భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?

ఫొటో సోర్స్, Chetan Singh
నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాసం పొందేందుకు వీలు కల్పించే ప్రోగ్రామ్ నుంచి కొన్ని భారతీయ ఐటీ కంపెనీలను సస్పెండ్ చేస్తున్నట్లుగా అమెరికా ప్రకటించింది.
''కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్సీఎల్, క్యాప్ జెమినీ సహా కొన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ అవుట్ సోర్సింగ్ కంపెనీలకు సంబంధించి పర్మినెంట్ లేబర్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ లైసెన్సు రద్దు చేస్తున్నాం'' అని యూఎస్ కార్మిక శాఖ మంత్రి కీథ్ సోండర్లింగ్ చెప్పారు.
పర్మినెంట్ లేబర్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను అమెరికాలో పెర్మ్ (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్)గా కూడా పిలుస్తారు.
''ఈ ఐటీ కంపెనీలు దశాబ్దాలుగా ఇదే వైఖరి అవలంబిస్తున్నాయి. కొన్ని ఫెడరల్ సంస్థల దర్యాప్తుల నివేదిక మేరకు మైక్రోసాఫ్ట్, అడోబ్ కంపెనీల పెర్మ్ కూడా రద్దు చేస్తున్నాం'' అని సోండర్లింగ్ వివరించారు.


ఫొటో సోర్స్, Sandeep
ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..
అమెరికాలో జరుగుతున్న తాజా పరిణామాలపై వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్(డబ్ల్యూటీఐటీసీ) చైర్మన్ సందీప్ కుమార్ మక్తాల బీబీసీతో మాట్లాడారు.
''అమెరికా తీసుకున్న నిర్ణయంతో పెర్మ్ కింద కంపెనీలు పెట్టిన దరఖాస్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ విధానంలో గ్రీన్ కార్డుల జారీ తీవ్ర జాప్యం అయ్యే అవకాశం ఉంది.
ఉద్యోగులేమీ మోసం చేసి వచ్చారని యూఎస్ కార్మిక శాఖ చెప్పడం లేదు. వారు ఇప్పటికే చేస్తున్న ఉద్యోగాలకు ఢోకా ఉండదు'' అని చెప్పారు.
మరోవైపు, ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది.
''హెచ్1 బీ వీసా ప్రోగ్రామ్, పెర్మ్ వేర్వేరు. పెర్మ్ దరఖాస్తుల సస్పెన్షన్ కారణంగా ఇప్పటికే ఉన్న హెచ్1 బీ వీసాలపై గానీ, అవి పొందిన వ్యక్తులు, వారిపై ఆధారపడిన వారిపై ప్రభావం ఉండదు. అయితే, శాశ్వత నివాసం(పీఆర్) లేదా గ్రీన్ కార్డు దరఖాస్తుల పరంగా ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులపై కొంత ప్రభావం ఉంటుంది'' అని ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు భారతీయ కంపెనీల 'పెర్మ్' సస్పెండ్ అయ్యింది..?
ఈ ప్రశ్నకు ముఖ్యమైన కారణంగా యూఎస్ ప్రభుత్వం చెప్పిన సమాధానాన్ని ప్రస్తావించాలి. అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నారన్న ఆరోపణలపై ఈ చర్య తీసుకుంటున్నట్లుగా అమెరికా చెబుతోంది.
ఆయా కంపెనీలు నియమించుకుంటున్న ఉద్యోగుల కారణంగా అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది.
''అమెరికన్ ఉద్యోగులు ప్రపంచంలోనే ప్రతిభావంతులైన పనివారుగా మా ప్రభుత్వానికి తెలుసు.
ఈ ఉద్యోగాలన్నీ అమెరికన్ల నుంచి దొంగిలించారు. ఇప్పుడు విదేశీయులు, విదేశాలకు చెందిన మోసగాళ్లకు కాకుండా అమెరికన్లకే మొదటగా వస్తాయి. మేం పాము తలను నరికివేస్తున్నాం'' అని సోండర్లింగ్ అన్నారు.
మరోవైపు, కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించి సెప్టెంబరులోనే గ్రీన్ కార్డు ఫైలింగ్స్‌ను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది.
ఇంతకీ అసలు 'పెర్మ్' అంటే ఏమిటి..?
ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్- పెర్మ్ అనేది అమెరికాలోని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు పర్మినెంట్ రెసిడెన్స్(పీఆర్) ఇచ్చే నియమాల్లో ఒకటి.
ఎన్నో భారతీయ ఐటీ కంపెనీలు ఇదే విధానంపై ఆధారపడి పర్మినెంట్ రెసిడెన్స్ కల్పిస్తున్నాయి.
ఈ విధానం కింద గ్రీన్ కార్డు ప్రాతిపదికన విదేశీ ఉద్యోగులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు కంపెనీలు అమెరికా కార్మిక శాఖ నుంచి 'లేబర్ సర్టిఫికేషన్' తీసుకుని స్పాన్సర్ చేస్తుంటాయి.
దీన్ని ఫైల్ చేసే ముందుగా కంపెనీలు తాము ఇచ్చే వేతనాలు, నియామక ప్రక్రియ చెప్పాల్సి ఉంటుంది.
స్థూలంగా చూస్తే, విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం వల్ల అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు, వేతనాలు, ఇతర పనిచేసే పరిస్థితులపై ఎలాంటి ప్రభావం పడదని కంపెనీలు చెప్పాల్సి ఉంటుంది.
కంపెనీలు పెట్టుకున్న దరఖాస్తును అమెరికా కార్మిక శాఖ ఆమోదం తెలిపితే, ఉద్యోగికి గ్రీన్ కార్డు ఇచ్చే తర్వాత దశకు కంపెనీలు ముందుకెళ్లే వీలుంటుంది.
అమెరికా కార్మిక శాఖ నివేదిక ప్రకారం, 2025 ఫైనాన్షియల్ ఇయర్‌లో 1,17,849 దరఖాస్తులు అందాయి. అంతకుముందు సంవత్సరాలకు సంబంధించి దరఖాస్తులతో కలుపుకొని 2025 సెప్టెంబరు 30 నాటికి 1,57,669 దరఖాస్తులు పెండింగులో ఉన్నట్లుగా అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Reuters
హెచ్1 బీ వీసాతో పోల్చితే 'పెర్మ్' తేడా ఏమిటి..?
హెచ్1 బీ వీసా అనేది టెంపరరీ, నాన్- ఇమ్మిగ్రెంట్ వర్క్ వీసా. దీని ద్వారా 'ప్రత్యేకమైన వృత్తులలో’ విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీల కోసం అమెరికా ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం.
దీని ద్వారా 70 శాతం మంది భారతీయులే లబ్ది పొందుతున్నారు.
అయితే, పెర్మ్ విధానంగా పర్మినెంట్ రెసిడెన్స్ లేదా గ్రీన్ కార్డు పొందే వీలుంటుంది.
అయితే, పెర్మ్ సస్పెన్షన్ కారణంగా ఉద్యోగులకు అప్పటికే ఉన్న హెచ్1 బీ వీసాలపై గానీ, అప్పటికే జారీ చేసిన గ్రీన్ కార్డులపై ప్రభావం ఉండదని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేస్తోంది.
''యూఎస్‌లో ప్రతి ముగ్గురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు తెలుగు వ్యక్తి లేదా తెలుగు మూలాలున్న వ్యక్తులు ఉంటారు. ఏ దేశంలోనైనా స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయి. అమెరికా తీసుకున్న నిర్ణయం కూడా అందులో భాగంగానే చూడాలి'' అని సందీప్ కుమార్ మక్తాల స్పష్టం చేశారు.
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారత్‌లో దేశీయంగా ఉద్యోగాల కల్పన వాతావరణంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోందని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Getty Images
'30 లక్షల మందికి పీఆర్ కోసం అడిగాయి'
మొత్తం 8 ప్రఖ్యాత ఐటీ కంపెనీల 'పెర్మ్' లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల చుట్టూ చర్చ జరుగుతోంది.
అమెరికా కార్మిక శాఖ చెప్పిన వివరాల ప్రకారం, 2009 నుంచి ఈ కంపెనీలు 30 లక్షల మంది విదేశీ ఉద్యోగులకు పర్మినెంట్ రెసిడెన్స్ కోసం విజ్జప్తి చేశాయని సోండర్లింగ్ చెప్పారు.
''ఈ 8 కంపెనీలు 2.30 లక్షల హెచ్1బీ వీసా అనుమతులు పొందాయి. లక్షకు పైగా పర్మినెంట్ లేబర్ సర్టిఫికెషన్స్ పొందాయి. దానివల్ల వందల మంది, వేల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు'' అని వివరించారు.
రాయిటర్స్ కథనం ప్రకారం, భారతీయ ఐటీ కంపెనీలు 2024 అక్టోబరు నుంచి 2025 సెప్టెంబరు మధ్య కాలంలో 2 శాతం కంటే తక్కువ దరఖాస్తులను 'పెర్మ్' కేటగిరీలో పెట్టుకున్నాయని ఓ బ్రోకరేజీ సంస్థ చెప్పినట్లు తెలిపింది.
మరోవైపు, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్), ఇండియా అక్టోబరు 9న ఓ ప్రకటన విడుదల చేసింది.
యూఎస్ లేబర్ డిపార్టుమెంట్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల వలసలపై ప్రభావం పడుతుందని చెప్పింది.
''గత కొన్నేళ్లుగా భారతీయ ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాలపై ఆధారపడటం గణనీయంగా తగ్గించాయి. అమెరికన్లను నియమించుకుంటూ దేశీయంగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి'' అని చెప్పింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























