి 1980ల వరకు బోట్ క్లబ్ భారతదేశంలో ప్రజాస్వామ్య గొంతుకకు ప్రధాన కేంద్రంగా ఉండేదని ఆయన ఆ కథనంలో తెలిపారు.
1993 తర్వాత, పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య, నిరసనలను రాజ్‌పథ్ (ప్రస్తుత కర్తవ్య పథ్) నుండి మార్చడం ప్రారంభించారు.
జంతర్ మంతర్ ఒక మధ్యేమార్గంగా అవతరించింది.
ఇది పార్లమెంట్‌కు దగ్గరగా ఉండేది. కానీ మరీ అంత దగ్గరగా కాదు. ఇక్కడ పరిస్థితులను తేలిగ్గా నియంత్రించగలిగేలా ఉండేది.
జనవరి 31, 2003 నాటి దిల్లీ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్ నంబర్ 309ను ఉటంకిస్తూ, జంతర్ మంతర్ వద్ద ఐదు వేల కంటే ఎక్కువ మంది గుమికూడకూడదని, నిరసనకారుల వాహనాలను అక్కడ అనుమతించబోమని కేంద్ర ప్రభుత్వం 2015లో లోక్‌సభకు తెలిపింది.
2006 జనవరి నుంచి నుండి 2010 ఆగస్టు మధ్య కాలంలో జంతర్ మంతర్ వద్ద కనీసం 13,118 ధర్నాలు, 5,491 ప్రదర్శనలు ర్యాలీలు, ఊరేగింపులు జరిగాయని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ రికార్డులు చెబుతున్నాయి.
2010 మొదటి ఎనిమిది నెలల్లోనే, దాదాపు 1.5 లక్షల మంది వివిధ ప్రదర్శనలలో పాల్గొన్నారు, చట్టాన్ని ఉల్లంఘించినందుకు 12 వేల మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు.
జంతర్ మంతర్ ముఖ్యంగా కొన్ని ఉద్యమాలకు గుర్తింపు పొందింది, ఉదాహరణకు 1990ల నాటి నర్మదా బచావో ఆందోళన, 2011 నాటి అన్నా హజారే ఉద్యమం, 2012లో నిర్భయ ఉద్యమం, 2015లో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఉద్యమం, 2017లో తమిళనాడు రైతుల ఉద్యమం మొదలైనవి.
దీని తర్వాత, అక్టోబర్ 2017 లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జంతర్ మంతర్ వద్ద నిరసనలను నిలిపివేయాలని, వాటిని రాంలీలా మైదానానికి మార్చాలని ఆదేశించింది.
ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. 2018 జూలై23న 'మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వర్సెస్ ఇండియా' కేసులో శాంతియుతంగా సమావేశమయ్యే రాజ్యాంగబద్ధమైన హక్కుకు నివాసితుల హక్కులకు మధ్య సమతుల్యతను కోర్టు నొక్కి చెప్పింది.
ప్రజాస్వామ్య రాజధానిని శాశ్వత నిషేధాజ్ఞల కోటగా మార్చలేరని అయితే నిరసన తెలిపే స్వేచ్ఛ అనేది పౌరుల జీవితాలను నిరవధికంగా నాశనం చేసే లైసెన్స్ కాదని కోర్టు పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























