పది సెంటీమీటర్లకు మించి పెరగవు.. ప్రపంచంలో 300 మాత్రమే ఉన్నాయి.. అంతరించిపోతున్న అతి చిన్న తాబేళ్లతో విమానాశ్రయంలో దొరికిన ప్రయాణికుడు

వల్లార్టా మడ్ టర్టిల్స్
ఫొటో క్యాప్షన్, వల్లార్టా మడ్ టర్టిల్స్... ప్రపంచంలోనే అతిచిన్న మంచినీటి తాబేళ్లు. ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్ షిపోల్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగేజీ నుంచి 26 అత్యంత అరుదైన తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మెక్సికో నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్ మీదుగా హాంకాంగ్ వెళ్తున్న ఒక వ్యక్తిని శనివారం కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసినట్లు నెదర్లాండ్స్ ఫుడ్ అండ్ కంజ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌వీడబ్ల్యూఏ) వెల్లడించింది. అతడి వద్ద 'వయార్టా మడ్ టర్టిల్స్' అనే అరుదైన జాతి తాబేళ్లు లభ్యమయ్యాయి.

ఇవి ప్రపంచంలోనే అతి చిన్న మంచినీటి తాబేళ్లు. ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వీటి గరిష్ఠ పొడవు కేవలం 10 సెంటీమీటర్లు (4 అంగుళాలు) మాత్రమే ఉంటుంది.

ఈ తాబేళ్లు కదలకుండా ఉండేందుకు ఆ ప్రయాణికుడు వాటికి టేప్‌ చుట్టి తీసుకొచ్చారు.

ఈ తాబేళ్లను వాటి ఆవాసమైన మెక్సికో అడవుల నుంచి దొంగిలించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ తాబేళ్లలో కొన్నింటిని ఒక బొమ్మ కారు ఉన్న పెట్టెలో దాచగా, మరికొన్నింటిని సూట్‌కేసులో ఉన్న సాక్స్‌లో కుక్కేశారు.

ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఆ తాబేళ్లను ఒక ప్రత్యేక జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి సంరక్షిస్తున్నారు.

‘ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 మాత్రమే మిగిలి ఉన్నాయి’

అమెరికాకు చెందిన 'టర్టిల్ ఐలాండ్' అనే ఎన్‌జీఓ అంచనా ప్రకారం.. 2025 నాటికి ఈ వల్లార్టా జాతి తాబేళ్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) వీటిని తీవ్రంగా అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చింది.

పర్యావరణ వార్తా సంస్థ మాంగబే నివేదిక ప్రకారం, ఆసియా బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో వయార్టా తాబేలు ధర 10,000 డాలర్లు (సుమారు రూ. 9 లక్షలు) లేదా అంతకంటే ఎక్కువే పలుకుతుంది.

హాంకాంగ్‌కు సజీవంగా తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్న కేసులు ఈ ఏడాది మరికొన్ని వెలుగుచూశాయి.

అక్టోబర్‌లో దాదాపు 54,000 డాలర్ల (దాదాపు రూ. 50 లక్షల) విలువైన 8 అరుదైన తాబేళ్లను హాంకాంగ్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అంతకు మూడు నెలల ముందు జరిగిన మరో రెండు వేర్వేరు ఘటనల్లో 2,10,000 డాలర్ల (సుమారు రూ.2 కోట్ల) విలువైన 42 తాబేళ్లను అధికారులు పట్టుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)