డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల తలోదారి.. ఇండీ కూటమి మరింత బలహీనం కాబోతుందా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, శుభమ్ గర్గ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో ప్రతిపక్ష కూటమిలో విభేదాలు మరోసారి బయటపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. అయితే ప్రతిపక్ష కూటమిలో ఏకాభిప్రాయం కనిపించడం లేదు.
ఒకప్పుడు ఇండీ కూటమిలో భాగమైన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ), డీఎంకే పార్టీల వైఖరి కాంగ్రెస్ కంటే భిన్నంగా ఉంది.
ఇండీ కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సీట్ల పంపకం, ఎన్నికల వ్యూహాల విషయంలోనూ కూటమిలో విభేదాలు తలెత్తాయి.
ఇలాంటి పరిస్థితుల్లో, డీలిమిటేషన్ బిల్లు ప్రతిపక్షాల ఐక్యతకు మరో పెద్ద సవాలుగా మారిందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

శరద్ పవార్ పార్టీ, డీఎంకే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఇండీ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
శరద్ పవార్ చాలా కాలంగా ఇండీ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు.
అయితే, మహారాష్ట్రలో ఆయన పార్టీ రాజకీయ ఉనికికి ముప్పు పొంచి ఉంది.
ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఆయనకు ఇప్పుడు అనివార్యం కావచ్చు.
ఇండీ కూటమిలో మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, పీడీపీ, శివసేన (యూబీటీ) సహా పలు పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.
నవంబర్ 30 నుంచి జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు ద్వారా రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచేందుకు మార్గం సుగమం అవుతుందని గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
"రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(1) కి ప్రతిపాదించిన ఈ సవరణ వల్ల జనాభాకు అనుగుణంగా మెరుగైన ప్రాతినిధ్యం కోసం రాష్ట్ర శాసనసభల గరిష్ట సభ్యుల సంఖ్యను 500 నుంచి సుమారు 650కి పెంచడానికి వీలు కలిపిస్తుంది" అని ఆయన 'ఎక్స్' లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
ఇండీ కూటమి సమావేశానికి హాజరుకాని పార్టీలు
డీలిమిటేషన్ బిల్లుపై చర్చించేందుకు శనివారం ఇండీ కూటమి సమావేశమైంది.
ఈ సమావేశం అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ "543 సీట్లలో నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం ద్వారా రాజకీయ మార్పు తేవచ్చు. 850 సీట్లు ఉంటే ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చినట్లు పని చేస్తుంది" అని అన్నారు.
దీనిని ఆయన ప్రభుత్వానికి ఇచ్చిన 'బ్లాంక్ చెక్'గా అభివర్ణించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ, డీలిమిటేషన్ బిల్లు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ప్రయోజనాలకు వ్యతిరేకమని అన్నారు.
అయితే, డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్) ఈ సమావేశానికి హాజరుకాలేదు. అవి ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేశాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ, బిజూ జనతాదళ్ పార్టీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. కానీ ఈ పార్టీలు ఈ మీటింగ్‌కు రాలేదని పీటీఐ వార్తా కథనం తెలిపింది.
ప్రతిపక్షాల ఐక్యత బలహీనంగా కనిపించడం ఇదే మొదటిసారి కాదు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, కాంగ్రెస్ వేర్వేరు దారులు ఎంచుకున్నాయి.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య కూడా విభేదాలు కనిపించాయి.

'బిల్లు ఆమోదం ప్రతిపక్షాలకు డబుల్ షాక్'
ఏప్రిల్ నాటి పరిస్థితికి, ప్రస్తుత పరిస్థితికి చాలా తేడా ఉందని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది బీబీసీతో చెప్పారు. ఏప్రిల్‌లో ప్రతిపక్షాలు లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును అడ్డుకున్నాయి. ప్రభుత్వం మళ్లీ బిల్లును ప్రవేశపెడుతుందని తెలిసినందున అప్పటి నుంచే ప్రతిపక్షాలు ఐక్యతపై మరింత దృష్టి సారించి ఉండే బావుండేదని ఆయన అన్నారు.
"ఎన్డీయే విజయం ప్రతిపక్షాలను రెండు విధాలుగా దెబ్బతీసింది. మొదటిది జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నడుపుతున్న ప్రచారం బలహీనపడింది. రెండోది డీలిమిటేషన్ బిల్లు ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఇండీ కూటమిని బలహీనపరిచింది" అని ఆయన చెప్పారు.
"ఇది మొత్తం కూటమిలో విభేదాలకు సంబంధించిన విషయం కాదు. కేవలం రెండు పార్టీల మధ్య మాత్రమే విభేదాలు తలెత్తాయి. వీటిలో మొదటి పార్టీ డీఎంకే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. దీనివల్ల డీఎంకే ఇండియా కూటమి నుంచి వేరుపడింది" అని రాజకీయ విశ్లేషకుడు ఆదర్శ్ రావల్ విశ్లేషించారు.
తమిళనాడు ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ, విజయ్‌కు మద్దతు ఇచ్చి డీఎంకేను వదిలేసినప్పటి నుంచే విభేదాలు మొదలయ్యాయని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది అభిప్రాయపడ్డారు.
"కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని చెప్పడానికి ఇది డీఎంకేకు అవకాశం ఇచ్చింది. డీఎంకే ఇండియా కూటమితో లేకపోతే, ఎన్డీయేతో కలిసి వెళ్లవచ్చనే మార్గాన్ని ఇది తెరిచింది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కీలక సమయంలో శరద్ పవార్ ఎందుకిలా చేశారు?
శరద్ పవార్ పార్టీ చాలా కాలంగా తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోందనేది విజయ్ త్రివేది అభిప్రాయం.
ఈ విషయంలో తమ సంస్థను కాపాడగలమని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ శరద్ పవార్‌కు భరోసా ఇవ్వలేదని ఆయన భావిస్తున్నారు.
"శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలే రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. అలాగే తన పార్టీని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు" అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో శరద్ పవార్‌కు ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని కూడా విజయ్ త్రివేది ప్రస్తావించారు.
"శరద్ పవార్‌ను కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడిగా ఎందుకు పరిగణించాలనేది అతి ముఖ్యమైన ప్రశ్న. కాంగ్రెస్ అత్యుత్తమ దశలో ఉండి సోనియా గాంధీ ప్రధానమంత్రి కాబోతున్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితిలో శరద్ పవార్‌ను నమ్మడానికి కారణం లేదు" అని ఆయన అన్నారు.
అదే సమయంలో రాజకీయ విశ్లేషకుడు ఆదర్శ్ రావల్ ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర రాజకీయాలు శరద్ పవార్ పార్టీ భవిష్యత్తుతో ముడిపెట్టారు.
"బీజేపీ ఇప్పటికే ఎన్సీపీని రెండుగా చీల్చింది. పవార్ సాహెబ్ ఎన్నికల గుర్తును కూడా లాక్కుంది. కానీ ఇప్పుడు ఆయన ఎన్డీయేకు అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు" అని ఆయన అన్నారు.
మహారాష్ట్రలో బీజేపీపై ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఆదర్శ్ రావల్ చెప్పారు.
"ఈ బిల్లుతో పాటు, సుప్రియా సూలే కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అయితే రాజకీయాలు పరిస్థితులను బట్టి మారే క్రీడ" అని ఆయన అన్నారు.
ఈ నిర్ణయం వెనుక ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఉన్నారని కూడా ఆదర్శ్ రావల్ సూచించారు. "ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, శరద్ పవార్‌కు ఇద్దరికీ సన్నిహితుడు" అని ఆయన చెప్పారు.
"డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టడానికి ముందు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని నేను అనుకున్నాను. కానీ అది జరగలేదు" అని చెప్పారు.
"మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు ఆ సీటు శివసేన (యూబీటీ)కి వెళ్లాల్సి ఉందని నాకు గుర్తుంది. కానీ అందరూ కలిసి ఆ రాజ్యసభ సీటును శరద్ పవార్‌కు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఫలితం భిన్నంగా ఉంది" అని మహారాష్ట్రలో జరిగిన రాజ్యసభ ఎన్నికలను ప్రస్తావిస్తూ ఆదర్శ్ రావల్ అన్నారు.

కూటమిపై కాంగ్రెస్ పట్టు కోల్పోతుందా?
"డీఎంకేకు ఉన్న 22 సీట్లు ఎన్డీయే వైపు వెళ్లకపోతే ప్రభుత్వం ఈ బిల్లును మళ్లీ తీసుకురావడానికి ధైర్యం చేసేది కాదు. డీఎంకే స్పష్టంగా కాంగ్రెస్ కూటమిని బలహీనపరిచింది. సభలో ప్రతిపక్ష బలం కూడా బలహీనపడింది" అని ఆయన చెప్పారు.
"జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ప్రతిపక్షం చాలా బలంగా కనిపించింది. కానీ ఇప్పుడు దాని కోట కూలిపోయింది. ఇప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్, ప్రతిపక్షాలు బలహీనంగా కనిపిస్తాయి. ఇది పెండింగ్‌లో ఉన్న బిల్లులను తీసుకురావడానికి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది" అని విజయ్ త్రివేది తెలిపారు.
2026 ఏప్రిల్‌లో ఈ బిల్లు ఆమోదాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించాయని ఆదర్శ్ రావల్ అన్నారు. అయితే ప్రభుత్వం సిద్ధం కావడానికి సమయం తీసుకుని, ఆ తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టింది.
"కాంగ్రెస్ కారణంగానే డీఎంకే శరద్ పవార్ పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నాయని మనం చెప్పలేము" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI
డీలిమిటేషన్ అంటే ఏమిటి?
నియోజకవర్గాల పునర్విభజన అనేది సాధారణంగా జనాభా లెక్కల తర్వాత నిర్వహించే ఒక రాజ్యాంగ ప్రక్రియ.
జనాభా లెక్కలు ఒక నియోజకవర్గ జనాభాను నిర్ణయిస్తాయి.
దీని ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను మారుస్తారు.
దీని కోసం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు.
భారతదేశంలో ఇప్పటివరకు 1952, 1963, 1973, 2002లో నాలుగు సార్లు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది.
రాజ్యాంగం ఈ కమిషన్‌కు అధికారాలు, స్వయంప్రతిపత్తిని కల్పిస్తుంది. దీని నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాలు చేయలేము.
1952లో లోక్‌సభలో మొత్తం 489 సీట్లు ఉండగా, 1973లో ఆ సంఖ్య 543కి పెరిగింది. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 సంవత్సరాల పాటు డీలిమిటేషన్‌పై తాత్కాలిక నిషేధం విధించారు.
ఆ తర్వాత 2001లో జనాభా లెక్కలు జరిగాయి. 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది.
అయితే అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్‌ను మరో 25 సంవత్సరాల పాటు వాయిదా వేసింది.
2026 ఏప్రిల్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటింగ్ తర్వాత వీగిపోయింది.
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించడానికి ఈ బిల్లును రూపొందించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































