సీజేపీ నిరసన ప్రదర్శనల రిపోర్టింగ్‌లో జర్నలిస్టులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ ఆందోళనలు, మీడియా, రిపోర్టింగ్, బీబీసీ జర్నలిస్టులు
ఫొటో క్యాప్షన్, జర్నలిస్టులకు ఎదురవుతున్న పరిస్థితులపై జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ దిల్లీలో సీజేపీ చేపట్టిన నిరసనల్లో పలువురు జర్నలిస్టుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యవహారం తాజాగా వెలుగుచూసింది.

"భారతీయ పాత్రికేయులపై భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది" అని ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సౌరవ్ దాస్ ఆరోపించారు.

"స్వతంత్ర జర్నలిస్టులతో ఎలా వ్యవహరించారో నిన్న చూశారు. ఈ దేశంలో జర్నలిజం నేరమైపోయిందా? వారి పేరుతో ఉన్న ఐడీ కార్డులు చూపించాలని దిల్లీ పోలీసులు అడుగుతున్నారు. కానీ మీ నేమ్ ప్లేట్స్ ఏవని అదే జర్నలిస్టులు ప్రశ్నిస్తే, ఆ పోలీసులు వారితో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. స్వతంత్ర జర్నలిస్టులపై దాడి చేస్తున్నారు. నెట్టేస్తున్నారు. కొడుతున్నారు. అదుపులోకి తీసుకుంటున్నారు" అని సౌరవ్ దాస్ ఆరోపించారు.

"ఇది జర్నలిజానికి కూడా ఎమర్జెన్సీ కాక మరేంటి, జర్నలిజాన్ని అణచివేస్తున్నారు. యువత ఉద్యమాన్ని నిష్పాక్షికంగా చూపించిన స్వతంత్ర జర్నలిస్టులపై ప్రభుత్వం పోరాటం చేస్తోంది" అని విమర్శించారు.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో దిల్లీ పోలీసులు ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

శనివారం జరిగిన నిరసనల్లో ఆందోళనకారులతోపాటు, జర్నలిస్టులను, న్యాయవాదులు సహా ఇతరులను అడ్డగించారు. తోసేశారు. ఈడ్చుకెళ్లిపోయారు. వారి ఫోన్లను లాక్కున్నారు.

సెంట్రల్ దిల్లీలోని రాజీవ్ చౌక్ ఔటర్ సర్కిల్ నుంచి నిరసన ప్రదేశానికి వెళ్తుండగా తమను కూడా అడ్డుకున్నారని బీబీసీ జర్నలిస్టులు పేర్కొన్నారు.

ప్రెస్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలు చూపించినప్పటికీ వారిని ఆపారు. చాలా సేపు విజ్ఞప్తి చేసిన తర్వాత, సీనియర్ పోలీసు అధికారుల జోక్యంతోనే సమస్య పరిష్కారమైంది.

కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ ఆందోళనలు, మీడియా, రిపోర్టింగ్, బీబీసీ జర్నలిస్టులు, సోషల్ మీడియా, కంటెంట్ రైటర్లు
ఫొటో క్యాప్షన్, సీజేపీ నేతల ప్రెస్ మీట్ ముగియగానే పోలీసులు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు చేరుకున్నారు.

పోలీసుల తీరును ఖండించిన మీడియా సంస్థలు

శనివారం పలువురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న ఘటనపై నాలుగు జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఇండియన్ ఉమెన్ ప్రెస్‌ కార్ప్స్(ఐడబ్ల్యూపీసీ), దిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(డీయూజే), దిల్లీ బ్రాంచ్ ఆఫ్ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(కేయూడబ్ల్యూజే) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయని పీటీఐ వార్త సంస్థ ఒక కథనం ప్రచురించింది.

రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో జర్నలిస్టులను పోలీసులు లక్ష్యంగా చేసుకుని వ్యవహరించారని ఆ ప్రకటనలో ఆ సంస్థలు ఆరోపించాయని తెలిపింది.

ప్రెస్ ఐడీ కార్డులు ఉన్నప్పటికీ జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిలో కొందరి ఫోన్లు, రిపోర్టింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారని ఆ ప్రకటన ఆరోపించారు.

జర్నలిస్టులు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, పౌరులపై శనివారం దిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలను డిజిటల్ మీడియా సంస్థల వేదిక అయిన డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్ కూడా ఖండించింది.

"ఇది చట్టాన్ని అమలు చేయడం కాదు. భయపెట్టే, బెదిరించే ప్రయత్నం. ఇది పత్రికా స్వేచ్ఛపై, రాజ్యాంగం కల్పించిన హక్కులపై జరిగిన దాడి" అని పేర్కొంది.

శుక్రవారం ఓ మహిళా జర్నలిస్టుపై జరిగినట్టు ఆరోపణలు వచ్చిన లైంగిక వేధింపుల ఘటనపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

జర్నలిస్టుల భద్రత కోసం పోలీసులు, భద్రతా సిబ్బంది తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు పాటించేలా మార్గదర్శకాలు తీసుకురావాలని కోరింది.

అంతకుముందు 4 అక్టోబర్‌న ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. జర్నలిస్టులపై పోలీసుల చర్యలు, అలాగే జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

జర్నలిస్టులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్చగా ఘటనలను కవర్ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది.

కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ ఆందోళనలు, మీడియా, రిపోర్టింగ్, బీబీసీ జర్నలిస్టులు, సోషల్ మీడియా, కంటెంట్ రైటర్లు
ఫొటో క్యాప్షన్, ప్రెస్ ఐడీ కార్డు మెడలో కనిపిస్తున్నప్పటికీ ఓ మహిళా జర్నలిస్టును పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.

'వార్తల కవరేజ్ పరిస్థితులు కఠినంగా మారాయి'

ఆందోళన చేయడానికి వచ్చిన చాలా మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిలో జర్నలిస్టులు, కంటెంట్ క్రియేటర్లు కూడా ఉన్నారని బీబీసీ ప్రతినిధి దిల్నవాజ్ పాషా తెలిపారు.

జంతర్ మంతర్‌కు నాలుగు కిలోమీటర్ల పరిధి ఇంటర్నెట్ సేవలను శుక్రవారం రాత్రి నుంచి నిలిపేశారు.

దీంతో జర్నలిస్టులు తమ వార్తలను పంపడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం సుప్రీంకోర్టులో జరిగిన ప్రత్యేక విచారణ సందర్భంగా కూడా పలువురు పిటిషనర్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు.

"స్వతంత్ర జర్నలిస్టులకు పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయి" అని బీబీసీ ప్రతినిధి దిల్నవాజ్ పాషా అన్నారు.

శనివారం రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో, ఒక నిరసనకారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను కవర్ చేస్తుండగా బీబీసీ ప్రతినిధి దిల్నవాజ్ పాషాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఆదివారం కూడా ఒక గుంపు ఆయనను చుట్టుముట్టింది. వారు పది నిమిషాల పాటు ప్రశ్నించారు.

ఒక వ్యక్తి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా ఆ గుంపు ఆయనను కొట్టేందుకు యత్నించింది.

ఎన్డీటీవీలో పనిచేసి, ప్రస్తుతం స్వతంత్ర జర్నలిస్టులుగా పనిచేస్తున్న పలువురు సీనియర్ పాత్రికేయులను కూడా పోలీసులు అడ్డుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

ప్రముఖ జర్నలిస్టు పరంజోయ్ గుహా ఠాకుర్తాను కూడా కనాట్ ప్లేస్‌లో పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.

ఆయన ఒక డిజిటల్ మీడియా జర్నలిస్టుకు బైట్ ఇస్తున్న సమయంలోనే ఆయనను తమ వాహనంలో ఎక్కించుకొని పోలీసులు తీసుకెళ్లారు.

కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ ఆందోళనలు, మీడియా, రిపోర్టింగ్, బీబీసీ జర్నలిస్టులు, సోషల్ మీడియా, కంటెంట్ రైటర్లు
ఫొటో క్యాప్షన్, దిల్లీ నిరసనలను కవర్ చేయడం స్వతంత్ర జర్నలిస్టులకు సవాల్‌గా మారిందని బీబీసీ ప్రతినిధి దిల్నవాజ్ పాషా అన్నారు.

ఆదివారం ఏం జరిగింది?

ఆదివారం స్వతంత్ర జర్నలిస్టులు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, సీనియర్ జర్నలిస్టులు మాత్రమే కాకుండా కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు కూడా పోలీసులు చర్యలను ఎదుర్కొన్నారు.

వారిలో కొందరిని అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి.

హిందూ గ్రూప్‌కు చెందిన మహిళా జర్నలిస్టును కనాట్ ప్లేస్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే కొద్దిసేపటి తర్వాత ఆమెను విడుదల చేశారు.

"నేను అక్కడ నిలబడి నా వీడియోను నేనే రికార్డ్ చేసుకుంటున్నాను. అంతలో కొందరు పోలీసులు వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగి, వెంటనే నన్ను అదుపులోకి తీసుకున్నారు" అని ఆమె చెప్పారు.

రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో తమ జర్నలిస్టులు శాశ్వత్, సియా, విజయ్‌ను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ హిందీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆదివారం వెల్లడించింది.

తాము జర్నలిస్టులమని, వార్తల కవరేజ్ కోసం వచ్చామని చెప్పినా, వారిని బలవంతంగా బస్సులో ఎక్కించారని పేర్కొంది.

ఆదివారం మరికొందరు జర్నలిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో స్వతంత్ర జర్నలిస్టు శ్యామ్ మీనాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇంతకుముందు రెడ్ మైక్‌కు చెందిన సౌరభ్ శుక్లా తన ఓ వీడియోలో స్వతంత్ర జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

జంతర్ మంతర్‌కు వెళ్లే రహదారిపై ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల లోపలికి స్వతంత్ర జర్నలిస్టును అనుమతించడం లేదని తెలిపారు.

అలాగే చిన్న స్థాయి కంటెంట్ క్రియేటర్లను అదుపులోకి తీసుకొని బస్సుల్లో ఎక్కిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాణా ఆయుబ్ , అజిత్ అంజుమ్, శ్రీనివాసన్ జైన్ వంటి పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా తమను కవరేజ్ చేయకుండా అడ్డుకున్నారని, కొందరు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.

రాణా ఆయుబ్ ఒక వీడియోను పోస్టు చేశారు.

అందులో నిరసన ప్రదేశం సమీపంలో నిలబడి ఉండగా, కారులో ఉన్న ఓ వ్యక్తి పోలీసుల సమక్షంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించినట్టు ఆమె శనివారం ఆరోపించారు.

ఆదివారం రాణా ఆయుబ్ తన ఎక్స్‌ ఖాతాలో ఒక వీడియో పంచుకుంటూ "ఒక హిందూ కట్టర్‌వాద వ్యక్తి జర్నలిస్టు పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ దిల్లీ పోలీసులు దీనికి బాధ్యతను జర్నలిస్టులపైనే మోపుతున్నారు" అని ఆరోపించారు.

శ్రీనివాస్ జైన్ ఆదివారం ఓ జర్నలిస్టుతో మాట్లాడుతూ, తన కళ్లముందే ఒక మహిళా జర్నలిస్టును పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకెళ్లడం తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు.

ఆమె తన ప్రెస్ కార్డు చూపిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు.

"జర్నలిస్టులను, న్యాయవాడులను అదుపులోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ మహిళా జర్నలిస్టు వద్ద ప్రెస్ బ్యాడ్జ్, మైక్ కూడా ఉన్నాయి. తాను రిపోర్టర్‌నని ఆమె పదే పదే చెబుతున్నప్పటికీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న ఒక ఐపీఎస్ అధికారికి కూడా ఆమె జర్నలిస్టేనని చెప్పాం. అయినా ఎలాంటి స్పందన రాలేదు" అని ఆయన తెలిపారు.

ఆదివారం ఉదయం సౌరభ్ శుక్లా కనాట్ ప్లేస్ వైపు వెళ్తుండగా, ఆయన కారును కూడా పోలీసులు అడ్డుకున్నారు.

కంటెంట్ క్రియేటర్ రమిత్ వర్మాను కనాట్ ప్లేస్ ఇన్నర్ సర్కిల్ ప్రాంతం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.

జర్నలిస్టు స్మితా శర్మను దిల్లీ పోలీసులు అడ్డుకోగా, ఆమె వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ, "కొన్ని జాతీయవాద మీడియా సంస్థల ప్రతినిధులను మాత్రం అనుమతించి, మిగతా జర్నలిస్టులను అడ్డుకోవడం సరికాదు" అని అన్నారు.

అయితే, అక్కడ ఉన్న పోలీసు అధికారి మాత్రం తాము ఎవరినీ లోపలికి వెళ్లనివ్వడం లేదని చెప్పారు.

మీడియా ప్రతినిధులను పోలీసులు తీసుకెళ్తుండగా కారణం ఏంటని ప్రశ్నించానని, అయితే ప్రశ్నించిన తననే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జీషాన్ అనే జర్నలిస్టు తెలిపారు.

"బస్సులో వెళ్తున్నప్పుడు ఒక చోట ఖాళీ కనిపించింది. అవకాశం చూసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి నేను పరుగెత్తాను" అని ఆమె చెప్పారు.

కాక్రోచ్ జనతా పార్టీ, దిల్లీ ఆందోళనలు, మీడియా, రిపోర్టింగ్, బీబీసీ జర్నలిస్టులు, సోషల్ మీడియా, కంటెంట్ రైటర్లు
ఫొటో క్యాప్షన్, ఆదివారం ప్రదర్శనల్లో పాల్గొన్న అనేకమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

శనివారం జరిగిన నిరసనల సందర్భంగా బయటకు వచ్చిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వాటిలో కొందరు జర్నలిస్టులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.

న్యూస్ వేర్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె కనాట్ ప్లేస్‌లో కొందరు వ్యక్తులతో వాగ్వాదానికి దిగుతూ వారిముందు ఒంటరిగా నిలబడి కనిపిస్తున్నారు.

మరో వీడియోలో, 'జర్నలిస్టులపై ఎందుకు లాఠీచార్జ్ చేస్తున్నారు?' అని ప్రశ్నిస్తున్న ఓ స్వతంత్ర జర్నలిస్టును పోలీసు అధికారి తోసివేసి, అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.

అయితే, ఇలాంటి ఘటన ఏదీ జరగలేదని ఆ పోలీసు అధికారి పూర్తిగా ఖండించారు.

కానీ అదే విషయాన్ని పదేపదే అడగడంతో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఒక వీడియోలో ఓ మహిళను ముగ్గురు మహిళా పోలీసులు పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు జర్నలిస్టులు, ఆమె మెడలో ప్రెస్ కార్డు ఉందని చెబుతున్నట్లు వీడియోలో వినిపిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)