రియాద్‌లో దాడులు: హైదరాబాదీ మృతి

ఫొటో సోర్స్, UGC
సౌదీ అరేబియాలో రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ యూసుఫ్ అలీ చనిపోయారు.
ఆయన ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు.
దాడిలో భారతీయుడు చనిపోవడంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ సంతాపం ప్రకటించింది.
అలాగే యూసుఫ్ అలీ మరణంపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
ఆయన కుటుంబీకులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ తరఫున అవసరమైన సాయం అందించాలని కోరారు.


రియాద్‌లో ఐటీ ఉద్యోగం చేస్తూ..
46 ఏళ్ల యూసుఫ్ అలీ పదేళ్లుగా రియాద్‌లో ఉంటున్నారు. ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నారు.
ఆయనకు భార్య సమీర, ఇద్దరు కుమారులు అమాన్ అలీ, అబ్దుల్ వాస్సే అలీ, ఒక కుమార్తె మరియం ఉన్నారు.
యూసుఫ్ భార్య, పిల్లలు హైదరాబాద్ మెహిదీపట్నంలోని గ్రేస్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.
వారు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు బీబీసీ వెళ్లింది. వారి ఫ్లాట్‌కు తాళం వేసి కనిపించింది.
15 రోజుల కిందటే యూసుఫ్ అలీ హైదరాబాద్ వచ్చారని, అక్టోబరు 2న భార్య, పిల్లలను తీసుకుని రియాద్ తిరిగి వెళ్లారని బంధువులు, అపార్ట్‌మెంట్ వాసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
''ఉమ్రా కోసం మదీనా వెళుతుండగా..''
శనివారం (అక్టోబర్ 10) రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఎయిర్‌పోర్టుపై దాడి జరిగిందని సౌదీ అరేబియా ప్రకటించింది.
ఎయిర్‌పోర్టు టెర్మినల్ భాగంలో ప్రొజెక్టైల్ దాడి జరిగిందని సౌదీ ప్రభుత్వం నిర్ధరించింది.
అదే సమయంలో ఉమ్రా కోసం మదీనా వెళ్లేందుకు యూసుఫ్, ఆయన భార్య, పిల్లలు, అత్త అతియా సుల్తానా కలిసి రియాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు.
''దాడిలో తీవ్రంగా గాయపడిన యూసుఫ్, ఇద్దరు కుమారులను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సర్జరీ చేసి, యూసుఫ్ కాళ్లను తొలగించారు. కానీ, ఆదివారం ఉదయం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయారు'' అని యూసుఫ్ బావమరిది చెప్పారు.
దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ 'ఎక్స్'లో స్పందించారు.
''యూసుఫ్ చనిపోయారు. ఆయన కుమారుల్లో ఒకరికి మోకాలు సర్జరీ చేశారు. మరో కుమారుడికి కాలి మూడు వేళ్లు తొలగించాల్సి వచ్చింది. యూసుఫ్ భార్య, కుమార్తె, మేనత్తలకు గాయాలైనప్పటికీ, సురక్షితంగానే ఉన్నారని బంధువుల ద్వారా తెలిసింది'' అని అసదుద్దన్ ఒవైసీ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
దాడి చేసిందెవరు?
సౌదీ అరేబియాలో కొన్ని వారాలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సౌదీ అరేబియాలోని ఎయిర్‌పోర్టులు, ఆకాశ మార్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని యెమెన్‌లోని హూతీలు ప్రకటిస్తూ వస్తున్నారు.
శనివారం కింగ్ ఖాలిద్ ఎయిర్‌పోర్టుపై తామే దాడి చేశామని హూతీలు ప్రకటించారు.
ఈ దాడిలో 13 మంది చనిపోయినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. 308 మందికిపైగా గాయపడినట్లు వెల్లడించింది.
కింగ్ ఖాలిద్ ఎయిర్‌పోర్టుపై దాడి తర్వాత హూతీలు రియాద్ సమీపంలోని దమ్మామ్‌లోని మరో ఎయిర్‌పోర్టుపైనా దాడి చేసినట్లు అసోసియేట్ ప్రెస్ ప్రకటించింది.
సౌదీలో వరుస దాడుల నేపథ్యంలో భారతీయులకు అవసరమైన సాయం అందిస్తున్నట్లు సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ 'ఎక్స్'లో ప్రకటించింది.
''24 గంటల హెల్ప్ లైన్ (8002471234 సౌదీ అరేబియాలో మాత్రమే) ఏర్పాటు చేశాం. అవసరమైన సాయం కోసం +966-11-488469, +966-536216082 (వాట్సాప్ మెసేజ్ మాత్రమే) ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు'' అని ప్రకటించింది.

ఫొటో సోర్స్, Roy Rochlin/Getty Images for Newsweek
భారత విదేశీ వ్యవహారాల శాఖ ఏమంటోంది?
ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు.
రియాద్‌లో జరిగిన దాడిలో భారతీయుడు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
''మృతుడి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. ఎంబసీ తరఫున అవసరమైన సాయం అందిస్తాం'' అని ప్రకటించారు.
రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.
''అక్టోబరు 10 సహా వరుసగా జరుగుతున్న దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి చెబుతున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం'' అని తెలిపింది.
పౌరులు, పౌరులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై వరుసగా దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని, వెంటనే నిలిపివేయాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ కోరింది.
రియాద్‌లో జరిగిన దాడిపై కామారెడ్డికి చెందిన షేక్ సయ్యిద్ కూడా గాయపడ్డారని ఎంబీటీ అధినేత అమ్జాదుల్లా ఖాన్ హైదరాబాద్‌లో మీడియాతో చెప్పారు.
అయితే, ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ గానీ, సౌదీలోని భారత ఎంబసీ గానీ నిర్ధరించలేదు.
''భారత ప్రభుత్వానికి అవసరమైన వివరాలు తెలియజేశాం. గాయపడినవారికి తగిన సాయం అందించాలని కోరుతున్నాం. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























