భార్యకు ఇష్టం లేకుండా బలవంతంగా సెక్స్ చేస్తే..? దక్షిణాసియా దేశాల్లో పెళ్లయిన మహిళలకు చట్టపరమైన రక్షణ ఎలా ఉంది

వైవాహిక అత్యాచారం, కోర్టు, దక్షిణాసియా దేశాలు, భారత్, పాకిస్తాన్, పెళ్లి, మహిళ
ఫొటో క్యాప్షన్, దక్షిణాసియాలోని చాలా దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా చూడడం లేదు.
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

వైవాహిక అత్యాచారాన్ని పూర్తి స్థాయిలో నేరంగా పరిగణించకపోవడంతో దక్షిణాసియాలోని ఎనిమిది దేశాల్లో లక్షలాది మంది మహిళలు, బాలికలకు చట్టపరమైన రక్షణ లేకుండాపోతోంది.

భార్యపై భర్త పాల్పడే హింసకు సంబంధించిన కేసులు ఇక్కడ ప్రపంచ సగటు కంటే 35 శాతం ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

వందకు పైగా దేశాలు వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించాయి. అయితే దక్షిణాసియాలోని చాలా దేశాల్లో ఇంకా అలాంటి చట్టం లేదు.

భారత్, అఫ్గానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించని దేశాల జాబితా దాదాపు 30 వరకు ఉంది.

దక్షిణాసియాలో కేవలం మాల్దీవుల్లో మాత్రమే వివాహ బంధంలో జరిగే అత్యాచారానికి, ఇతర అత్యాచార కేసుల్లో విధించే శిక్షనే విధిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దక్షిణాసియాలో మహిళల హక్కుల కోసం పనిచేసే సంస్థల కూటమి 'సౌత్ ఏషియన్ మూవ్‌మెంట్ ఫర్ యాక్సెసింగ్ జస్టిస్' (సమాజ్) ఈ అధ్యయనం నిర్వహించింది.

ఈ అధ్యయనం ప్రకారం.. నేపాల్, భూటాన్ దేశాలు వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించాయి. అయితే ఈ నేరానికి తక్కువ శిక్ష విధించేలా చట్టాలను రూపొందించాయి.

దక్షిణాసియాలో వైవాహిక అత్యాచారానికి సంబంధించిన చట్టాలకు ప్రధానంగా బ్రిటిష్ వలస పాలన కాలం నాటి చట్టాలే మూలమని 'ఈక్వాలిటీ నౌ'కు చెందిన రంజిత సిల్వాల్ చెబుతున్నారు. 'ఈక్వాలిటీ నౌ' అనేది 'సమాజ్' కూటమిలో భాగమైన అంతర్జాతీయ మహిళా హక్కుల సంస్థ.

వైవాహిక అత్యాచారం, కోర్టు, దక్షిణాసియా దేశాలు, భారత్, పాకిస్తాన్, పెళ్లి, మహిళ
ఫొటో క్యాప్షన్, అంగీకారం లేకుండా బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారమే అనేది కొందరి వాదన.

వలస పాలన కాలం నాటి చట్టాలు

దక్షిణాసియాలో వైవాహిక అత్యాచారానికి సంబంధించిన చట్టాలకు ప్రధానంగా బ్రిటిష్ వలస పాలన కాలం నాటి చట్టాలే మూలమని 'ఈక్వాలిటీ నౌ'కు చెందిన రంజిత సిల్వాల్ చెబుతున్నారు. 'ఈక్వాలిటీ నౌ' అనేది 'సమాజ్' కూటమిలో భాగమైన అంతర్జాతీయ మహిళా హక్కుల సంస్థ.

భారత్, బంగ్లాదేశ్‌లలో ఈ చట్టం 1860 నాటిది. శ్రీలంకలో 1885 నాటిది.

ఈ చట్టాల్లో అత్యాచారంగా పరిగణించని కొన్ని మినహాయింపులను పేర్కొన్నారు. వాటిలో ఒకటి.. ఒక పురుషుడు తన భార్యతో(మైనార్టీ తీరిన) లైంగిక సంబంధం పెట్టుకోవడం.

ఈ చట్టాలు కాలం చెల్లినవని ఈ అంశంపై ప్రచారం చేస్తున్నవారు చెబుతున్నారు.

ఎవరైనా సరే ఒక వ్యక్తి అంగీకారం లేకుండా బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారమే అనేది వాళ్ల వాదన.

వైవాహిక బంధంలో జరిగే లైంగిక హింస వల్ల మహిళల శారీరక, మానసిక, భావోద్వేగ, లైంగిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

వందకు పైగా దేశాలు వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించాయి. వీటిలో బ్రిటన్ కూడా ఉంది. ఆ దేశం 1991లో తన చట్టాన్ని మార్చింది.

అయితే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఇప్పటికీ భర్తలకు ఈ విషయంలో చట్టపరమైన మినహాయింపు కొనసాగుతోంది.

పాకిస్థాన్ 2006లో వైవాహిక అత్యాచారానికి సంబంధించిన చట్టంలోని మినహాయింపును తొలగించింది.

అయితే వివాహ బంధంలో కూడా అత్యాచారానికి సంబంధించిన చట్టాలు వర్తిస్తాయని ఇప్పటివరకూ ఏ ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేయలేదు.

ఇటీవల ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా భార్య అంగీకారం లేకుండా లైంగిక సంబంధం పెట్టుకునే భర్తలకు చాలా వరకు మినహాయింపు ఇచ్చినట్టయింది.

2021లో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మహిళలకు ఉన్న హక్కులను, వారికి కల్పించిన రక్షణను క్రమంగా తొలగిస్తున్నారు.

జనవరిలో అమల్లోకి వచ్చిన కొత్త శిక్షాస్మృతి పరిస్థితిని మరింత దిగజార్చిందని సిల్వాల్ చెబుతున్నారు.

ఈ చట్టం ప్రకారం.. భర్త తన భార్యపై హింసకు పాల్పడినప్పుడు, ఆమెకు ఎముకలు విరగడం, బహిరంగ గాయాలు కావడం లేదా తీవ్రమైన గాయాల గుర్తులు కనిపించడం వంటి పరిస్థితులు ఉంటేనే ఆయనపై కేసు పెట్టవచ్చు.

ఒకవేళ భర్త నేరం చేసినట్టు రుజువైనా అతనికి విధించే జైలు శిక్ష కేవలం 15 రోజులు మాత్రమే.

ఆశ్చర్యకరంగా ఈ శిక్షాస్మృతిలో వైవాహిక అత్యాచారం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

అంతేకాదు హింసను చాలా పరిమితంగా నిర్వచించడం వల్ల మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించడాన్ని ఈ చట్టం ఆచరణలో నిరాకరిస్తోందని చెప్పవచ్చు.

వైవాహిక అత్యాచారం, కోర్టు, దక్షిణాసియా దేశాలు, భారత్, పాకిస్తాన్, పెళ్లి, మహిళ
ఫొటో క్యాప్షన్, వైవాహిక అత్యాచారంపై కోర్టుల్లో భిన్నమైన తీర్పులు వెలువడుతున్నాయి.

‘పితృస్వామ్య ఆలోచనా విధానం'

దక్షిణాసియాలో ఈ సమస్యకు కారణమైన ఆలోచనా విధానాన్ని సిల్వాల్ బీబీసీకి వివరించారు.

''పెళ్లి చేసుకున్న తర్వాత లైంగిక సంబంధాలకు భార్య తనంతట తానే అంగీకరించినట్టు భావిస్తారు. అంటే పెళ్లి అనేది ఒక హద్దు లాంటిది. ఆ హద్దు దాటిన తర్వాత ఇక అంగీకారం అవసరం లేదని అనుకుంటారు'' అని ఆమె చెప్పారు.

''కానీ ఈ ఆలోచన అవగాహన లేకపోవడాన్ని సూచిస్తుంది. మనం ఇప్పటికీ మహిళలను ఒక ఆస్తిలా చూస్తున్నామని, మన ఆలోచనా విధానంలో ఇంకా పితృస్వామ్య భావజాలం ఉందని ఇది తెలియజేస్తోంది'' అని ఆమె అన్నారు.

దక్షిణాసియా అంతటా వైవాహిక అత్యాచారంపై మళ్లీ చర్చ జరుగుతున్న సమయంలో ఈ నివేదిక వెలువడింది.

భారత్‌లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 10 పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.

డిసెంబర్ తొమ్మిది నుంచి ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది విచారణ ప్రారంభించనుంది.

గత కొన్నేళ్లుగా ఈ అంశంపై వివిధ కోర్టులు భిన్నమైన తీర్పులు ఇచ్చాయి.

కొంతమంది న్యాయమూర్తులు ప్రస్తుత చట్టం కాలం చెల్లిందని చెబుతూ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించేలా చట్టం తీసుకురావాలని పార్లమెంటును కోరారు.

గత ఏడాది ఒక వ్యక్తి భార్యపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేయడంతో ఆమె మరణించారు. అయితే ఆ వ్యక్తిని ఒక కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.

ఈ తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

అయితే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను భారత ప్రభుత్వం, మత సంస్థలు, పురుషుల హక్కుల కోసం పనిచేసే కార్యకర్తలు వ్యతిరేకించారు.

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించడం చాలా కఠినమైన చర్య అవుతుందని వాళ్లు వాదిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో కూడా వైవాహిక అత్యాచారానికి సంబంధించి చట్టంలో ఉన్న మినహాయింపును మహిళా హక్కుల సంఘాలు సవాలు చేశాయని నివేదికలో ఉంది.

ఈ మినహాయింపు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, హింస క్రూరమైన ప్రవర్తన నుంచి రక్షణ పొందే రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని వారు వాదిస్తున్నారు.

వైవాహిక అత్యాచారం, కోర్టు, దక్షిణాసియా దేశాలు, భారత్, పాకిస్తాన్, పెళ్లి, మహిళ
ఫొటో క్యాప్షన్, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తే పురుషులపై మహిళలు తప్పుడు ఆరోపణలు చేస్తారన్న భయాందోళన ఉంది.

కుటుంబ వ్యవస్థ బలహీనమవుతుందన్న ఆందోళన

'' వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకించే వారు దీన్ని నేరంగా ప్రకటిస్తే కుటుంబ వ్యవస్థ బలహీనపడుతుందని, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని అంటారు. మన దేశాల్లో కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యం ఉంది. దీనివల్ల మన మతపరమైన, సాంస్కృతిక విలువలకు నష్టం జరుగుతుందని కూడా వాళ్లు చెబుతున్నారు. పురుషులపై మహిళలు తప్పుడు ఆరోపణలు చేస్తారనే భయం కూడా వారికి ఉంది'' అని సిల్వాల్ తెలిపారు.

అయితే చట్టంలో మార్పులు తీసుకొచ్చినంత మాత్రాన లైంగిక హింసకు గురైన మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పలేమని సిల్వాల్ అంటున్నారు.

దీనికి ఆమె భూటాన్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు.

భూటాన్‌లో వైవాహిక అత్యాచారం నేరమే అయినప్పటికీ దాన్ని చిన్న నేరంగా పరిగణిస్తున్నారు. ఈ నేరానికి ఒక నెల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

నేపాల్‌లో అత్యాచారానికి ఆరు నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

కానీ ఒక భర్త తన భార్యపై అత్యాచారానికి పాల్పడితే మాత్రం ఆయనకు గరిష్ఠంగా ఐదేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష విధించవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)