You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రైల్వే ఉద్యోగాలు: లక్ష పోస్టులకు రెండు కోట్ల దరఖాస్తులు
భారతీయ రైల్వే ఇటీవల ప్రకటించిన సుమారు 1,00,000 ఉద్యోగాల కోసం రెండు కోట్లకు పైగా దరఖాస్తులు అందాయని రైల్వే మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.
దరఖాస్తు చేయటానికి గడువు శనివారంతో ముగియనుంది. అప్పటికి దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరుగుతుందని సదరు అధికారి పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు.
రైల్వే పోలీస్, లోకోమోటివ్ డ్రైవర్లు, టెక్నీషియన్ల ఉద్యోగాలకు 15 భాషల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతాయి.
భారతదేశంలో కోట్లాది మందికి ఉపాధి, ఉద్యోగాలు లేకపోవటంతో నిరుద్యోగం పెద్ద సవాలుగా ఉంది.
రైల్వేలో దిగువ, మధ్య శ్రేణి ఉద్యోగాల కోసమే ఈ స్థాయిలో దరఖాస్తులు రావటం నిరుద్యోగిత తీవ్రతకు అద్దం పడుతోంది.
‘‘చాలా మంది దరఖాస్తు చేసిన ఉద్యోగానికి అవసరమైన దానికన్నా ఉన్నత చదువులు చదువుకున్నారు. పీహెచ్‌డీ చేసిన వారు కూడా టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు’’ అని రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నట్లు ఎకనమిక్ టైమ్స్ వార్తా పత్రిక ఉటంకించింది.
టెక్నీషియన్, లోకోమోటివ్ డ్రైవర్ల పోస్టులకే 50 లక్షల మందికి పైగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే నెట్‌వర్కుల్లో భారతీయ రైల్వే ఒకటి. ప్రజా రవాణాకు వెన్నెముక అయిన రైల్వేలో ప్రతి రోజూ 2.30 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు.
ప్రస్తుతం 10 లక్షల మందికి పైగా కార్మికులున్న ఇండియన్ రైల్వే.. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థల్లో కూడా ఒకటి.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీ స్పందన లభిస్తోంది.
2015లో దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో.. కేవలం 368 కింది స్థాయి ఉద్యోగాలకు 23 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
అదే ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వేలాది మంది రావటంతో జరిగిన తొక్కిసలాటలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు.
మహారాష్ట్రలోని ముంబైలో 2010లో పోలీస్ ఉద్యోగాల కోసం 10,000 మంది అభ్యర్థులు రాగా తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోగా 11 మంది గాయపడ్డారు.
1999లో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం 281 పోస్టుల భర్తీ కోసం ప్రకటన ఇవ్వగా.. దాదాపు 10 లక్షల దరఖాస్తులు ముంచెత్తాయి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)