‘ఇకపై సీజేపీ ఉద్యమ బాధ్యత అజింక్య శిందే నే చూస్తారు’ అని దీప్కే చెప్పిన శిందే ఎవరు?

ఫొటో సోర్స్, Ajinkya Shinde/Instagram
‘‘నిర్బంధంలో ఉన్న అభిజిత్ దీప్కేకు తన నాయనమ్మ మరణ వార్త తెలియజేయలేదని పలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయం ఆయనకు వెంటనే తెలియజేశాం, అలాగే దీప్కే నాయనమ్మ అంత్య క్రియలు జరిగే సమయాన్ని కూడా చెప్పాం, మానవతా దృక్పథంతో ఆయన తన స్వగ్రామానికి వెళ్లడానికి తగిన ఏర్పాట్లు కూడా అందిస్తాం’’ దిల్లీ పోలీసులు చెప్పారు.
అభిజిత్ దీప్కేకు ఆయన నాయనమ్మ చనిపోయిన విషయాన్ని చెప్పలేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని దిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో కోరారు.
కానీ శనివారం సాయంత్రం సీజేపీ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘‘అభిజిత్ దీప్కే నాయనమ్మ చనిపోయారు. కుటుంబసభ్యులు ఆ విషాద వార్తను దీప్కేకు తెలియజేయడానికి పోలీసులు అనుమతించలేదు’’ అని చెప్పారు. దీప్కేను వెంటనే విడుదల చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది.
అభిజీత్ దీప్కే నాయనమ్మ మరణించిన విషయాన్ని దిల్లీ పోలీసులు ఆయనకు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
"వాళ్లు నిరసన కొనసాగించాలా లేక అంత్యక్రియలకు హాజరు కావడానికి తిరిగి వెళ్ళాలా అనేది ఇప్పుడు వారే నిర్ణయించుకోవాలని" పోలీసులు చెప్పినట్లు ఏఎన్ఐ కథనం వెల్లడించింది.


ఫొటో సోర్స్, Abhishek Chinnappa/Getty Images
కాక్రోజ్ జనతా పార్టీ ముగ్గురు కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అభిజీత్ దీప్కే సీజేపీ ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
"ఇకపై ఈ ఉద్యమానికి అజింక్య శిందే నాయకత్వం వహిస్తారని" అందులో చెప్పారు.
"అజింక్య శిందే ఓ కంప్యూటర్ ఇంజినీర్. లాతూర్ జిల్లా ఉజని నివాసి. రాయగడ జిల్లా లోణేరేలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో పట్టా పొందారు.
సాధారణ కుటుంబం నుండి వచ్చిన అజింక్య శిందే తండ్రి రైతు, తల్లి గృహిణి. ప్రారంభంలో ఆయన పూణేలోని ఐటీ రంగంలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు.
"ప్రస్తుతం ఆయన సీజేపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. సీజేపీ కోర్ టీమ్‌లో కీలక సభ్యుడు.
ఆగస్టులో ఆయనకు సీజేపీ జాతీయ సంస్థాగత అధిపతిగా బాధ్యతలు అప్పగించారు. సీజేపీ పాఠశాలలకు సంబంధించిన ప్రచార కార్యక్రమానికి కూడా ఆయన నాయకత్వం వహించారు.
గత వారం కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ముంబయిలోని శివాజీ పార్క్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమ నిర్వహణలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
లాతూర్ జిల్లాలోని ఉజనిలో ఆయన పాల రైతుల కోసం పనిచేశారు. కోవిడ్ తర్వాత ఆయన తన స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత గ్రామంలోని చిన్న చిన్న పాల ఉత్పత్తిదారులను ఏకం చేసి ఒక పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. దాని ద్వారానే ఆయన 'బాసుంది' కి ఒక స్థానిక బ్రాండ్ తయారు చేశారు.
ఆయన తయారు చేసిన ఈ ఉత్పత్తి లాతూర్ జిల్లాతో పాటు సోలాపూర్, ధారాశివ్ చుట్టుపక్కల జిల్లాలకు సరఫరా అయ్యేది. దీనివల్ల రైతుల పాలకు మంచి ధర లభించడంతో పాటు, గ్రామంలోని యువతకు ఉపాధి కూడా దొరికింది.

ఫొటో సోర్స్, Reuters
నేహా బోరా : ప్రతి చోటు జంతర్ మంతరే
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేహా బోరా తన మద్దతుదారులతో కలిసి పోలీసుల కళ్ళు గప్పి నిరసన తెలపడానికి దిల్లీ హట్ వద్దకు చేరుకున్నారు.
యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, దీపాంకర్ భట్టాచార్యలతో పాటు నేహా బోరాను సఫ్దర్‌జంగ్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నేహా బోరా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
"నేను కస్టడీలో ఉన్నాను. ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఫ్లైఓవర్ వద్ద ప్రజలు గుమిగూడుతున్నారు. మీకు వీలైతే వెళ్ళండి. మిమ్మల్ని ఆపితే అక్కడే కూర్చుని మీ నిరసన తెలియజేండి. మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ అది ముఖ్యం కాదు" అని ఆమె అందులో రాశారు.
"నా తోటి జెన్ జీ.. ఇది మన 1942. వారి జైళ్లు మనలో కొందరిని బంధించగలవు. కానీ అందరినీ కాదు. ఈ రోజు మనలో ఎవరిని ఎక్కడ ఆపినా అక్కడే కూర్చుని ప్రారంభించండి. ప్రతి వీధి జంతర్ మంతర్ అవుతుంది" అని నేహా బోరా తన పోస్టులే పేర్కొన్నారు.
అయితే సాయంత్రానికి నేహా బోరాను విడుదల చేశారు.
గత కొన్ని నెలలుగా నిరసనల సమయంలో నేహా బోరా పోలీసులతో పలుమార్లు ఘర్షణ పడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
కోర్టు ధిక్కరణపై సుప్రీంలో పిటిషన్
రవాణా సేవలను పూర్తిగా నిలిపివేయకూడదనే ఆదేశాలు ఉన్నప్పటికీ, పలు ఢిల్లీ మెట్రో స్టేషన్లను మూసివేశారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, దిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్, డీఎంఆర్సీ చైర్మన్ డి.థారాలపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.
సరైన కారణం లేకుండా రైలు సర్వీసులను రద్దు చేశారని పిటిషనర్ ఆరోపించారు.
అధికారులు కోర్టు ఆదేశాలను పాటించకపోవడం వల్ల దిల్లీలో సాధారణ జనజీవనం స్తంభించిపోయిందని పిటిషన్లో పేర్కొన్నారు.
భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 120కి పైగా పోలీస్, పారామిలటరీ బలగాల కంపెనీలను మోహరించే అవకాశం ఉంది.
వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలలో సైనికులను మోహరించారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
అనూహ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని అదుపు చేసేందుకు వీలుగా అనేక చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
న్యూదిల్లీని 20 నిఘా జోన్లుగా విభజించారు. వీటిని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్న ప్రత్యేక పోలీసు కమిషనర్లు పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.
అక్టోబర్ 10న జరగాల్సిన నిరసన కోసం అనుమతి దరఖాస్తును అక్టోబర్ 7న అంటే నిరసనకు కేవలం మూడు రోజుల ముందు మాత్రమే సమర్పించారని అయితే నిర్ణీత విధానం ప్రకారం కనీసం 10 రోజుల ముందే నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని జాయింట్ పోలీస్ కమిషనర్ నుపుర్ ప్రసాద్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























