ఒకప్పుడు ఎదురులేని నాయకుడు, ఇప్పుడు అంతర్జాతీయ కోర్టు ముంగిటకు..

రోడ్రిగో డుటెర్టె, ఫిలిప్పీన్స్, అంతర్జాతీయ న్యాయస్థానం, డ్రగ్స్ అక్రమ రవాణా
ఫొటో క్యాప్షన్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో విచారణ ఎదుర్కోబోతున్న తొలి ఆసియా నాయకుడు రోడ్రిగో డ్యుటెర్టే.
    • రచయిత, జోయెల్ గుయింటో
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె ది హేగ్‌లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) ఎదుట విచారణను ఎదుర్కోబోతున్నారు.

'డ్రగ్స్‌పై యుద్ధం' పేరుతో వేల మందిని చంపారన్న ఆరోపణలతో 81 ఏళ్ల డ్యుటెర్టెపై ఈ కేసు నమోదైంది.

ఐసీసీ అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి ఆసియా నాయకుడు ఆయనే. ఈ కేసులో డ్యుటెర్టె దోషిగా తేలితే ఈ కోర్టులో శిక్ష పడిన తొలి మాజీ దేశాధినేత అవుతారు.

దేశాలకు చెందిన న్యాయస్థానాలు శక్తిమంతులను శిక్షించలేని లేదా అందుకు ఇష్టపడని పరిస్థితుల్లో వారిని జవాబుదారీగా నిలబెట్టడానికి ఏర్పడిన ఈ అత్యున్నత న్యాయస్థానానికి డ్యుటెర్టె విచారణ కఠిన పరీక్షగా నిలవనుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రోడ్రిగో డుటెర్టె, ఫిలిప్పీన్స్, అంతర్జాతీయ న్యాయస్థానం, డ్రగ్స్ అక్రమ రవాణా
ఫొటో క్యాప్షన్, డ్యుటెర్టే కుటుంబం ఫిలిప్పీన్స్ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంది.

రోడ్రిగో డ్యుటెర్టె ఎవరు?

డ్యుటెర్టె 2016 నుంచి 2022 వరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా పనిచేశారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అంతం చేసి, నేరగాళ్లను తుదముట్టిస్తానని హామీ ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చారు.

అధ్యక్షుడు కావడానికి ముందు దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని ప్రధాన నగరమైన దవావో మేయర్‌గా పనిచేసినప్పుడు నేరాలపై కఠినంగా వ్యవహరించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.

పెట్టుబడులను ఆకర్షించడానికి శాంతిభద్రతలు ఎంతో అవసరమనేది ఆయన అభిప్రాయం.

వివాదాస్పద చరిత్ర ఉన్నప్పటికీ డ్రగ్స్ సమస్య తీవ్రంగా ఉన్న దేశంలో ఆయన కఠిన వైఖరి ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందింది.

మనీలాలోని ఉన్నత వర్గాల వల్ల తాము నిర్లక్ష్యానికి గురయ్యామని భావించే గ్రామీణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే నాయకుడిగా డ్యుటెర్టె తనను తాను ప్రదర్శించుకున్నారు.

సంచలన వ్యాఖ్యలు చేయడంలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అప్పటి పోప్ ఫ్రాన్సిస్‌పై, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఒక సందర్భంలో తనను తాను హిట్లర్‌తో కూడా పోల్చుకున్నారు.

డ్రగ్స్‌పై తాను సాగించిన యుద్ధం విషయంలో ఆయన ఏనాడూ పశ్చాత్తాపం చెందలేదు.

ది హేగ్‌కు తరలిస్తున్న సమయంలో తీసిన ఒక వీడియోలో ఆయన "నేను ఉల్లంఘించిన చట్టం ఏమిటి? నేను చేసిన నేరం ఏమిటి?" అని ప్రశ్నించారు.

విదేశీ జైలులో ఉన్నప్పటికీ ఆయనకు ఆదరణ తగ్గలేదు. ముఖ్యంగా దవావో నగరంలో 2025లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలిచారు.

ఒక శక్తిమంతమైన రాజకీయ కుటుంబానికి పెద్ద ఆయన. ఆయన కుమార్తె సారా ప్రస్తుతం ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

కుమారుడు సెబాస్టియన్ దవావో వైస్-మేయర్‌గా (ప్రస్తుతం తాత్కాలిక మేయర్‌గా) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పెద్ద కుమారుడు పాలో కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు.

రోడ్రిగో డుటెర్టె, ఫిలిప్పీన్స్, అంతర్జాతీయ న్యాయస్థానం, డ్రగ్స్ అక్రమ రవాణా
ఫొటో క్యాప్షన్, 'వార్ ఆన్ డ్రగ్స్'లో చనిపోయిన బాధితుల తల్లి లోర్ పాస్కో అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణకు హాజరవుతున్నారు.

డ్యుటెర్టెపై ఉన్న ఐసీసీ కేసు ఏంటి?

2011 నవంబర్ 1 నుంచి 2019 మార్చి 16 మధ్య కాలంలో మూడు హత్యలు, హత్యాయత్నం సహా ఇతర నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలను డ్యుటెర్టె ఎదుర్కొంటున్నారు.

2016 నుంచి 2022 వరకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు.

డ్రగ్స్ వాడేవారిని, అమ్మేవారిని లక్ష్యంగా చేసుకోవడానికి డ్యుటెర్టె ‘డెత్ స్క్వాడ్స్’ వాడారన్న ఆరోపణలున్న పదుల సంఖ్యలో కేసులను అంతర్జాతీయ న్యాయస్థానం ఈ విచారణలో పరిశీలించనుంది.

అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనుమానిత డ్రగ్స్ విక్రేతలను వినియోగదారులను కాల్చి చంపమని డ్యుటెర్టె బహిరంగంగా పోలీసులను ప్రోత్సహించారన్న ఆరోపణలున్నాయి.

వీధుల్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రజలను కాల్చి చంపిన ఈ ఘటనలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి.

డ్యుటెర్టె డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం నగరాల్లోని పేద వర్గాలకు చెందిన చిన్నస్థాయి విక్రేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని పెద్దస్థాయి డ్రగ్స్ మాఫియా డాన్‌లను, సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టడంలో విఫలమైందని మానవ హక్కుల పర్యవేక్షకులు అంటున్నారు. అనుమానితులను ఎటువంటి విచారణ లేకుండానే చంపేశారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ ప్రచారంలో ఎంతమంది చనిపోయారనే కచ్చితమైన సంఖ్య ఎప్పటికీ తెలియకపోవచ్చు. కానీ సుమారు 30వేల మంది మరణించి ఉంటారని కొన్ని హక్కుల సంఘాలు భావిస్తున్నాయి.

2017 ఆగస్టులో మనీలా శివారు ప్రాంతమైన బులకాన్‌లో ఒకే రాత్రి 32 మంది అనుమానితులు హతమవడం ఇందులో అత్యంత రక్తపాతంతో కూడిన ఘటనలలో ఒకటి.

అయితే డ్యుటెర్టె ఈ ఆరోపణలను ఖండించారు. తనపై మోపిన అభియోగాలను "దారుణమైన అబద్ధం" అని కొట్టిపారేశారు. అధికారుల వాదన కూడా ఇలాగే ఉంది.

తాము కేవలం ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు ఎప్పుడూ వాదిస్తూ వచ్చారు.

రోడ్రిగో డుటెర్టె, ఫిలిప్పీన్స్, అంతర్జాతీయ న్యాయస్థానం, డ్రగ్స్ అక్రమ రవాణా
ఫొటో క్యాప్షన్, డ్యుటెర్టే మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో రాత్రిపూట పోలీసు గస్తీలు ప్రాణాంతకంగా మారేవి.

‘ది హేగ్‌’కు ఎలా చేరుకున్నారు?

అధ్యక్షుడిగా ఉన్నంత కాలం డ్యుటెర్టెకు విచారణ నుండి రక్షణ ఉండేది.

ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయన కుటుంబానికి అపారమైన రాజకీయ అధికారం ఉండేది.

అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌తో ఆయన కుటుంబానికి పొత్తు ఉండేది. మార్కోస్ అధ్యక్ష పదవికి పోటీ చేయగా ఉపాధ్యక్షురాలిగా సారా డ్యుటెర్టె పోటీ చేశారు.

తన కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడానికి ఐసీసీని అనుమతించబోనని మార్కోస్ అప్పట్లో చెప్పారు.

కానీ 2022 ఎన్నికల తర్వాత రెండు కుటుంబాలు వేర్వేరు రాజకీయ అజెండాలను అనుసరించడంతో మార్కోస్-డ్యుటెర్టె కూటమిలో బీటలు వారడం మొదలైంది.

మార్కోస్ తర్వాత తదుపరి అధ్యక్షురాలిగా ఎక్కువగా వినిపించిన సారా డ్యుటెర్టెపై అవినీతి ఆరోపణలతో దర్యాప్తు మొదలైంది.

దీంతో డ్యుటెర్టె మద్దతుదారులు మార్కోస్‌ను విమర్శించడం ప్రారంభించారు.

చివరకు మార్కోస్ తన వైఖరిని మార్చుకున్నారు.

2025 మార్చిలో రోడ్రిగో డ్యుటెర్టె హాంకాంగ్ నుంచి స్వదేశానికి వస్తుండగా మనీలా విమానాశ్రయంలో ఆయన్ను అరెస్టు చేయడానికి ఐసీసీకి అనుమతినిచ్చారు.

డ్యుటెర్టెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన వేగం, ఆయనను దేశం నుండి తరలించిన తీరు అక్కడి రాజకీయ పరిణామాలు ఎంత వేగంగా మారిపోయాయో స్పష్టం చేశాయి.

ఉదయం విమానాశ్రయంలో ఉద్రిక్తతతో మొదలైన వ్యవహారం ఒకప్పుడు ఎవరూ తాకలేరని భావించిన మాజీ నాయకుడిని గల్ఫ్‌స్ట్రీమ్ జెట్ విమానంలో ది హేగ్‌కు తరలించడంతో ముగిసింది.

రోడ్రిగో డుటెర్టె, ఫిలిప్పీన్స్, అంతర్జాతీయ న్యాయస్థానం, డ్రగ్స్ అక్రమ రవాణా
ఫొటో క్యాప్షన్, రోడ్రిగో డ్యుటెర్టె కుమార్తె సారా ప్రస్తుత ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

ఐసీసీ విచారణ ఎందుకు ముఖ్యమైనది?

ఫిలిప్పీన్స్ విషయానికొస్తే, డ్రగ్స్‌పై యుద్ధంలో మరణించిన వారి కుటుంబాలకు చివరకు తమ ఆవేదనను వినిపించే అవకాశం దీని వల్ల లభిస్తుంది.

డ్యుటెర్టె ఆయన మద్దతుదారులు అధికారంలో ఉన్నంత కాలం వారిలో చాలామంది భయంతో మౌనంగా ఉండిపోయారు.

నవంబర్ 30న మొదలయ్యే ఈ విచారణకు కొందరు వితంతువులు, అనాథలు హాజరవుతున్నారు.

ప్రత్యర్థితో తీవ్ర స్థాయిలో సాగుతున్న వైరం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో దేశంలోని అత్యంత శక్తిమంతమైన రాజకీయ కుటుంబాలలో ఒకదాని భవితవ్యాన్ని కూడా ఇది నిర్ణయించనుంది.

అవినీతి ఆరోపణలపై సారా డ్యుటెర్టె ఎదుర్కొంటున్న అభిశంసన విచారణ ముగియడానికి కొద్ది వారాల ముందు ఈ విచారణ జరుగుతోంది.

ఒకవేళ ఆమె దోషిగా తేలితే, 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలవుతారు.

ఐసీసీ విషయానికొస్తే పెరుగుతున్న భౌగోళిక రాజకీయ విభజనల మధ్య అంతర్జాతీయ న్యాయస్థానం పనితీరు, సామర్థ్యానికి డ్యుటెర్టె కేసు ఒక పరీక్షగా నిలుస్తుంది.

గత ఏడాది సంచలన రీతిలో డ్యుటెర్టెను హేగ్‌కు తీసుకురావడం ఐసీసీకి ఎంతో అవసరమైన విజయంగా మారింది.

అంతకుముందు ఈ కోర్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒకటి గాజా యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ అప్పటి ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై మరొకటి ఇలా రెండు కీలక అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

అయితే ఇప్పటివరకు ఆ రెండు వారెంట్లలో ఏ ఒక్కటీ అమలు కాలేదు.

రోడ్రిగో డుటెర్టె, ఫిలిప్పీన్స్, అంతర్జాతీయ న్యాయస్థానం, డ్రగ్స్ అక్రమ రవాణా
ఫొటో క్యాప్షన్, నాటకీయ పరిణామాల మధ్య డ్యుటెర్టెను అరెస్టు చేసి హేగ్‌కు తరలించారు.

విచారణ సమయంలో ఏం జరుగుతుంది?

నవంబర్ 30న ది హేగ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు) విచారణ మొదలవుతుంది.

మొదట న్యాయమూర్తులు డ్యుటెర్టెను తనపై మోపిన అభియోగాల స్వభావం అర్థమైందా అని అడుగుతారు. అలాగే నేరాన్ని అంగీకరిస్తున్నారా లేదా తిరస్కరిస్తున్నారా అని ప్రశ్నిస్తారు.

ఆ తర్వాత, ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు బాధితుల తరపు న్యాయ ప్రతినిధులు తమ ప్రారంభ వాదనలను వినిపిస్తారు. డ్యుటెర్టె తరపు న్యాయవాదులు కోరుకుంటే వారికి కూడా వాదనలు వినిపించే అవకాశం ఇస్తారు.

ప్రారంభ వాదనల తర్వాత మొదటి ప్రాసిక్యూషన్ సాక్షిని కోర్టు ముందు ప్రవేశపెడతారు. ప్రాసిక్యూషన్ తర్వాత డ్యుటెర్టె తరపు న్యాయవాదులు తమ సాక్షులను ప్రవేశపెడతారు.

విచారణకు సంబంధించిన బహిరంగ ప్రత్యక్ష ప్రసారాలు 30 నిమిషాల ఆలస్యంతో ప్రసారమవుతాయి.

రోడ్రిగో డుటెర్టె, ఫిలిప్పీన్స్, అంతర్జాతీయ న్యాయస్థానం, డ్రగ్స్ అక్రమ రవాణా
ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయ నేర న్యాయస్థానం గతంలో నెతన్యాహు, పుతిన్‌లకు వారెంట్ జారీ చేసింది.

ఐసీసీ తీర్పును ఎప్పుడు వస్తుంది?

అది ఇప్పుడే తెలియదు. కేవలం "సహేతుకమైన సమయంలోపు" తీర్పును వెలువరిస్తామని మాత్రమే ఐసీసీ పేర్కొంది.

నేరం రుజువు కావాలంటే అభియోగాలను ఎటువంటి సందేహానికి తావులేకుండా నిరూపించాల్సి ఉంటుంది.

తుది తీర్పు వెలువడటానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)