You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హత్యను దాచిపెట్టేందుకు ఎందుకు యత్నించారో జగన్ చెప్పాలి: సీఎం చంద్రబాబు - ప్రెస్ రివ్యూ
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని, రాజకీయ ముసుగులో దారుణంగా ప్రవర్తిస్తూ తప్పు మీద తప్పు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారని ఈనాడు తెలిపింది.
ఈ అంశంపై శుక్రవారం రాత్రి రాజధాని అమరావతిలోని ఉండవల్లి ప్రజావేదికలో విలేఖరుల సమావేశంలో సీఎం మాట్లాడారు.
''వివేకానందరెడ్డి మరణ వార్త విన్నప్పుడు బాధ కలిగింది. గుండెపోటుతో చనిపోయారని మొదట్లో అన్ని ఛానల్స్‌లో వచ్చింది. దానిపై సంతాపం వెలిబుచ్చాను. అక్కడ నుంచి కొంత సమయం తర్వాత అసలు విషయం బయటకొచ్చింది. సాయంత్రానికి ఎన్ని విధాల రాజకీయం చేశారో మీరు చూస్తున్నారు. ఒక హత్య జరిగాక పంచనామా చేయకుండా మృతదేహం కదల్చకూడదనే విషయం వారికి తెలియదా? రక్తపు మరకలు ఎందుకు తుడిచేయాల్సి వచ్చింది? చేసిందంతా చేసి కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉంది కదా అని సీబీఐ విచారణ కోరుతున్నారు'' అని చంద్రబాబు విమర్శించారు.
''వివేకానందరెడ్డి శరీరంపై బలమైన గాయాలున్నాయి. సాధారణ వ్యక్తులకూ ఇది హత్య అని అర్థమవుతుంది. అయినా మృతదేహాన్ని స్నానాల గది నుంచి పడకగదికి ఎందుకు తెచ్చారు? ఉదయం లేని లేఖ సాయంత్రానికి ఎలా వచ్చింది? ఎవరు రాశారు? హత్య అని తెలిసినా దాచిపెట్టాలని ఎందుకు ప్రయత్నించారు? ఇవన్నీ అనుమానాలకు తావిచ్చే అంశాలు. వీటన్నిటికి జగన్ సమాధానం చెప్పాలి. సాక్ష్యాధారాలను ఎందుకు తుడిచివేశారని గవర్నర్ కూడా వారిని ప్రశ్నించవలసి ఉంది. హత్య అని తెలిసినా గుండెపోటుగా సృష్టించాలని చూశారు. కుటుంబసభ్యులు పోస్టుమార్టం చేయాలని చెప్పాక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం జరిగే సమయంలోనే సీన్ మారిపోయింది. రకరకాలుగా మాట్లాడటం ప్రారంభించారు. ఉదయమే బయట ప్రపంచానికి తెలియకపోతే ఇల్లంతా కడిగి అంత్యక్రియలు కూడా చేసేవాళ్లు.. అనివార్య కారణాల వల్ల ఆసుపత్రికి తీసుకెళ్లడంతోనే హత్య అనే విషయం బయటకొచ్చింది'' అని ముఖ్యమంత్రి చెప్పారు. కుటుంబసభ్యుడి హత్యకు కూడా సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనుకోవడం కరడుగట్టిన నేరమన్నారు.
త్వరలో అందుబాటులోకి అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రోమార్గం
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రోమార్గం త్వరలో అందుబాటులోకి రానుందని నమస్తే తెలంగాణ తెలిపింది.
అమీర్‌పేట-హైటెక్‌సిటీ మార్గంలో రైళ్లు నడుపడానికి కమిషనర్ ఆఫ్ మెట్రోరైల్ సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్)అనుమతిచ్చింది. శుక్రవారం మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు గల పది కిలోమీటర్ల మార్గాన్ని గత ఏడాది నవంబర్‌లోనే సిద్ధంచేశారు. నవంబర్ 27న ట్రయల్ ప్రారంభించారు. సుమారు నాలుగు నెలలుగా ట్రయల్కొనసాగుతున్నది. సీఎంఆర్‌ఎస్ బృందం ఫిబ్రవరిలో తనిఖీలు చేపట్టింది. తాజాగా అనుమతులు ఇచ్చింది.
మాదాపూర్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఇతర సంస్థల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వీరు రోజూ తమ కార్యాలయాలకు వచ్చివెళ్లేందుకు ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మార్గం లో రైళ్లు ప్రారంభమైతే ప్రజలకు వేగమైన, సౌకర్యవంతమైన ప్రయా ణం అందుబాటులోకి వస్తుంది.
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో ఇప్పటికే మియాపూర్ -ఎల్బీనగర్ (29 కి.మీ) మార్గం, నాగోల్-అమీర్‌పేట (17కి.మీ.) మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. రోజూవేలమంది రాకపోకలు సాగిస్తున్నారు.
శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేతకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ గత కొన్నేళ్లుగా పోరాడుతున్న క్రికెటర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించిందని, శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని సాక్షి తెలిపింది.
నిషేధాన్ని ఎత్తివేయాలంటూ శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఆశోక భూషణ్-జస్టిస్ కేఎమ్ జోసెఫ్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా బీసీసీఐ క్రమశిక్షణా కమిటీ విధానాన్ని సుప్రీం తప్పుబట్టింది. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం నిర్ణయాన్ని మూడు నెలల్లో పునః సమీక్షించుకోవాలని పేర్కొంది.
ఈ రోజు విచారణ సందర్భంగా శ్రీశాంత్‌పై నిషేధం అనేది చట్ట పరంగానే జరిగిందంటూ బీసీసీఐ వాదించింది. అయితే శ్రీశాంత్ తరఫు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ మాత‍్రం తన వాదనను బలంగా వినిపించారు. కేవలం మ్యాచ్ ఫిక్సర్లు శ్రీశాంత్‌ను కలిసిన విషయాన్ని బోర్డుకు చెప్పని కారణంగా అతనిపై జీవిత కాల నిషేధం విధించడం తగదంటూ వాదించారు.ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం సరైనది కాదని, దాన్ని పునరాలోచించుకోవాలంటూ బీసీసీఐకి స్పష్టం చేసింది.
2013లో జరిగిన ఐపీఎల్-6 సీజన్‌లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది.
ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2017 ఆగస్టులో శ్రీశాంత్‌పై నిషేధాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ ఎత్తివేయగా, ఆపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై 2017 అక్టోబర్‌లో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కొనసాగించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ‍్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
పొత్తుపై జనసేన, బీఎస్‌పీ స్పష్టత ఇవ్వాలి: కవిత
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీఎస్‌పీ పొత్తుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కవిత డిమాండ్ చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్‌పీ, జనసేన పొత్తు రాజకీయ గిమ్మిక్కేనని ఆమె శుక్రవారం నిజామాబాద్‌లో విమర్శించారు. ఈ రెండు పార్టీలూ ఏపీలో స్వతంత్రంగా పోటీ చేస్తాయా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో కలిసి వెళతాయా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దళితుల సమస్యలపై ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదని కవిత అన్నారు. ఏపీ ప్రజల సమస్యలు పరిష్కరించే పార్టీ అధికారంలోకి రావడానికి తాము తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. దేశ ప్రజలు జాతీయ పార్టీల కన్నా స్థానిక పార్టీల వైపే మొగ్గు చూపుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- 'ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశం మంచిదే... కానీ, మోదీ ఎలా ఉన్నారంటే...' - పర్వేజ్ ముషారఫ్‌తో బీబీసీ ఇంటర్వ్యూ
- న్యూజీలాండ్‌లో మసీదులపై 'ఉగ్రవాద దాడి', 49 మంది మృతి, వీరిలో ఒకరు హైదరాబాదీ
- 'విద్యుదీకరణతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం' అన్న మోదీ మాటల్లో నిజమెంత?
- మసూద్ అజర్‌ను జమ్మూ జైలు నుంచి కాందహార్‌కు ఎలా తీసుకువచ్చారు...
- ఇడుపులపాయ: గసగసాలు సాగు చేశారు.. పోలీసులు జైల్లో పెట్టారు
- అవినీతిలేని స్వచ్ఛమైన పాలన అందిస్తా: 'సమర శంఖారావం'లో జగన్
- భారీ స్థాయిలో ఈవీఎంల హ్యాకింగ్ భయాలు నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)