కాంగ్రెస్, సీజేపీ: ఎంత దూరం, ఎంత దగ్గర - నిరసనల వేళ రాహుల్ దిల్లీలో ఎందుకు లేరు?

రాహుల్ గాంధీ, నిరసనలు, సీజేపీ
ఫొటో క్యాప్షన్, సీజేపీ నిరసనలను అణిచివేసేందుకు దిల్లీలో భారీగా బలగాలను మోహరించిన వేళ రాహుల్ గాంధీ 'ఛాత్రోన్ కీ గూంజ్'కార్యక్రమం కోసం చెన్నైకు వెళ్లారు.
    • రచయిత, శుభాంగి మిశ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర శనివారం నిరసనకు పిలుపునిచ్చింది. కానీ ఆందోళనాకారులెవరూ జంతర్ మంతర్ వద్దకు చేరుకోకుండా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ ఆంక్షలను లెక్కచేయకుండా భారీ ఎత్తున విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, సాధారణ పౌరులు, రాజకీయ నాయకులు వీధుల్లోకి వచ్చారు. వీరిలో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నవారిలో అభిజీత్ దీప్కే, నేహా బోరాతో పాటు మమతా బెనర్జీ, బృందా కరత్, దీపాంకర్ భట్టాచార్య, అరవింద్ కేజ్రీవాల్ వంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.

కానీ వీటన్నింటి మధ్య గత కొన్ని రోజులుగా జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిల్లీలో లేరు. ఆయన వందల కిలోమీటర్ల దూరంలోని చెన్నైలో కాంగ్రెస్ నిర్వహించిన 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు. అంతకుముందు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో కూడా సమావేశమయ్యారు.

అయితే శనివారం సాయంత్రం ఆయన 'ఎక్స్'లో ఒక పోస్ట్ కూడా చేశారు. అందులో, "నాయకులందరినీ అరెస్టు చేయండి. యువతనంతా అరెస్టు చేయండి. మమ్మల్ని అందరినీ అరెస్టు చేయండి. మేము మిమ్మల్ని చుట్టుముట్టాం, మేం వెనక్కి తగ్గం. నా మాటలు గుర్తుంచుకోండి.. మాకు కావలసిన సమాచారం మాకు ఇప్పటికే అందింది" అని పేర్కొన్నారు.

అయితే ఆయన దిల్లీలో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాహుల్ గాంధీ, కాంగ్రెస్, నిరసన, భారత ఎన్నికల కమిషన్
ఫొటో క్యాప్షన్, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ దిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది

దిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యంగా మార్చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఈ ప్రదర్శనకు అనుమతి నిరాకరించినట్టు పోలీసులు ముందు రోజే స్పష్టం చేశారు.

అక్టోబర్ 10న దిల్లీకి వచ్చే, వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. 45 మెట్రో స్టేషన్లను మూసివేశారు. దిల్లీ సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసి, బారికేడ్లను ఏర్పాటు చేశారు. పలువురిని వారి ఇళ్ల దగ్గరే అదుపులోకి తీసుకున్నారు.

అక్టోబర్ 6, 8 తేదీల మధ్య, రాహుల్ గాంధీ ఇతర ఇండియా కూటమి నాయకులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దిల్లీ వీధుల్లో నిరసన తెలిపారు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత అక్టోబరు 10 నాటి నిరసనల వేళ దిల్లీలో లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్, నిరసన, భారత ఎన్నికల కమిషన్
ఫొటో క్యాప్షన్, సీజేపీ నిరసనలకు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు.

కాంగ్రెస్, సీజేపీ: ఎంత దగ్గర, ఎంత దూరం?

రాహుల్ గాంధీ గైర్హాజరుపై పలువురు 'ఎక్స్' లో స్పందించారు.

"దిల్లీలో ఇంత ఉద్రిక్తత నెలకొన్న సమయంలో రాహుల్ గాంధీ ఈరోజు చెన్నైకు ఎందుకు వెళ్లారు?" అని కంటెంట్ క్రియేటర్ అమిత్ కిల్హోర్ ప్రశ్నించారు.

"డి-డే నాడు, మీ నిరసనల పోస్టర్ బాయ్ రాహుల్ గాంధీ చెన్నైకి పారిపోయారు" అని జర్నలిస్ట్ భూపేంద్ర చౌబే చేసిన పోస్ట్‌పై వల్సాద్ ఎంపీ ధవల్ పటేల్ వ్యంగ్యంగా స్పందించారు.

కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీల సమస్యలు ఒకేలా ఉన్నప్పటికీ, వాళ్లు సాధారణంగా వాటిని విడివిడిగానే లేవనెత్తుతారు.

జూన్, జూలైల్లో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా సీజేపీ చేసిన ఆందోళనలో రాహుల్ గాంధీ పాల్గొనలేదు. ఆ సమయంలో ఆయన దృష్టి అంతా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యుఐ) దేశవ్యాప్తంగా నిర్వహించిన 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమాలపైనే ఉంది.

అయితే జూలై 20న సీజేపీ పిలుపునిచ్చిన మార్చ్‌ సందర్భంగా విద్యార్థులపై జరిగిన హింస, పోలీసుల చర్యకు నిరసనగా జూలై 21న ఆయన ప్రధాని నివాసం వెలుపల ధర్నా నిర్వహించారు.

కాక్రోచ్ జనతా పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీకి సన్నిహితంగా కూడా చూస్తారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కో-కన్వీనర్ అశుతోష్ రాంకా ఇద్దరూ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు.

"ఎన్‌ఎస్‌యుఐ కేడర్ ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తోందని ఖచ్చితంగా అనుకుంటున్నా. దీనికి నిర్దుష్ట ఆధారాలు లేవు, కానీ ఈ సమయంలో ఏ విద్యార్థి సంఘం కూడా సీజేపీకి దూరంగా ఉండలేదు" అని సీనియర్ జర్నలిస్ట్ అదితి ఫడ్నీస్ అన్నారు.

రాహుల్ గాంధీ ఇంతకు ముందెన్నడూ 'కాక్రోచ్' ఉద్యమంలో భాగం కాలేదని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి చెప్పారు. రాహుల్ గాంధీ దిల్లీలో ఉన్నా పెద్దగా తేడా ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

"కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పుడూ ఐక్యంగాపోరాడలేదన్నది బహిరంగ రహస్యం. వాళ్లు ఒకే రకమైన సమస్యలను లేవనెత్తుతున్నప్పటికీ, సీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ప్రాక్సీ అని కాంగ్రెస్ నమ్ముతుంది" అని అజయ్ అన్నారు.

సీజేపీ కూడా ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి నడవడానికి ఇష్టపడటం లేదని సీనియర్ జర్నలిస్ట్ అదితి ఫడ్నీస్ చెప్పారు.

"ఒకవేళ తాము ఏదైనా రాజకీయ పార్టీతో జతకడితే ప్రస్తుతం బీజేపీపై కోపంగా ఉండి తమకు మద్దతు ఇస్తున్న యువతను కోల్పోతామని సీజేపీ భయపడుతోంది. యువత సీజేపీకి మద్దతు ఇవ్వవచ్చు... కానీ కాంగ్రెస్‌కు మాత్రం ఇవ్వకపోవచ్చు" అన్నారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్, నిరసన, భారత ఎన్నికల కమిషన్
ఫొటో క్యాప్షన్, రాహుల్ దిల్లీలో లేకపోవడం వ్యూహాత్మక నిర్ణయం కావొచ్చని రాజకీయ నిపుణులుంటున్నారు.

'రాహుల్ గాంధీ హీరో కావాలనుకోవడం లేదు'

రాహుల్ గాంధీ దిల్లీలో లేకపోవడం ఒక వ్యూహాత్మక నిర్ణయం కావచ్చని మేం మాట్లాడిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

రాహుల్ గాంధీ గతంలో కూటమి భాగస్వాములు, ఎంపీలతో కలిసి దిల్లీ వీధుల్లో నిరసనలకు నాయకత్వం వహించారని రాజకీయ విశ్లేషకుడు గిల్లెస్ వెర్నియర్స్ చెప్పారు. ఆ సందర్భాల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రను పోషించారు. కానీ శనివారం నాటి నిరసన ఒక పౌర సమాజ ఉద్యమం, ఇది ఏదో ఒక పార్టీ రాజకీయం కాదు.

"ప్రస్తుత తరుణంలో ప్రతిపక్ష నేత పాత్ర చాలా సున్నితమైనదని, రాహుల్ గాంధీ దానిని చక్కగా నిర్వహిస్తున్నారని భావిస్తున్నా. తానే ఒక హీరోలా కనిపించాలని లేదా ప్రతి ఉద్యమం తన చుట్టూనే తిరగాలని ఆయన అనుకోవడం లేదు" అని గిల్లేస్ అన్నారు.

ఈ నేపథ్యంలో నిరసనలో చేరడం కంటే పార్టీ పనులపై దృష్టి పెట్టడం ద్వారా ఇది రాహుల్ గాంధీ లేదా ప్రతిపక్ష రాజకీయాల గురించి కాదని, దేశ ప్రయోజనాల గురించిన విషయమని స్పష్టం అవుతోంది. పౌర సమాజ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ముఖ్యం, రాహుల్ గాంధీ ఇందులో చాలా వరకు విజయం సాధించారని భావిస్తున్నా. కాంగ్రెస్ శ్రేణులతో ఆయన జరిపిన సమావేశం కూడా ఈ ఆలోచనాత్మక విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఉద్యమానికి తానే కేంద్ర బిందువుననే అభిప్రాయాన్ని ఆయన కలిగించకూడదనుకుంటున్నారు.

ఈరోజు దిల్లీ పోలీసులు సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను దిల్లీ చేరుకున్న తర్వాత విమానం లోపలి నుంచే అదుపులోకి తీసుకున్నారు. కంటెంట్ క్రియేటర్ ధ్రువ్ రాఠీని గురుగ్రామ్‌లోని ఆయన నివాసం నుంచి, కావ్యా కర్ణాటక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. నేహా బోరా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, దీపాంకర్ భట్టాచార్యను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పలువురు జర్నలిస్టులను కూడా నిర్బంధించారు.

"రాహుల్ గాంధీ కూడా ఈరోజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నా. ఒకవేళ ఆయన్ను కూడా అదుపులోకి తీసుకుని ఉంటే, మొత్తం ఉద్యమానికి నాయకత్వం లేకుండా పోయేది" అని ప్రొఫెసర్ గుడవర్తి చెప్పారు.

"రాహుల్ గాంధీ దీనిని ఒక దీర్ఘకాలిక, నిరంతర ఉద్యమంగా చూస్తున్నారు. ఇదేదో ఈరోజు నిరసన ప్రదర్శన చేసి, రేపు రాజీనామాతో ముగిసే వ్యవహారం కాదు, ఈ ఉద్యమాన్ని రాహుల్ భిన్నమైన కోణం నుంచి చూస్తున్నారు'' అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)