‘నా కారే అడ్డుకుని ఐడెంటిటీ కార్డు అడుగుతారా?’ టోల్ ప్లాజా ఉద్యోగులపై ఐఏఎస్ కార్తికేయ మిశ్రా ఆగ్రహం.. తర్వాత ‘ఉద్యోగాలు పోగొట్టుకున్న ఐదుగురు సిబ్బంది’

ఫొటో సోర్స్, Kartikeya Mishra/linkedin
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
కారులో ఉన్నది సీనియర్ ఐఏఎస్ అధికారి అని, పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి అని తెలియక టోల్ ఫీజు అడిగినందుకు ఐదుగురు సిబ్బంది ఉద్యోగులు కోల్పోయారు.
అమరావతి సమీపంలోని విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఉన్న వెంకటపాలెం టోల్‌ప్లాజా దగ్గర గురువారం(నవంబర్ 26) మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్టు బాధితులు చెబుతున్నారు.
వెంకటపాలెం టోల్‌ప్లాజాలో పనిచేస్తూ ఆ రోజు జరిగిన ఘటన తర్వాత ఉద్యోగం కోల్పోయిన ఓ బాధితుడు బీబీసీతో మాట్లాడారు.
అలాగే ప్రస్తుతం టోల్ ప్లాజ్లో పని చేస్తున్న మరో ఉద్యోగి కూడా జరిగిన ఘటన వివరాలను బీబీసీకి వివరించారు.
తమ పేర్లు బయటకు చెప్పకూడదన్న షరతుపై వాళ్లు బీబీసీతో మాట్లాడారు.

''గురువారం మధ్యాహ్నం సరిగ్గా 1.02 గంటలకు వెంకటపాలెం ప్లాజా వద్దకు ఓ వాహనం వచ్చింది. ఆ కారు కింద చిన్న అక్షరాలతో గవర్నమెంట్ వెహికల్ అని ఉంది.. టోల్ కలెక్టర్లు కారు ఆపారు..
ఆ కారు డ్రైవర్....''కారులో ఉన్న సార్ సీఎం సెక్రటరీ'' అని చెప్పారు. సహజంగా చాలామంది ఇలానే చెబుతుంటారని ఐడెంటిటీ కార్డు అడిగారు..
అంతే కారులో వెనుక సీటులో కూర్చున్న సార్‌కి కోపం వచ్చింది... నన్నే ఐడింటిటీ కార్డు అడుగుతారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు'' అని ఉద్యోగం కోల్పోయిన గుంటూరుకి చెందిన యువకుడు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, ugc
14 నిమిషాలు ఆపి మరీ..
''అప్పుడు పక్కనే ఆఫీస్‌లో లంచ్ చేస్తున్న నేను.. ఏదో జరుగుతోందని సీసీ కెమెరాల్లో చూసి వెంటనే అక్కడికి వెళ్లి చూశాను.
సార్‌ని చూడగానే కార్తికేయ మిశ్రా అని నేను గుర్తుపట్టి... మా వాళ్లకి తెలియక పొరపాటున ఆపారు... వెరీ సారీ సర్.. అని చెప్పాను.. కానీ సార్‌కి కోపం తగ్గలేదు.. చాలా సేపు బతిమిలాడాను. సీఎం సెక్రటరీ అని చెప్పినా నన్నే ఆపుతారా.. మీ సంగతి చూస్తా... అని అన్నారు.
సార్ పొరపాటయింది.. మా వాళ్లకు తెలియక గేటు వేశారు.. మీరు వెళ్లిపోండి సర్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాం... కానీ కారుని ముందుకు పోనివ్వకుండా అక్కడే ఆగిపోయారు. కారునుంచి దిగకుండా అలానే ఉండిపోయారు.
ఈ లోపు అదే లైన్లో చాలా వాహనాలు వస్తుండటంతో ఆ లైన్‌ని తాత్కాలికంగా నిలిపివేసి మిగిలిన వెహికల్స్‌ను వేరే లైన్లలో పంపాం. ఆయన చాలా సేపు అక్కడే ఉన్నారు. చివరికి 1.16 గంటలకు ఆయన అక్కడి నుంచి వెళ్లారు'' అని టోల్‌ప్లాజా ఉద్యోగుల్లో ఒకరు బీబీసీకి వివరించారు

ఫొటో సోర్స్, https://eastgodavari.ap.gov.in/
‘కేసు పెట్టి తన్నించలేదు అందుకు సంతోషం’
''ఆ కారు వెళ్లిన అర్ధగంటలోపే ఆ సమయంలో టోల్‌ప్లాజాలో ఉన్న ఉద్యోగులందరినీ సీఎం కార్యాలయానికి రావాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అమరావతి అధికారుల నుంచి కబురు వచ్చింది.
నాతో పాటు మొత్తం ఐదుగురు సిబ్బంది అక్కడికి వెళ్లాం. కార్తికేయ మిశ్రా ఆఫీసు అట అది.. మమ్మల్ని లోపలికి పిలవలేదు. ఎహెచ్ఏఐ అమరావతి పీడీ వికాస్, ఇతర అధికారులు లోపలకు వెళ్లారు. పదినిమిషాల తర్వాత బయటకు వచ్చి మీ ఐదుగురినీ ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం అని చెప్పారు.
పొరపాటు జరిగింది సారీ అని చాలా సార్లు చెప్పాం కదా.. సార్.. అని మేం రిక్వెస్ట్ చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
''కేవలం ఉద్యోగమే పోయింది. ఆయన చాలా పెద్ద అధికారి. పోలీసు కేసు పెట్టి తన్నించలేదు.. లేదంటే లోపల వెయ్యలేదు.. అంతవరకు సంతోషంగానే ఉంది’’ అని ఆ యువకుడు బీబీసీతో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Kartikeya Mishra/facebook.com
విధుల్లో ఉండే ఐఏఎస్ అధికారులు టోల్ చెల్లించనక్కరలేదు కానీ..
''వాస్తవానికి నిబంధనల ప్రకారం ఐఏఎస్ అధికారులు విధుల నిర్వహణలో ఉన్నప్పుడు టోల్ ఫీజు చెల్లించనక్కరలేదు. కానీ ఆ రోజు సార్ వెహికల్‌పై గవర్నమెంట్ వెహికల్ అని ఉంది.. ఆన్ డ్యూటీ బోర్డు కూడా లేదు.. అందుకే మా వాళ్లు ఆపారు’’ అని ఆ యువకుడు బీబీసీతో అన్నారు.
ఉద్యోగాలు కోల్పోయిన ఆ ఐదుగురు నేరుగా ఎన్హెచ్ఏఐ ఉద్యోగులు కాదు.
సాధారణంగా ఎన్హెచ్ఏఐ టోల్గేట్ల నిర్వహణను కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అప్పగిస్తుంది.
వెంకటపాలెం టోల్గేట్ ప్రస్తుత కాంట్రాక్ట్ నిర్వహణ గుర్గావ్కి చెందిన స్కైలార్క్ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ చూస్తోంది.
ఎన్హెచ్ఏఐ అధికారులు తమ కాంట్రాక్ట్ ఏజెన్సీతో మాట్లాడి ఉద్యోగాలు తీయించివేశారని బాధిత యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్కైలార్క్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. వారు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు.
ఈ విషయాన్ని ఎన్హెచ్ఏఐ పీడీ వికాస్ వద్ద బీబీసీ ప్రస్తావించగా.. తాను దీనిపై ఏమీ మాట్లాడేది లేదని అన్నారు.
కాగా ఈ విషయంపై కార్తికేయ మిశ్రాతో మాట్లాడేందుకు బీబీసీ పలుమార్లు ఫోన్లో ప్రయత్నించింది.
అయితే ఆయన ఫోన్లో రెస్పాండ్ కాలేదు.
ఆయన స్పందించగానే ఇక్కడ అప్డేట్ చేస్తాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























