లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్స్, వరుస స్కామ్‌లు- భర్త అధ్యక్ష పీఠానికే ఎసరుతెచ్చిన ఈ దక్షిణ కొరియా మాజీ ప్రథమ మహిళ ఎవరు?

కిమ్ కియోన్ హీ, దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీపై పలు కేసులు నమోదయ్యాయి.
    • రచయిత, గవిన్ బట్లర్, హ్యోజుంగ్ కిమ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య, మాజీ ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీకి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

చర్చి పాస్టర్ నుంచి లంచాలు తీసుకున్న కేసులో బుధవారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెను దోషిగా నిర్ధరించిన న్యాయస్థానం, 20 నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్యే కిమ్ కియోన్ హీ . అధికార దుర్వినియోగం కేసులో రెండు వారాల కిందటే యూన్ సుక్ యోల్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది.

లంచం, స్టాక్ మానిప్యులేషన్, రాజకీయ జోక్యం వంటి ఆరోపణలపై కిమ్ కియోన్ హీ 2025 ఆగస్టులోనే అరెస్టయ్యారు. ఈ ఆరోపణలన్నింటినీ ఆమె తిరస్కరించారు.

ఆమెపై ఉన్న మూడు కేసుల్లో, ఒకటైన చర్చి అధికారుల నుంచి లంచాలు తీసుకున్న కేసులో కోర్టు బుధవారం తీర్పు చెప్పింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2010 అక్టోబర్, 2012 డిసెంబర్ మధ్య దక్షిణ కొరియాలోని బీఎండబ్ల్యూ కార్ డీలర్ డాయిష్ మోటార్స్‌ కంపెనీ షేర్ ధరను రిగ్గింగ్ చేయడంలో కిమ్ సహాయం చేశారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీని ద్వారా ఆమె 800 మిలియన్స్ కొరియన్ వోన్ (సుమారు రూ.5 కోట్లు)కు పైగా సంపాదించారని తెలిపారు.

అయితే, ఈ కేసులో ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆధారాలు లేవంటూ కోర్టు ఈ కేసును కొట్టేసింది. ఇదిగాక ఇంకా రెండు కేసులు విచారణకు రావాల్సి ఉంది.

యూనిఫికేషన్ చర్చి నుంచి లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు, డైమండ్ నెక్లెస్‌తో సహా 80 మిలియన్ కొరియన్ వోన్ల విలువైన బహుమతులు తీసుకున్నట్లు కూడా ఆమెపై కేసులు నమోదయ్యాయి. వ్యాపార విషయాలలో సహాయం కోసం ఈ బహుమతులు లంచాలుగా పొందినట్లు ఆరోపణలు రుజువయ్యాయి.

2022 అధ్యక్ష ఎన్నికలకు ముందు, పొలిటికల్ బ్రోకర్ మ్యుంగ్ టే-క్యున్ నుంచి 270 మిలియన్ వోన్ విలువైన 58 ఉచిత 'ఒపీనియన్ పోల్స్‌'ను స్వీకరించడం వంటి ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి.

అయితే, కిమ్ కియోన్ హీ వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారేం కాదు.

యూన్ సుక్ యోల్, కిమ్ కియోన్ హీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, మాజీ ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీ ఇద్దరూ జైలుకు వెళ్లారు.

ఎవరీ కిమ్ కియోన్ హీ?

కిమ్ కియోన్ హీ (కిమ్ మైయోంగ్-సిన్) దక్షిణ కొరియా ప్రథమ మహిళ కావడానికి ముందు ఒక వ్యాపారవేత్త, కళాభిమాని.

ఆమె 1999లో సూక్‌మ్యుంగ్ మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పొందారు. అయితే, విద్యార్థిగా ఉన్న సమయంలో కాపీరైట్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఆమె ఎదుర్కొన్నారు.

ఆమె థీసిస్‌లో సమస్యలున్నాయని 2025లో ఒక ఎథిక్స్ ప్యానెల్ తేల్చడంతో కిమ్ డిగ్రీని విశ్వవిద్యాలయం రద్దు చేసింది. ఈ ఆరోపణలపై ఆమె ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు.

2009లో కోవానా కంటెంట్స్ అనే ఆర్ట్ ఎగ్జిబిషన్ కంపెనీని ప్రారంభించారు కిమ్. దానికి సీఈవో, అధ్యక్షురాలిగానూ వ్యవహరించారు. అయితే, పన్నులు చెల్లించకుండా కిమ్ తప్పించుకున్నారని, కళా ప్రదర్శనలను నిర్వహించినందుకు ముడుపులు అందుకున్నట్లు 2019లో స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, కిమ్ తన బాధ్యతల నుంచి వైదొలిగారు, 2023 లో ఆమె నిర్దోషిగా తేలారు. కానీ, ఈ కేసును ఇప్పుడు ప్రత్యేక ప్రాసిక్యూటర్ మళ్లీ సమీక్షిస్తున్నారు.

2022 అధ్యక్ష ఎన్నికలకు ముందు (తన భర్త ఎట్టకేలకు గెలిచిన అధ్యక్ష ఎన్నికలకు ముందు) కిమ్‌పై కొత్త ఆరోపణలు వచ్చాయి. విశ్వవిద్యాలయాలు, కంపెనీలకు సమర్పించిన దరఖాస్తులలో కిమ్ తప్పుడు అర్హతలు, అవార్డుల వివరాలను పొందుపర్చినట్లు ఆరోపణలొచ్చాయి.

వీటిపై యూన్ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేయడంతో, తన రెజ్యూమ్‌లోని కొన్ని భాగాలను ఎక్కువ చేసి రాసినట్లు కిమ్ అంగీకరిస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన భర్త అధ్యక్షుడైతే, ఆయన భార్యగా ఉండటంపైనే దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. అయితే, ప్రథమ మహిళగా ఆమె ప్రవర్తనే ఆ తర్వాత తీవ్ర విమర్శలకు కారణమైంది.

యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీ

ఫొటో సోర్స్, Getty Images

హ్యాండ్‌బ్యాగ్ స్కాండల్

2022 సెప్టెంబర్‌లో సియోల్‌లోని ఒక కార్యాలయంలో, ఒక వ్యక్తి నుంచి కిమ్ విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగ్‌ను అందుకున్నట్లుగా చూపిస్తున్న ఒక రహస్య వీడియో.. 2023 చివర్లో వెలుగులోకి వచ్చింది.

చోయ్ జే-యంగ్ అనే పాస్టర్ తన వాచ్‌లో సీక్రెట్ కెమెరా ద్వారా ఈ వీడియోను రహస్యంగా రికార్డ్ చేసినట్లు ప్రచారం జరిగింది. వీడియో బయటికి వచ్చినపుడు, కిమ్‌తో పాటు అధ్యక్షుడైన ఆమె భర్తపై కూడా విమర్శలు పెరిగాయి.

పాస్టర్ చోయ్ ఒక దుకాణానికి నడుచుకుంటూ వెళ్తున్నట్టు, బూడిద-నీలం రంగు లెదర్ బ్యాగ్‌ను కొనుగోలు చేసినట్టు ఆ వీడియోలో కనిపించింది. దాని ధర 3 మిలియన్ వోన్ (దాదాపు రూ. 1.75 లక్షలు ) అని రసీదు ఉంది. ఆ తర్వాత సోల్‌లోని కోవానా కంటెంట్స్ అనే కంపెనీకి వెళ్లారు చోయ్. ఆ కంపెనీ యూన్ భార్య కిమ్ కియోన్ హీకు చెందినది.

''మీరు ఈ వస్తువులను నాకోసం ఎందుకు తెస్తున్నారు?" అని పాస్టర్ చోయ్‌ను కిమ్ అడుగుతున్నట్లు కూడా ఆ వీడియోలో ఉంది.

దక్షిణ కొరియా చట్టాల ప్రకారం ప్రభుత్వ అధికారులు, వారి జీవిత భాగస్వాములు ఒకేసారి దాదాపు 1 మిలియన్ వోన్‌ల కంటే ఎక్కువ విలువైన బహుమతులు లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో 3 మిలియన్ వోన్‌లకు పైగా విలువైన బహుమతులు స్వీకరించడం చట్టవిరుద్ధం.

కిమ్ బహుమతిని స్వీకరించినట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించకపోయినా, బ్యాగ్‌ను స్వీకరించినట్టు, దానిని ప్రభుత్వ ఆస్తిగా భద్రపరిచినట్టు అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించిందని కొరియా హెరాల్డ్ తెలిపింది.

ఈ కథనంపై అధ్యక్ష కార్యాలయం వెంటనే స్పందించలేదు, దీంతో వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత, అవినీతి చట్టాల ఉల్లంఘన జరిగినట్లు పౌర సంఘాలు ఫిర్యాదులు చేశాయి. స్పెషల్ ప్రాసిక్యూటర్ సమీక్షించిన 16 ఆరోపణలలో ఈ హ్యాండ్‌బ్యాగ్ కేసు ఒకటి. వీటిలో పన్నెండు కేసులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఆమెకు 15 సంవత్సరాల జైలు శిక్ష, 2 బిలియన్ వోన్‌ల జరిమానా విధించాలని గత నెలలో ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. ఆమె చట్టానికి అతీతమన్నట్లు వ్యవహరించారని.. యూనిఫికేషన్ చర్చితో కలిసి మతం, ప్రభుత్వం మధ్యనున్న రాజ్యాంగబద్ధమైన విభజనను దెబ్బతీశారని వాదించారు.

యూన్ సుక్ యోల్, దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూన్ సుక్ యోల్ దక్షిణ కొరియాలో మార్షల్ లా ప్రకటించారు.

ఇదే మొదటిసారి..

కిమ్ కుంభకోణాలు భర్త అధ్యక్ష పీఠాన్ని కదిలించాయి. చివరికి, దక్షిణ కొరియాలో అత్యంత అవమానకరమైన మాజీ నాయకుల్లో ఒకరిగా ముద్రపడే పరిస్థితి వచ్చింది.

2024లో మార్షల్ లా ప్రకటించడానికి ప్రయత్నించి విఫలమవడంతో.. అధికార దుర్వినియోగం, డాక్యుమెంట్స్ తప్పుదారి పట్టించడం వంటి నేరాలకు సంబంధించి యూన్ 2026 జనవరి 16న దోషిగా తేలారు. ఆయనకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది. మార్షల్ లాకు సంబంధించిన నాలుగు వేర్వేరు కేసులలో వచ్చిన మొదటి తీర్పు ఇది.

మార్షల్ లా ఉత్తర్వు కొద్దికాలమే కొనసాగినప్పటికీ, అది దేశవ్యాప్తంగా గందరగోళానికి కారణమైంది. ప్రజలు రోడ్డెక్కారు. ఉత్తర్వు రద్దు చేయడానికి ఎంపీలు పార్లమెంటుకు తరలివచ్చారు.

యూన్ చర్యలు "దేశాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టాయి" అని న్యాయమూర్తి తీర్పు చెబుతూ అన్నారు. యూన్ ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తంచేయలేదనీ అన్నారు.

మార్షల్ లా కేసుపై ఏడాది పాటు దర్యాప్తు జరిగింది. ఇదే సమయంలో కిమ్‌పై వచ్చిన ఆరోపణలపై కూడా స్పెషల్ ప్రాసిక్యూటర్లు దృష్టి సారించారు. దక్షిణ కొరియాలో గతంలో మాజీ అధ్యక్షులు జైలుకు వెళ్లిన సందర్భాలున్నప్పటికీ.. మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రథమ మహిళ ఇద్దరికీ జైలు శిక్ష పడటం ఇదే మొదటిసారి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)