You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రఘురాం రాజన్: ‘‘పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల సాధారణ ప్రజలకు మేలు జరగట్లేదు... మెజారిటీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు’’
పెట్టుబడిదారీ వ్యవస్థ (క్యాపిటలిజం) వల్ల సామాన్య ప్రజలకు మేలు జరగటం ఆగిపోయిందని.. ఫలితంగా మెజారిటీ జనం తిరుగుబాటు చేస్తారని భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరించారు.
ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ 'తీవ్ర ప్రమాదంలో పడింది' అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను పరిగణనలోకి తీసుకునేటపుడు సామాజిక అసమానతలను విస్మరించజాలవని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ - ఐఎంఎఫ్) సంస్థలో ముఖ్య ఆర్థికవేత్తగా కూడా రఘురాం పనిచేశారు. ఆయన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముందని కొందరు చెప్తున్నారు.
తాజాగా బీబీసీ రేడియో 4 టుడే ప్రోగ్రామ్‌తో రాజన్ మాట్లాడారు.
''క్యాపిటలిజం తీవ్ర ప్రమాదంలో ఉందని నేననుకుంటున్నాను. ఎందుకంటే అది అత్యధిక జనాభాకు మేలు చేయటం ఆగిపోయింది. అలా జరిగినపుడు ఆ జనాభా క్యాపిటలిజానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు'' అని పేర్కొన్నారు.
గతంలో 'సాధారణ చదువు'తో మధ్యతరగతి ఉద్యోగం పొందటం సాధ్యమయ్యేదని రాజన్ చెప్పారు.
కానీ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పరిస్థితి మారిపోయిందని.. పొదుపు పాటించటం పెరిగిందని వివరించారు.
''ఇప్పుడు ఎవరైనా నిజంగా (ఉద్యోగాన్వేషణలో) సఫలం కావాలంటే.. చదువులో చాలా బాగా రాణించాల్సి ఉంటుంది'' అని పేర్కొన్నారు.
దురదృష్టవశాత్తూ.. అంతర్జాతీయ వాణిజ్యం, అంతర్జాతీయ సమాచారం వల్ల దెబ్బతిన్న సమాజాల్లోనే.. క్షీణిస్తున్న పాఠశాలలు, పెరుగుతున్న నేరాలు, పెరుగుతున్న సామాజిక రుగ్మతలు అధికంగా ఉన్నాయి. అందువల్ల ఆ సమాజాలు తమ ప్రజలను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంసిద్ధం చేయలేకపోతున్నాయి'' అని ఆయన విశ్లేషించారు.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అప్పులు 50 శాతం పెరిగాయని.. ప్రపంచ స్థాయిలో రుణ పతనం మరోసారి మొదలయ్యే అవకాశం ఉందని ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ నివేదిక ఒకటి సూచిస్తోంది.
2008 తర్వాత నుంచి ప్రభుత్వ అప్పులు 77 శాతం పెరిగాయని, కార్పొరేట్ రుణాలు 51 శాతం పెరిగాయని ఆ నివేదిక వెల్లడించింది. అయితే.. ఈసారి రాబోయే తిరోగమనం 2008 ఆర్థిక సంక్షోభం అంతటి తీవ్రంగా ఉండే అవకాశం లేదని ఆ విశ్లేషకులు పేర్కొన్నారు.
సమతుల్యతను పునరుద్ధరించాలి
సమాన అవకాశాలు కల్పించకపోవటం వల్ల పెట్టుబడిదారీ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోందని రఘురామ్ భావిస్తున్నారు.
''అది సమాన అవకాశాలు కల్పించటం లేదు. పైగా వెనుకబడుతున్న జనం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది'' అని ఆయన చెప్పారు.
అయితే.. ''ఉత్పత్తి సాధనాలన్నిటినీ సమాజపరం చేసినపుడు'' నిరంకుశ పాలనలు తలెత్తుతాయని రాజన్ వ్యాఖ్యానించారు. ''ఒక సంతులనం అవసరం. దేనినో ఒక దానిని ఎంచుకోలేం. మనం చేయాల్సింది అవకాశాలను మెరుగుపరచటం'' అని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రఘురాం రాజన్ ప్రపంచ ఆర్థిక పరిస్థితి గురించి చర్చిస్తూ.. వస్తువుల వాణిజ్యం మీద పరిమితులు విధించటమనే సవాళ్లను ప్రస్తావించారు.
''మనం అటువంటి పరిమితులు విధిస్తే.. ముందుకు వెళ్లేకొద్దీ మన సరకులకు కూడా వాళ్లు ఆంక్షలు పెడతారు. అటువంటప్పుడు.. మనం ఆ సరకులను ఇతర దేశాలకు పంపించాల్సిన అవసరమున్నపుడు.. ఆ సరఫరాను ఎలా కొనసాగించగలం?'' అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి.
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
- కొలువుల కోసం ‘కొట్లాట’ : ఉద్యోగం వస్తదా? రాదా?
- ప్రభుత్వ ఉద్యోగాలు: పోస్టులు వందల్లో.. దరఖాస్తులు లక్షల్లో
- రైల్వే ఉద్యోగాలు: లక్ష పోస్టులకు రెండు కోట్ల దరఖాస్తులు
- జనరల్ కేటగిరీ పేదలకు రిజర్వేషన్లు: దేశంలో 91 శాతం మంది పేదలేనా?
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
- జోసెఫ్ స్టాలిన్: హిట్లర్నే భయపెట్టిన ఈయన హీరో మాత్రమే కాదు, నియంత కూడా
- విరాట్ కోహ్లీకి ధోనీ ఎంత అవసరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)