కరోనావైరస్ లాక్ డౌన్: దేశంలో 189 మంది వలస కార్మికుల మృతి - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించటానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్ 9 వరకు 189 మంది వలస కార్మికులు మరణించినట్లు ‘స్ట్రాండెడ్ వర్కర్స్ యాక్షన్ నెట్‌వర్క్’ చెప్తున్నట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. చనిపోయిన వారిలో సొంతూళ్లకు ప్రయాణంలో ప్రాణం విడిచిన వారు, ఆకలితో మరణించినవారు, ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు.
వలస కార్మికులను దృష్టిలో పెట్టుకోకుండా మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అని కేంద్ర ప్రభుత్వం కేవలం నాలుగు గంటల ముందు ప్రకటించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, ఇంటర్‌స్టేట్ మైగ్రంట్ వర్కర్ యాక్ట్, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్‌తో పాటు వేతనాలకు సంబంధించిన అన్ని చట్టాలు కూడా వలస కూలీలకు సకాలంలో జీతాలు చెల్లించాలని సూచిస్తున్నాయి.
లాక్‌డౌన్ సందర్భంగా మూత పడిన అనేక కంపెనీలు, దుకాణాలు కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. ఫలితంగా వలస కార్మికులు సొంతూర్లకు పయనమయ్యారు. బస్సులు, రైళ్లు లేకపోవడంతో వారు చిక్కుకు పోయారు. కొంత మంది ధైర్యం చేసి ద్విచక్ర వాహనాలపైనో, కాలినడకనో ఊర్లకు బయల్దేరిన వాళ్లను సరిహద్దుల్లో నిలిపేశారు.
దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన లక్షలాది మంది వలస కార్మికుల్లో కేవలం ఆరు లక్షల మందికి వసతి కల్పించినట్లు, దాదాపు 22 లక్షల మందికి ఆహారం అందజేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
‘స్వాన్’ నిర్వహించిన సర్వే ప్రకారం 84 శాతం వలస కార్మికులకు యాజమాన్యం వేతనాలు చెల్లించలేదు. వారిలో 98 శాతం మంది ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేదు. 70 శాతం మందికి రేషన్ అందలేదు. 50 శాతం మందికి తినడానికి తిండి, చేతిలో చిల్లి గవ్వా లేదు.
2011 సెన్సెస్ ప్రకారమే దేశవ్యాప్తంగా 5.6 కోట్ల మంది వలసకార్మికులు ఉన్నారు. వారిలో నాలుగు కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మొత్తం వలస కార్మికుల్లో 3.40 కోట్ల మంది అనియత రంగాల్లో దినసరి వేతనం మీద పని చేస్తున్న వారే. ఈ వివరాలు ప్రభుత్వం వెబ్‌సైట్లలోనే ఉన్నాయి.
లాక్‌డౌన్ ప్రకటిస్తే వలస కార్మికులు సొంతూళ్లకు వెళతారని భావించి ఉండక పోవచ్చని అనడానికి వీల్లేదు. 1994లో ప్లేగు వ్యాపించినప్పుడు 2005లో వరదలు సంభవించినప్పుడు ముంబయి నుంచి లక్షల మంది వలస కార్మికులు సొంతూళ్లకు బయల్దేరారు.

ఫొటో సోర్స్, Getty Images
పండిన పంటను అమ్ముకోవటానికి.. ధాన్యం రైతుల కష్టాలు ఎన్నో
తెలంగాణలో ‘‘ప్రతి గింజను కొంటాం’’ అన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో సంతోషపడ్డ అన్నదాతకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చుక్కలు కనబడుతున్నాయని, ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. కావల్సినన్ని తాటిపత్రులు లేవు. గోనె సంచుల కొరత వేధిస్తోంది. దీంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులు తాలు పేరుతో ధాన్యంలో తరుగు తీస్తున్నారు. తాలు తీసి అమ్ముదామంటే ప్యాడీ క్లీనర్లు అందుబాటులో లేవు.
ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం 5,503 కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతులు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతుండటంతో రోజుల తరబడి ధాన్యం కేంద్రాల్లోనే ఉంటోంది.
కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. తాటిపత్రులు లేక ధాన్యం తడిసిపోతోంది. కొన్నిచోట్ల వరద నీటిలో కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖల అంచనాల ప్రకారం ఇప్పటికిప్పుడు 1.70 లక్షల టార్పాలిన్లు అవసరం. కానీ పాతవి, కొత్తవి అన్నీ కలిపి 95 వేలు మాత్రమే ఉన్నాయి.
ఇదిలా ఉండగా తడిసిన ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో కొనుగోలు చేయడం లేదు. ఎండలో ఆరబెట్టినప్పటికీ ధాన్యం రంగు మారిందన్న సాకుతో తీసుకోవడం లేదు. కొందరు రైతులు 10 నుంచి 15 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతు వేడుకుంటున్నాడు.
ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆవేదనతో ధాన్యానికి నిప్పు పెట్టారు. ఇక ధాన్యం తేమను పరీక్షించడానికి తేమ యంత్రాలు కూడా లేవు. 15 వేల తేమ యంత్రాలు పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం 5,750 యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడానికి లారీల కొరత కూడా కారణమవుతోంది. లారీలు లేకపోవడంతో లోడింగ్ ఆలస్యం అవుతోంది. ధాన్యం కాంటా అయినప్పటికీ వాటిని లోడ్ చేసే దాకా రైతు కొనుగోలు కేంద్రాల్లోనే ఎదురుచూడాల్సి వస్తోంది.
ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం ఒక్క ప్యాడీ క్లీనరైనా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం 7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు 5,503 సెంటర్లు ప్రారంభించింది. కానీ మార్కెటింగ్ శాఖ కేవలం 1,450 ప్యాడీ క్లీనర్లు మాత్రమే సెంటర్లకు పంపించింది. ధాన్యంలో చెత్త, తాలును తొలగించాలంటే ప్యాడీ క్లీనర్ అవసరం. ఇవి లేకపోవడంతో నేరుగా కాంటా వేస్తున్నారు. తాలు పేరుతో ప్రతి బస్తాకు 2-3 కిలోలు తరుగు తీస్తున్నారు. దీంతో రైతు క్వింటాలుకు 10 కిలోల దాకా ధాన్యాన్ని నష్టపోతున్నాడు.
ఈ యాసంగిలో కోటి టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధాన్యం నింపటానికి 25 కోట్ల గోనె సంచులు అవసరం. కానీ పౌరసరఫరాల సంస్థ వద్ద కేవలం 9 కోట్ల గోనె సంచులే నిల్వ ఉన్నాయి. గోనె సంచులను పశ్చిమ బెంగాల్ (కోల్‌కతా) నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ప్రత్యేక రైలులో వీటిని తెప్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇంతవరకు రాష్ట్రానికి గోనె సంచులు రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఆంధ్రప్రదేశ్‌లో 8,314 హెక్టార్లలో పంట నష్టం’
అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 8,314 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశామని, నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు చెప్పినట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. మంత్రి సోమవారం తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలోని వేములవాడ, కరప గ్రామాల్లో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు.
రాష్ట్రంలో 7,455.33 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నదని, ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోనే 2,266 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని తెలిపారు. మొక్కజొన్న 539 హెక్టార్లు, నువ్వులు 270 హెక్టార్లలో దెబ్బతిన్నాయని వివరించారు.
నిర్ణీత ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే సదరు మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. యంత్రాలతో కోసిన పంట పొలాల్లోని ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ ధరలో కోత విధిస్తున్నారని రైతులు తమ దృష్టికి తెచ్చారని, మిల్లర్లు ఈ విషయంలో సహకరించాలని కోరారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటిసారి క్షేత్రస్థాయిలో రైతు పొలం నుంచే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించారని, ఇందులో భాగంగా గ్రామంలోని వ్యవసాయ సహాయకుడి వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత రైతుకు కూపన్ అందించి ఏ రోజున కొనుగోలు చేస్తారో ముందుగానే తెలియజేస్తామన్నారు.
సాధారణ రకమైతే ధాన్యానికి క్వింటా రూ. 1815, గ్రేడ్ ‘ఏ’కు రూ.1,835గా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు.

సైనిక వ్యయంలో టాప్-3 దేశాల్లో భారత్
ప్రపంచ దేశాల్లో అమెరికా, చైనా తర్వాత ఇండియానే అత్యధికంగా మిలిటరీపై వెచ్చిస్తోందని తాజా నివేదిక వెల్లడించినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. సైనిక వ్యయంలో భారత్, చైనా దేశాలు టాప్-3లో ఉండడం ఇదే తొలిసారి అని ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి)’ చెప్పింది.
2019 ఏడాదికిగానూ ప్రపంచ దేశాల సైనిక వ్యయాలపై సిప్రి సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. రష్యా, సౌదీ అరేబియా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచినట్లు ఆ నివేదిక చెప్తోంది.
గతేడాది భారత్ రక్షణ వ్యయం 6.8 శాతం పెరిగి 71.1 బిలియన్ డాలర్లకు (రూ. 5.42 లక్షల కోట్లు) చేరుకుందని ఆ నివేదిక వెల్లడించింది. గత మూడు దశాబ్దాల్లో (1990-2019) భారత్ రక్షణ వ్యయం 259 శాతం పెరిగింది.
మిలిటరీపై ప్రపంచ దేశాలు గతేడాది మొత్తం 1,917 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. అమెరికా ఏకంగా 732 బిలియన్ డాలర్లను (రూ.55.80 లక్షల కోట్లు) ఖర్చుచేస్తోంది. ప్రపంచ రక్షణ వ్యయంలో ఇది 38 శాతం కావడం విశేషం.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: మానవ ఉద్యోగులు, కార్మికుల స్థానంలో రోబోలు రాకను కోవిడ్-19 వేగవంతం చేస్తోందా?
- కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా.. అందుకు ఆధారాలు ఉన్నాయా
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: వైరల్ లోడ్ అంటే.. ఎక్కువ మంది వైద్య సిబ్బంది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటి
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- జూన్ అల్మీడా: మొదటి కరోనావైరస్ను కనిపెట్టిన మహిళ
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








