ఏ దేశ పౌరసత్వం లేని ‘భారతీయ యువతి’.. పెళ్లయ్యాక మూడేళ్లు భర్తకు దూరం, చివరికి పాస్‌పోర్ట్ ఎలా సాధించారంటే

డాలీ వడాలియా
ఫొటో క్యాప్షన్, డాలీ వడాలియా
    • రచయిత, గోపాల్ కటేషియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

డాలీ బరాయ్ 26 ఏళ్ల మహిళ. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక ఆస్పత్రిలో డైటీషియన్‌గా పనిచేసేవారు. కెనడాలోని కాల్గరీలో పనిచేసే యువకుడు ఖిలాన్ వడాలియాను ఆమె పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి వేడుక, ఇతర ఆచారాలు పూర్తయిన తర్వాత.. డాలీని తన భర్తతో కెనడాకు పంపించాలని వడాలియా కుటుంబం నిర్ణయించింది. కానీ, వారికి ఊహించని షాక్ ఎదురైంది.

డాలీ ఈ ప్రపంచంలో ఏ దేశ పౌరురాలు కాదని వారికి తెలిసింది. దీంతో.. కెనడాకు వెళ్లాలన్న డాలీ ప్లాన్స్ విఫలమయ్యాయి.

ఈ విషయంపై ఆమె పలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆఫీసులను సందర్శించారు. 25 రోజులు వయసు ఉన్నప్పటి నుంచే తాను రాజ్‌కోట్‌లో నివసిస్తున్నానని అధికారులతో డాలీ వాదించారు. తాను ఇక్కడే చదువుకున్నానని, ఇక్కడే పనిచేశానని.. తాను భారతీయ పౌరురాలినని చెప్పారు.

అయితే, పలు చట్టాలను ఉటంకించిన అధికారులు, డాలీ వడాలియా వాదనలను అంగీకరించేందుకు తిరస్కరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ తర్వాత ఆమె గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆమెకు ఎలాంటి ఊరట దక్కలేదు.

దీంతో, ఆ కుటుంబమంతా ఒక్కసారిగా ఒత్తిడికి లోనైంది. పెళ్లయి మూడేళ్లైనా.. భార్య ఇంకా రాజ్‌కోట్‌లోనే ఉండగా.. భర్త మాత్రం కెనడాలో ఉండేవారు. వీరిద్దరూ తప్పనిసరి పరిస్థితుల్లో రెండు భిన్నమైన ఖండాల్లో నివసించాల్సి వచ్చింది.

అయితే, స్థానిక నాయకులు ఆమె విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతో, డాలీ వడాలియాకు కాస్త ఊరట లభించింది.

డాలీ వడాలియా
ఫొటో క్యాప్షన్, రాజ్‌కోట్‌లో ఒక ఆస్పత్రిలో డైటీషియన్‌గా పనిచేసిన డాలీ వడాలియా

బరాయ్ కుటుంబం రాత్రికి రాత్రే మొజాంబిక్‌ను ఎందుకు విడిచిపెట్టింది?

డాలీ బరాయ్ తండ్రి కేతన్ బరాయ్ 1995లో వ్యాపారం కోసం తూర్పు ఆఫ్రికా ఖండంలోని దేశమైన మొజాంబిక్‌కు వెళ్లారు. అప్పటికే తమ కుటుంబంలో కొందరు సభ్యులు అక్కడ నివసించేవారని డాలీ వడాలియా బీబీసీకి చెప్పారు.

మొజాంబిక్‌లోని తీర ప్రాంత పట్టణమైన షాయ్-షాయ్‌లో డాలీ తండ్రి ఒక గ్రోసరీ స్టోర్‌ను ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత ఆయన భార్య ఆర్తి బరాయ్ కూడా మొజాంబిక్‌కు వెళ్లారు. 2000 సంవత్సరం ఫిబ్రవరిలో వీరికి డాలీ జన్మించారు.

డాలీ తల్లిదండ్రులు ఆమె జనన ధ్రువీకరణ పత్రాన్ని మొజాంబిక్ ప్రభుత్వం నుంచి తీసుకున్నారు.

''నేను పుట్టిన కొన్ని రోజులకు మొజాంబిక్‌లో అతిపెద్ద తుపాను వచ్చింది. దీనివల్ల షాయ్-షాయ్‌లలో భారీ వర్షాలు కురిసి, భయంకరమైన వరద ప్రళయం సృష్టించింది. నా తల్లిదండ్రులు కట్టుకున్న ప్రతిదీ నాశనమైంది'' అని డాలీ వడాలియా చెప్పారు.

''18 రోజుల తర్వాత.. మమ్మల్ని వరద ప్రభావిత ప్రాంతం నుంచి రక్షించారు. వరదలో మా తల్లిదండ్రులు మొత్తం పోగొట్టుకున్నారు. అందుకే, నన్ను తీసుకుని రాజ్‌కోట్‌కు తిరిగి వచ్చారు'' అని తెలిపారు.

డాలీ పుట్టిన కొన్నిరోజులకు షాయ్-షాయ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించడంతో.. కేతన్, ఆర్తిలు డాలీకి మొజాంబిక్ ప్రభుత్వం నుంచి కానీ, భారత ప్రభుత్వం నుంచి కానీ పాస్‌పోర్టు తీసుకోలేకపోయారు.

ఆ సమయంలో, మొజాంబిక్‌లోని భారత కాన్సులేట్ జారీ చేసిన అత్యవసర ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఆ దంపతులను వారి కుమార్తెతో కలిసి మొజాంబిక్ విడిచి భారత్‌కు రావడానికి అనుమతించారని కుటుంబ సభ్యులు చెప్పారు.

ఆ అత్యవసర ధ్రువీకరణ పత్రం ఆధారంగా, బరాయ్ దంపతులు అప్పుడే పుట్టిన తన కుమార్తె డాలీతో 2000 మార్చి 14న భారత్‌కు తిరిగి వచ్చారు.

ఆ తర్వాత ఆయన ఎప్పుడూ మొజాంబిక్‌కు వెళ్లలేదు. రాజ్‌కోట్‌లో స్థిరపడ్డారు.

స్కూల్‌లో డాలీకి ఎలా అడ్మిషన్ దొరికింది?

రాజ్‌కోట్‌కు తిరిగి వచ్చిన తర్వాత.. డాలీ కాస్త పెద్దయ్యాక నగరంలోని ఒక స్కూల్‌లో ఆమెను చేర్పించారు.

''మొజాంబిక్ ప్రభుత్వం జారీ చేసిన నా జనన ధ్రువీకరణ పత్రం.. పోర్చుగీస్‌ భాషలో ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని స్కూల్‌లో అడ్మిషన్ పొందాను. నా పేరును స్కూల్‌లో జనరల్ రిజిస్టర్‌లోనే నమోదు చేశారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత.. యాజమాన్యం స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఇచ్చింది'' అని డాలీ చెప్పారు.

''దానిలో నేను మొజాంబిక్‌లో పుట్టానని ఉంది. ఈ విధంగా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ రూపంలో నా జననానికి సంబంధించి మరో ధ్రువీకరణ పత్రం వచ్చింది'' అని తెలిపారు.

జనన ధ్రువీకరణ పత్రం, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ ఆధారంగా తనకు కాలేజీలో కూడా ప్రవేశం లభించిందని చెప్పారు.

సైన్స్ విభాగంలో డాలీ వడాలియా డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత హోమ్ సైన్స్ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్)లో మాస్టర్స్ డిగ్రీ కూడా పొందారు.

భారత ప్రభుత్వం ఆమెకు ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, పాన్ కార్డులను కూడా జారీ చేసింది.

ఇతర అమ్మాయిలు, యువతుల మాదిరిగానే తన జీవితం కూడా సాధారణంగా సాగిపోయిందని డాలీ చెప్పారు.

అయితే, పెళ్లి తర్వాత తన జీవితంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని ఆమె తెలిపారు.

డాలీ వడాలియా కుటుంబం
ఫొటో క్యాప్షన్, డాలీ వడాలియా, మరిది రోనక్ వడాలియా, అత్తామామలు

పెళ్లి తర్వాత.. ప్రపంచంలో తాను ఏ దేశ పౌరురాలు కాదని తెలిసిందన్న డాలీ

తాను భారతీయ పౌరురాలు అనే నమ్మకంతోనే పెరిగినట్లు డాలీ చెప్పారు.

2023 జూలైలో ఖిలాన్ వడాలియాతో ఆమెకు పెళ్లి అయింది. రాజ్‌కోట్‌కు చెందిన ఖిలాన్ వడాలియా.. కెనడియన్ వర్క్ పర్మిట్ పొందారు. కాల్గరీలో పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాత.. డాలీని తన భర్తతో పాటు కెనడాకు పంపాలని కుటుంబం నిర్ణయించింది.

వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, ఏ దేశానికైనా చెందినదైనా వాలిడ్ పాస్‌పోర్ట్ ఉండటం అవసరం.

డాలీ 2023 సెప్టెంబర్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని, అహ్మదాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని సంప్రదించారు.

''పాస్‌పోర్ట్ కార్యాలయానికి చెందిన అధికారులు డాలీని జనన ధ్రువీకరణ పత్రం అడిగారు. మొజాంబిక్ ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికేట్‌ను మేం సమర్పించాం'' అని డాలీ మరిది రోనక్ వడాలియా బీబీసీతో చెప్పారు.

''కానీ, పాస్‌పోర్ట్ ఆఫీసు అధికారులు దాన్ని అంగీకరించలేదు. డాలీ అప్లికేషన్‌ను రిజక్ట్ చేశారు. డాలీ భారతీయ పౌరురాలు అని నిరూపించుకోవాల్సి ఉందని వారు మాకు చెప్పారు'' అని తెలిపారు.

ఆ తర్వాత మొజాంబిక్‌లోని భారత కాన్సులేట్‌లోని అధికారులతో తన జనన ధ్రువీకరణ పత్రాన్ని డాలీ ధ్రువీకరించుకున్నారు. ఆమె 2025 మార్చిలో కొన్ని అదనపు పత్రాలతో మళ్లీ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అయితే, ఆమె తన భారత పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోయారని పేర్కొంటూ, ఈసారి కూడా పాస్‌పోర్ట్ కార్యాలయం ఆమె దరఖాస్తును తిరస్కరించింది.

ఆ తర్వాత రాజ్‌కోట్‌కు తిరిగి వచ్చి, భారత పౌరసత్వ ధ్రువీకరణ పత్రం పొందడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని డాలీ సంప్రదించారు.

"భారత పౌరసత్వం పొందాలంటే వేరే దేశపు పాస్‌పోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు నాకు చెప్పారు. దాని తర్వాతే నేను భారత పౌరసత్వం పొందగలుగుతాను" అని డాలీ చెప్పారు.

తాము దిల్లీలోని మొజాంబిక్ హైకమిషన్‌ను సంప్రదించామని తెలిపారు.

''కానీ, నేను మొజాంబిక్ పౌరురాలిని కాదని వారు నాకు స్పష్టంగా చెప్పారు. అసలు నా దగ్గర ఎప్పుడూ మొజాంబిక్ పాస్‌పోర్ట్ లేదు. నేను ఏమి సమర్పించగలను? నేను దేశ పౌరసత్వం లేనిదానిగా మిగిలిపోయాను'' అన్నారు.

వడాలియా కుటుంబం, రాజ్‌కోట్ ఎంపీ పర్‌‌షోత్తమ్
ఫొటో క్యాప్షన్, రాజ్‌కోట్‌కు చెందిన ప్రస్తుత ఎంపీ పర్‌షోత్తమ్ రూపాలా (మధ్యలో).. డాలీ కేసులో ఆయన సాయం కోరిన వడాలియా కుటుంబం

హైకోర్టును ఆశ్రయించిన డాలీ.. కానీ, అక్కడ కూడా ఎందుకు ఊరట లభించలేదు?

డాలీకి ఏ దేశ పౌరసత్వం లేకపోవడంతో, అంటే ఆమె ధ్రువపత్రాల పరంగా 'పౌరసత్వం లేని వ్యక్తి' (స్టేట్‌లెస్)గా మారడంతో వడాలియా, బరాయ్ కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయని రోనక్ వడాలియా చెప్పారు.

"మేమంతా చాలా ఆందోళన చెందాం. ఇక ఏమి చేయాలో, ఎవరిని కలవాలో, ఏ పత్రాల కోసం ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో మాకు అర్థం కాలేదు. నిబంధనల ప్రకారం.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు అక్కడ బిడ్డ జన్మిస్తే, ఆ బిడ్డ పుట్టిన ఏడాదిలోపు సంబంధిత దేశంలోని భారత హైకమిషన్ లేదా కాన్సులేట్‌లో నమోదు చేయించాలి. అలా చేయడం ద్వారా ఆ బిడ్డకు భారత పౌరసత్వం వస్తుంది" అని తెలిపారు రోనక్ వడాలియా.

"కానీ, వరదల్లో సర్వస్వం కోల్పోయిన తర్వాత డాలీ తల్లిదండ్రులు తిరిగి మొజాంబిక్‌కు వెళ్లలేకపోయారు. ఆ సమయంలో, కాన్సులేట్‌కు సమాచారం అందించడానికి వారికి వేరే ఎటువంటి కమ్యూనికేషన్ మార్గాలు కూడా లేవు" అని చెప్పారు.

ఒక విదేశీ పౌరుడు/పౌరురాలు భారత్‌లో వరుసగా ఏడు సంవత్సరాల పాటు నివసిస్తే.. కొన్ని షరతులను నెరవేర్చడం ద్వారా వారు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే, డాలీ విషయంలో ఈ మార్గం కూడా మూసుకుపోయింది. ఎందుకంటే, మొజాంబిక్ దేశ పౌరురాలని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలు కూడా ఆమె వద్ద లేవు.

అయితే.. 2025 జులైలో గుజరాత్ హైకోర్టులో డాలీ ఒక పిటిషన్ వేశారు. రాజ్‌కోట్ కలెక్టర్ కార్యాలయంలోని అధికారుల, పాస్‌పోర్టు కార్యాలయంలోని అధికారుల నిర్ణయాలను రద్దు చేసి, తనకు భారతీయ పాస్‌పోర్ట్ జారీ చేయాలని ఆమె కోర్టును కోరారు.

2026 ఏప్రిల్‌లో డాలీ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. భారతీయ పాస్‌పోర్టు పొందేందుకు డాలీ భారతీయ పౌరురాలినని నిరూపించుకోవాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది.

డాలీ వడాలియా
ఫొటో క్యాప్షన్, తన భారత పాస్‌పోర్ట్ చూపిస్తున్న డాలీ వడాలియా

సుదీర్ఘ పోరాటం తర్వాత డాలీకి పాస్‌పోర్ట్

పలు ప్రభుత్వ ఆఫీసుల నుంచి, భారత్‌లో కోర్టుల నుంచి ఎలాంటి ఊరట లభించకపోవడంతో.. ప్రస్తుత రాజ్‌కోట్ లోక్‌సభ ఎంపీ పర్‌షోత్తమ్ రూపాలా, పోర్‌బందర్ లోక్‌సభ సీటు మాజీ ఎంపీ రమేష్ ధాదుక్‌లను తమ కుటుంబం సాయం కోరినట్లు రోనక్ వడాలియా తెలిపారు.

"మేం వారి దగ్గరకు వెళ్లి, మా సమస్యను వివరించి, వారి గైడెన్స్ కోరాం. అలాగే, రాజ్యసభ మాజీ ఎంపీ రాంభాయ్ మోకారియాను కూడా సంప్రదించాం. ఆయన మేం చెప్పిన విషయాలను విని, పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత, రమేష్‌భాయ్, పర్‌షోత్తమ్‌ భాయ్ మా కోసం ఒక సిఫార్సు లేఖను రాసి, దాన్ని దిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపారు" అని రోనక్ వడాలియా చెప్పారు.

ఎంపీల సిఫార్సు లేఖ తర్వాత.. ఆలస్యం జరిగినప్పటికీ డాలీ జననాన్ని నమోదు చేయాలని మొజాంబిక్‌లోని భారత కాన్సులేట్‌ను కోరుతూ భారత ప్రభుత్వానికి ఒక అప్లికేషన్‌ను సమర్పించమని దిల్లీలోని అధికారులు తనకు సలహా ఇచ్చారని రోనక్ వడాలియా తెలిపారు.

అధికారుల సలహా మేరకు డాలీ అప్పుడు భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. చివరకు, ఆలస్యమైనప్పటికీ, డాలీ జననాన్ని నమోదు చేయాలని మొజాంబిక్‌లోని భారత కాన్సులేట్‌ను విదేశాంగ శాఖ ఆదేశించింది.

"ఈ ఉత్తర్వు తర్వాత, కాన్సులేట్ ఆలస్యాన్ని మన్నించి, డాలీ జననాన్ని నమోదు చేసి, మాకు ఆమె సర్టిఫికేట్ ఇచ్చింది. మేం ఈ సర్టిఫికేట్‌ను పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారులకు చూపించినప్పుడు, వారు డాలీ పాస్‌పోర్ట్ దరఖాస్తును అంగీకరించారు" అని తెలిపారు.

ఆ తర్వాత.. దివాళి సమయంలో డాలీ ఫోన్‌కు ఒక ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చింది. దానిలో ఆమె పాస్‌పోర్ట్ అప్లికేషన్ అంగీకరించినట్లు ఉంది.

''నవంబర్ 11న మా ఇంటికి నా పాస్‌పోర్ట్‌ను పోస్ట్‌మ్యాన్ డెలివరీ చేస్తారని ఒక మెసేజ్‌ వచ్చింది. నవంబర్ 11 ఉదయం నుంచే నేను దానికోసం వేచిచూడటం మొదలు పెట్టాను. పాస్‌పోర్ట్ వస్తుందో రాదోనని నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. ఎందుకంటే, అప్పటికే చాలాసార్లు పాస్‌పోర్ట్‌ను పొందలేకపోయాను'' అని డాలీ చెప్పారు.

''ఈ ఒత్తిడి వల్ల.. నాకు కాల్ చేయొద్దని నా కుటుంబానికి కూడా చెప్పాను. చివరికి మా ఇంటికి పోస్ట్‌మాన్ వచ్చి, మా అడ్రస్ రాసి ఉన్న ఒక పసుపు రంగులోని ఎన్విలాప్‌ను నాకు అందించారు. దాన్ని తెరిచి చూసినప్పుడు, నా పేరుతో ఉన్న భారత పాస్‌పోర్ట్ ఉంది. అది నిజంగా నా పాస్‌పోర్టే అని నేను నమ్మలేకపోయాను'' అని డాలీ చెప్పారు.

తాను కెనడాలో ఉన్న తన భర్త దగ్గరకు వెళ్లడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని డాలీ చెప్పారు.

''ఈ పాస్‌పోర్ట్ నన్ను ఎలాంటి 'పౌరసత్వం లేని వ్యక్తి' నుంచి భారతీయ పౌరురాలిగా మార్చింది'' అని తెలిపారు.

కెనడాలో ఉన్న తన భర్త దగ్గరకు వెళ్లేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు డాలీ చెప్పారు.

''ఇప్పుడు నా దగ్గర పాస్‌పోర్ట్ ఉంది. కెనడా వీసా పొందేందుకు నేను సిద్ధమవుతున్నాను. త్వరలోనే నేను కెనడాలో నా భర్తను కలుస్తానని ఆశిస్తున్నాను'' అని డాలీ ఆనందం వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)