నియంత్రణ రేఖ వద్ద ల్యాండ్‌మైన్ పేలి నలుగురు యువకులు మృతి, భారత్‌పై పాకిస్తాన్ విమర్శలు, నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ల్యాండ్‌మైన్ పేలింది.

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP via Getty Images
పాక్ పాలిత కశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ల్యాండ్‌మైన్ పేలింది. ఈ పేలుడులో నలుగురు యువకులు మరణించారు.
దీనికి భారతే కారణమంటూ పాకిస్తాన్ పాలిత కశ్మీర్ సమాచార విభాగం ఆరోపించింది. సోమవారం సాయంత్రం నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న మహేంద్ర మదర్‌పూర్ గ్రామంలో పేలుడు జరిగినట్లు సమాచార శాఖ ఒక ప్రకటన జారీ చేసిందని బీబీసీ ఉర్దూ కథనం తెలిపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ నలుగురు యువకులు గ్రామం సమీపంలోని నీటి పైప్‌లైన్‌కు మరమ్మతులు కోసం వెళ్లారు. అకస్మాత్తుగా శక్తివంతమైన పేలుడు జరగడంతో దాని ధాటికి నలుగురూ అక్కడికక్కడే మరణించారు. "యువకులు ప్రయాణించిన ప్రాంతంలో భారత సైన్యం ల్యాండ్‌మైన్‌లను అమర్చింది" అని పూంచ్ డివిజన్ కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ ఆరోపించారు.
తవ్వకాలు ప్రారంభించడానికి ముందు అక్కడ మోహరించిన సైనికులతో ఆ నలుగురు యువకులు సంప్రదించారని జిల్లా అధికారి ఒకరు బీబీసీ ప్రతినిధి షాజాద్ మాలిక్‌కు తెలిపారు. ఆ ప్రాంతం నియంత్రణ రేఖకు చాలా దగ్గరగా ఉందని, అందువల్ల తవ్వకాలు జరపడానికి ముందు ఆ ప్రాంతాన్ని తనిఖీలు చేయాలని, దీనికి ఒక రోజు పడుతుందని యువకులకు సైనికులు చెప్పారు. యువకులు మాత్రం సైనికుల మాట పట్టించుకోకుండా తవ్వడం మొదలుపెట్టారని జిల్లా యంత్రాంగం చెబుతోంది. దీంతో పేలుడు జరిగి నలుగురూ మరణించారు. ఈ ఘటనపై భారత్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.








