మరుగుదొడ్లకు వెళ్తారని మంచినీళ్లు కూడా తాగనివ్వరు... ఏపీ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో వెలుగు చూసిన లోపాలు - ప్రెస్ రివ్యూ

ఏపీ పాఠశాలలు, జూ.కాలేజీల పరిస్థితి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆంధ్ర ప్రదేశ్‌ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉందని ఎస్ఈఆర్ఎంసీ తెలిపింది

కళాశాలలు, పాఠశాలలను అపార్ట్‌మెంట్లలో నిర్వహిస్తున్నారని, సరైన సౌకర్యాలు లేవని, పిల్లలు మంచినీళ్లు తాగితే ఎక్కడ మరుగుదొడ్లకు వెళ్తారోననే నెపంతో కనీసం నీళ్లు కూడా తాగనివ్వడం లేదని పాఠశాల విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ వెల్లడించినట్టు ఈనాడు ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 260 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జరిపిన తనిఖీల్లో అనేక లోపాలు వెలుగు చూసినట్టు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కాంతారావు మీడియా సమావేశంలో వెల్లడించారని తెలిపింది. ముఖ్యంగా జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయని కమిషన్ సభ్యులు చెప్పినట్లు పేర్కొంది.

అడ్డగీత
News image
అడ్డగీత

సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో ఉదయం 8 గంటలకు తరగతులకు వెళ్లాల్సిన విద్యార్థులు 4 గంటలకే లేవాల్సి వస్తోందని కూడా వారు తెలిపినట్టు చెప్పింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల్లో ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నట్టు కూడా కమిటీ సభ్యులు చెప్పారని ఈనాడు ఈ కథనంలో ప్రస్తావించింది.

తెలంగాణ

ఫొటో సోర్స్, THE HIGHCOURT

ఫొటో క్యాప్షన్, ఆ జీవోలను ఎందుకు దాస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఆ జీవోల విషయంలో ఎందుకంత రహస్యం?

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్‌సైట్లో పెట్టకుండా రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారంటూ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గత ఏడాది సెప్టెంబర్లోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని కూడా కోర్టు ప్రశ్నించినట్టు తెలిపింది.

ప్రభుత్వ జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2019 ఆగస్టు 15 వరకు 1,04,171 జీవోలను జారీ చేయగా 42,462 జీవోలను రహస్యంగా ఉంచారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించినట్టు ఈ కథనంలో చెప్పుకొచ్చింది.

తెలంగాణ

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, రాజ్యసభకు కేకే స్థానంలో కవిత?

టీఆర్‌ఎస్‌లో రాజ్యసభ స్థానాల కోసం పోటా పోటీ

తెలంగాణ నుంచి గతంలో లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలైన కేసీఆర్ కుమార్తె రాజ్యసభకు వెళ్లబోతున్నారా? వెళ్లడం దాదాపు ఖాయమంటూ నవతెలంగాణ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో ఖాళీ కాబోతున్న 2 స్థానాలకు గానూ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొందని తెలిపింది.

"అయితే ఈసారి ఏపీ కోటాలో రిటైర్ కాబోతున్న పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే కవిత రూపంలో కేకేకు గట్టిపోటీ ఎదురవుతోంది.

అంతేకాదు, దాదాపు కవిత పేరు ఖరారైనట్టేనని కూడా పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇక రెండో స్థానంపై చాలా మంది ఆశలు పెట్టుకున్నప్పటికీ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందన్న చర్చ కూడా టీఆర్ఎస్‌లో కొనసాగుతోంది" అని ఈ వార్తలో తెలిపింది.

తిరుమల

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, తిరుమలలో బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా గాజు సీసాల్లో తాగు నీటి అమ్మకం

తిరుమలలో ఇక గాజు సీసాల్లోనే తాగునీటి అమ్మకం

తిరుమలలో ప్లాస్టిక్ నీళ్ల సీసాల స్థానంలో బుధవారం నుంచి గాజు సీసాలు ప్రయోగాత్మకంగా అన్ని దుకాణాల్లో అందుబాటులో ఉంటాయంటూ సాక్షి ఓ వార్తను ప్రచురించింది. ఇప్పటికే అధికారులు బాటిళ్ల శాంపిల్స్‌ను పరీక్షించారని తెలిపింది.

750 మిల్లీలీటర్ల గాజు నీళ్ల సీసా ధర రూ. 20 ఉంటుందని, తాగు నీటిని వినియోగించిన తర్వాత సీసాను దుకాణదారునికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఒక వేళ సీసా కూడా కావాలనుకుంటే అదనంగా మరో 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని సాక్షి పత్రిక ఈ వార్తలో స్పష్టం చేసింది.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)