‘అడవిలో పండ్లు తింటూ, ఊట నీరు తాగుతూ, ఆకులపై పడుకుంటూ’.. అమెజాన్ అరణ్యంలో తప్పిపోయి 11 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన 74 ఏళ్ల అల్జీమర్స్ బాధితుడు

ఫొటో సోర్స్, Reuters
అల్జీమర్స్‌తో బాధపడుతున్న 74 ఏళ్ల జనారినో ఫెర్రీరా డోస్ శాంటోస్ అమెజాన్ వర్షారణ్యంలో తప్పిపోయిన 11 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు.
అప్పటి వరకు అడవిలోని బురిటి పండ్లు తింటూ, సహజసిద్ధమైన ఊట నీరు తాగుతూ ఆయన బతికారు.
ఉత్తర బ్రెజిల్‌లోని అమాపా రాష్ట్రంలో అడవి అంచున ఉన్న తన ఇంటి నుంచి డోస్ శాంటోస్ బయటకు వెళ్లారు.
ఆ సమయంలో ఆయన కుటుంబీకులు పక్కింటికి వెళ్లారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి వెళ్లే దారి తెలుసుకోలేక అడవిలోకి వెళ్లిపోయారు.
ఆయన అదృశ్యమైన ప్రాంతానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో శుక్రవారం సహాయ బృందాలు ఆయనను గుర్తించాయి.

సహాయ బృందాలు గుర్తించేటప్పటికి ఆయన కేవలం లోదుస్తులతో చాలా నీరసంగా, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
నడవడానికి, మాట్లాడటానికి కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు.

అటవీ అనుభవమే కాపాడింది.
మొసళ్లు, విషపూరిత పాములు ఉండే దట్టమైన అడవిలో ఆయన ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని సహాయక చర్యల్లో పాల్గొన్న ఫారెస్ట్ రేంజర్లు చెప్పారు.
గతంలో ఆయన గని కార్మికుడిగా పనిచేయడం అటవీ జీవనంలో ఉన్న అనుభవమే ఆయనను కాపాడిందని వారు చెబుతున్నారు.
"చిన్నతనంలో ఆయన వర్షారణ్యంలో పనిచేశారు. అందుకే అడవిలో ఎలా మనుగడ సాగించాలో ఆయనకు తెలుసు" అని డోస్ శాంటోస్‌ను కనుగొనడంలో సహాయపడిన పార్క్ రేంజర్ అనియెల్ కార్డోసో తెలిపారు.
శాంటోస్ తప్పిపోయాక తొమ్మిది రోజుల పాటు గాలించినా ఫలితం లేకపోవడంతో ఇక వెతకడం ఆపేయాలని అనుకున్నారు.
అయితే ఆ సమయంలో ఆకులతో తయారు చేసిన పడకల ఆనవాళ్లు, ఒకే చోట వృత్తాకారంలో తిరిగిన మనిషి పాదముద్రలను రెస్క్యూ బృందం గుర్తించింది.
అదే రోజు ఉదయం చించివేసిన తాటి ఆకులతో తయారు చేసిన మరో పడక ఆనవాళ్లు కనిపించడంతో ఆ వృద్ధుడు ఇంకా బతికే ఉన్నారని దగ్గర్లోనే ఉండి ఉండవచ్చని వారికి అర్థమైంది.

గాలింపు బృందం అడవిలో ఒకరి వెనుక ఒకరు వరుసగా వెళ్తున్నప్పుడు చివరకు ఆయన కనిపించారని పార్క్ రేంజర్ హెర్బెసన్ శాంటోస్ స్థానిక మీడియాతో చెప్పారు.
"నేను నా కుడివైపున సుమారు 30 మీటర్ల దూరంలో చూశాను. అక్కడ ఆయన కనిపించారు. నాకు మాటలు రాలేదు. మిగిలిన వారికి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు" అని ఆయన వివరించారు.
అయితే ఆ వృద్ధుడిని అక్కడి నుంచి బయటకు తీసుకురావడం అంత సులభం కాలేదు.
చిత్తడి నేల ప్రాంతం నుండి ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి సహాయక సిబ్బంది చెట్ల ఆకులు, తీగలతో అప్పటికప్పుడు ఒక స్ట్రెచర్‌ను తయారు చేశారు.
ఆ తర్వాత ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారని పూర్తిగా కోలుకునే వరకు మరికొన్ని రోజులు అక్కడే ఉంటారని శాంటోస్ కుమార్తె 'ఫోల్హా డి ఎస్. పాలో' అనే పత్రికతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































