సీట్లలో నల్లుల కారణంగా ఆగిపోయిన విమానం

ఫొటో సోర్స్, Massimo Insabato via Getty Images
- రచయిత, టిఫ్ఫనీ వెర్తైమర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఇటలీ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాల్సిన ‘క్వాంటాస్’ విమానం నల్లుల కారణంగా శనివారం రద్దయింది.
అంతకు ముందురోజు పెర్త్ నుంచి రోమ్ వచ్చిన ఈ విమానంలో 17 గంటల ప్రయాణంలో కొంతమంది ప్రయాణికులు తమను నల్లులు కుట్టినట్లు ఫిర్యాదు చేశారని 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' పేర్కొంది.
కాగా నల్లులు కుట్టడం వల్ల కలిగిన దురదను తగ్గించడానికి ప్రయాణికులకు యాంటీహిస్టామైన్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే, ఆ మందుల నిల్వలు అయిపోయాయి.
క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ నడుపుతున్న ఈ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాన్ని 'డీప్ క్లీనింగ్' కోసం పంపినట్లు క్వాంటాస్ ప్రతినిధి ఒకరు బీబీసీకి తెలిపారు.
'ఎకానమీ క్లాస్‌లోని కొన్ని సీట్లలో సమస్యను గుర్తించిన తర్వాత మా ఇంజనీర్లు, నిర్వహణ బృందాలు విమానాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేయడానికి వీలుగా శనివారం నాటి రోమ్-పెర్త్ సర్వీసును రద్దు చేసినందుకు వినియోగదారులకు మేం క్షమాపణలు చెబుతున్నాం' అని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.

విమాన సర్వీస్ రద్దు వల్ల ఇబ్బందికి గురైన ప్రయాణికులందరికి వసతి కల్పించామని, అలాగే వారు వెళ్లాల్సిన సమయం నుంచి 48 గంటల్లోపే వేరే విమానాల్లో ప్రయాణ ఏర్పాటు చేశామని క్వాంటాస్ తెలిపింది.
నల్లులు చాలా చిన్నవి. రెక్కలు లేని ఈ పరాన్నజీవులు దుస్తుల్లో, ఫర్నిచర్, పరుపులు, దుప్పట్లలో దూరి జీవిస్తాయి. అవి కుట్టినప్పుడు దురదగా అనిపిస్తుంది కానీ దానివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏవి రావని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
కానీ వాటిని వదిలించుకోవడం చాలా కష్టమైన, ఖర్చుతో కూడుకున్న పని. నివారణ చర్యలలో భాగంగా దుప్పట్లు, పరుపులు, ఇంట్లో తరచూ వాడే కర్టెన్లను వేడినీళ్లలో ఉతికి గాలికి ఆరబెట్టాలి. లేదంటే అన్నిటిని ప్లాస్టిక్ బ్యాగులలో ఉంచి 3 నుంచి 4 రోజులు ఫ్రీజర్లలో పెట్టాలి.
నల్లులు ప్రయాణాన్ని ఇబ్బంది కలిగించడం కొత్తేమి కాదు. ఇంగ్లాండ్‌లో రెండు వారాల క్రితం డ్రైవర్లు వారి క్యాబిన్లలో ఈ పురుగుల్ని గుర్తించిన తర్వాత సౌత్‌ఈస్టర్న్ రైల్వే సంస్థకు చెందిన చాలా రైళ్లు రద్దు చేశారు.
2017 లో వాంకోవర్ నుంచి లండన్‌కు రాత్రంతా సాగిన విమాన ప్రయాణంలో, పురుగులు కుట్టడం వాళ్ళ దద్దుర్లు అయినందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక కుటుంబానికి క్షమాపణలు చెప్పింది.
అలాగే టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో విమానాలలో నల్లులకి సంబంధించిన ఘటనలను గత ఏడాది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
కానీ ఆ సమయంలో దీనికి సంబంధించి ఆ విమానయాన సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























