యెమెన్ ఎడారుల్లో సాగుతున్న యుద్ధం మరోసారి ప్రపంచాన్ని కుదిపేసే పరిణామాలకు దారి తీస్తుందా?

ఫొటో సోర్స్, BBC/Lee Durant
- రచయిత, ఓర్లా గ్యురెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
వెనుక సాయుధులు కూర్చున్న పికప్ ట్రక్కు ఎడారి మార్గంలో వేగంగా ప్రయాణిస్తోంది.
యెమెన్ ప్రభుత్వ అనుకూల దళాలతో కలిసి సాగుతున్న ఆ ప్రయాణంలో అరబిక్ సముద్రం, దూరంగా ఉన్న పర్వత శిఖరాలు మాకు కనిపించాయి.
కొన్ని రోజుల ముందే ఇక్కడి నుండి హూతీ తిరుగుబాటుదారులను తరిమికొట్టినట్లు సైనికులు మాతో చెప్పారు.
విశాలమైన ఎడారిలో జరిగే యుద్ధంలో పురోగతిని గుర్తించడం కష్టం. లాహ్జ్ ప్రావిన్స్‌లోని షాబ్-అల్-జిన్ వద్ద ఉన్న ఈ సైనికులు ఇసుక బస్తాలతో ఏర్పాటు చేసిన కొత్త రక్షణ వలయాలను మాకు చూపించారు.
"ఇక్కడ తీవ్రమైన పోరాటం జరిగింది. వాళ్ల దగ్గర స్నైపర్లు ఉన్నారు. ఆర్టిలరీ, బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లు ఉన్నాయి" అని సైనిక దుస్తుల్లో ఉన్న కమాండర్ తౌఫిక్ అల్ హబూన్ చెప్పారు.


ఫొటో సోర్స్, EPA
మిడిల్ ఈస్ట్‌లోని సుదూర ప్రాంతంలో జరుగుతున్న ఈ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది.
యెమెన్ అంతర్యుద్ధాన్ని ఇప్పుడు నిర్లక్ష్యం చేయడం అసాధ్యం. ఇది తెహ్రాన్ నుంచి రియాద్ వరకు విస్తరించిన పెద్ద సంఘర్షణలో భాగం.
గత వారాంతంలో రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు దూసుకొచ్చాయి. ప్రపంచ నౌకాయానానికి ఇప్పటికే ముప్పుగా మారిన హూతీలు సౌదీ అరేబియాకు కూడా ముప్పుగా మారుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
హుతీలను తరిమి కొట్టడం సాధ్యమేనా?
సౌదీ ప్రాంతీయ ప్రత్యర్థి ఇరాన్‌కు వీరు బలమైన ఆయుధంగా ఉపయోగపడుతున్నారు.
కింద పడి ఉన్న ఫైబర్ గ్లాస్, లోహపు ముక్కలను తౌఫిక్ అల్ హబూన్ చూపించారు. అవి కూల్చివేసిన హూతీల డ్రోన్ ముక్కలని, అందులో సి-4 పేలుడు పదార్థాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
కమాండర్ అల్ హబూన్ సదరన్ ఫోర్సెస్‌లో పని చేస్తారు. యెమెన్ ప్రభుత్వం కోసం పోరాడుతున్న వివిధ గ్రూపుల కూటమిలో ఈ దళం కూడా భాగం.
హూతీలు 2014లో రాజధాని సనాను ఆక్రమించి యెమెన్ ప్రభుత్వాన్ని పడగొట్టారు.
ఏడాది తర్వాత సౌదీ నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమి హూతీలను అక్కడి నుంచి తరిమేయడానికి జోక్యం చేసుకుంది.
సంవత్సరాలుగా తీవ్రమైన వైమానిక దాడులు చేసినప్పటికీ అవి పని చేయలేదు.
ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను అనుసంధానించే వ్యూహాత్మక సముద్ర మార్గం 'బాబ్ అల్-మండెబ్' వైపు ఉన్న ఎత్తైన ప్రాంతాలలో ఇంకా 500 మంది హూతీ దళాల సభ్యులు ఉన్నారని కమాండర్ చెప్పారు.
చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఈ ఇరుకైన జలమార్గం మా ప్రయాణంలో మాకు కనిపించలేదు.
సెప్టెంబరులో మెరుపు దాడి ద్వారా హూతీలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.
యెమెన్ ప్రభుత్వ అనుకూల దళాలు సుమారు 85 శాతం ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు కమాండర్ చెప్పారు (ఇతర ప్రాంతాలలో భూభాగాన్ని కోల్పోయారనే దాన్ని హూతీలు ఖండించినా ఇక్కడ భూభాగం విషయంలో అలాంటిదేమీ లేదని స్థానికుల ద్వారా తెలిసింది).

ఫొటో సోర్స్, BBC/Lee Durant
యెమెన్ ప్రభుత్వ అనుకూల సైనికులు ఇక్కడ పూర్తి నియంత్రణ సాధించే వరకు ప్రపంచ చమురు సరఫరా, ధరలపై ఒత్తిడి ఉంటుంది.
మేము పర్యటించిన రోజు అక్కడ తీవ్ర ఘర్షణలు జరిగినట్లు తర్వాత తెలిసింది.
ఐదు సైనిక వాహనాలు హూతీలు అమర్చిన ల్యాండ్ మైన్లను ఢీకొట్టాయి.
ఇందులో ఎంతమంది మరణించారో లేదా గాయపడ్డారో స్పష్టంగా తెలియలేదు.
తాజా హింస కారణంగా ఇళ్లు వదిలి పారిపోవాల్సి వచ్చిన యెమెన్ ప్రజలను ఆకలి వేధిస్తోంది.
సెప్టెంబర్ ప్రారంభంలో ఈ ఉద్రిక్తతలు మొదలైన తర్వాత సుమారు 2 లక్షల మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Reuters
శరణార్థుల ఆవేదన
మేము ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్తుండగా ఎండిపోయిన చెట్ల కింద ఆశ్రయం పొందుతున్న కుటుంబాలు కనిపించాయి.
మహిళలు, పిల్లల సమూహంలో మాకు ఆయేషా అనే వృద్ధురాలు కనిపించారు.
రియాద్‌లో కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీల దాడులు జరిగిన కహ్‌బూబ్ పర్వతాలలోని తన ఇల్లు వదిలి ఆమె ఇక్కడకు వచ్చారు.
"మేము వచ్చి 30 రోజులవుతోంది. నా దగ్గర జంతువులు లేవు. డబ్బు లేదు. నీళ్లు లేవు. ఆహారం లేదు. కనీసం దుప్పటి కూడా లేదు. మేము ఒంటిపై ఉన్న బట్టలతోనే పారిపోవాల్సి వచ్చింది" అని ఆమె చెప్పారు.
రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడులు జరిగినప్పుడు సౌదీ పౌరులు ప్రాణాలు చేతపట్టుకుని పరుగెత్తారు.
దశాబ్ద కాలంలో సౌదీ భూభాగంపై జరిగిన అత్యంత ఘోరమైన ఈ దాడి ఆ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ దేశ ప్రజల్లో అభద్రతను పెంచింది.

ఫొటో సోర్స్, BBC/Lee Durant
ఆసుపత్రులలో యుద్ధ పరిస్థితులు
యెమెన్ రేవు పట్టణమైన ఏడెన్‌లోని ఆపరేషన్ థియేటర్లలో భౌగోళిక రాజకీయాల ప్రస్తావన కనిపించదు.
ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి.
ఫ్రంట్‌లైన్ల నుండి వస్తున్న గాయపడ్డ ప్రభుత్వ సైనికులకు చికిత్స అందించడానికి వైద్యులు రాత్రి పగలు శ్రమిస్తున్నారు. ఒక మిలిటరీ ఆసుపత్రిలో ఒకే రోజున 51 మంది క్షతగాత్రులు వచ్చారు.
వారిలో చాలా మందికి తుపాకీ గాయాలు అయ్యాయి. కొందరికి చేతులు, కాళ్లు తొలగించాల్సి వచ్చింది. రద్దీగా ఉన్న ఒక వార్డులో ఒక హూతీ దళ సభ్యుడు ప్రత్యర్థి దళాల సైనికులతో కలిసే పడుకుని ఉన్నాడు.
వైద్యులు తాము ఎలాంటి వివక్ష చూపడం లేదని చెప్పారు.
"అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు, మతం ఏమిటనేది నాకు అనవసరం. అతను ఒక మనిషి, కాబట్టి నేను అతనిని ఒక మనిషిలాగే చూడాలి" అని డాక్టర్ బస్సామ్ హజార్ చెప్పారు.
యుద్ధం ముగిసినా కొందరు దీని నుంచి ఎప్పటికీ బయటపడలేరు.
ఒక వ్యక్తి తన బెడ్‌పై నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు.
ఆయన ఎడమ చేతికి తెల్లటి కట్టు ఉంది. తలపై గాయాల కుట్లు కనిపిస్తున్నాయి. మరికొందరు తమ పోరాట పటిమను కోల్పోలేదు. ఒంటిపై అనేక గాయాలున్నా అహ్మద్ అలీ మహ్మూద్ నవ్వుతూ కనిపించారు.
"నేను పూర్తిగా కోలుకునే వరకు వేచి ఉండను. నేను నిలబడగలిగితే చాలు. తిరిగి యుద్ధానికి వెళ్లడం నా మతపరమైన జాతీయ విధి అని నేను భావిస్తున్నాను. హూతీలు దేశాన్ని నాశనం చేశారు. మేము గెలిస్తే నాకు ఈ నొప్పులు కూడా తెలియవు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Lee Durant
పక్కనే ఉన్న వార్డులో 12 ఏళ్ల అలీ అనే బాలుడు ఉన్నాడు. అతని వయసు యెమెన్ అంతర్యుద్ధం వయసు కంటే ఒక ఏడాది మాత్రమే ఎక్కువ.
వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా డ్రోన్ దాడిలో గాయపడిన అలీకి సంక్లిష్టమైన శస్త్రచికిత్స జరగాల్సి ఉంది.
"అతని వెన్నెముక దగ్గర శకలాలు ఉన్నాయి" అని బెడ్ పక్కన నిలబడి డాక్టర్ అమర్ రియాద్ అస్సకాఫ్ చెప్పారు.
"ఆపరేషన్ సులభం కాదు, కానీ దేవుని దయ వల్ల మా సిబ్బంది దీన్ని చేయగలరు. అలీ చాలా ప్రశాంతంగా ఉంటాడు" అని ఆయన చెప్పారు.
"మొదట్లో అతను తీవ్ర నిరాశలో ఉన్నాడు. కానీ మేము అతనికి ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చాము. ఇప్పుడు అతని మానసిక స్థితి మెరుగుపడుతోంది" అని అస్సకాఫ్ అన్నారు.
అలీ యువకుడైన తర్వాత కూడా ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుందా?
2022 నాటి సంధి కొన్ని సంవత్సరాల పాటు ప్రశాంతతను తెచ్చింది.
కానీ ఇప్పుడు హూతీలు మరింత బలమైన శత్రువుగా మారారు. గత వారాంతంలో వారు ఆ విషయాన్ని నిరూపించారు.
వారు ఇప్పటికే యెమెన్ జనాభాలో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తున్నారు. ఒకవేళ కొత్తగా చర్చల ప్రయత్నాలు జరిగితే వారు గట్టి డిమాండ్లను ముందుకు తెచ్చే అవకాశం ఉంది.
ఆసుపత్రిలో తదుపరి క్షతగాత్రుల రాక కోసం సిద్ధమవుతున్న డాక్టర్ బస్సామ్ హజార్ మార్పును ఆశిస్తున్నారు.
కానీ అది త్వరలోనే జరుగుతుందని అనుకోవడం లేదు.
"యుద్ధం వార్తలకు మంచిదే కావచ్చు. కానీ ప్రజలకు ఇది భయంకరమైనది. కొడుకులు తండ్రులను, తల్లులు తమ కొడుకులను కోల్పోతున్నారు. మనకు శాంతి కావాలి" అని ఆయన అన్నారు.
( వీట్‌స్కే బురేమా, రావా గొరోగోర్హ్ , లీ డ్యూరాంట్, సౌద్ అల్ సలాహీ అదనపు సమాచారంతో)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























