You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మోదీ కోటి ఉద్యోగాల హామీ నిజమా? అబద్ధమా? BBC REALITYCHECK
అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ హామీ ఇచ్చినట్లు అనేక వార్తలు వచ్చాయి. భారత్‌లోనే కాదు, అంతర్జాతీయ మాధ్యమాల్లోనూ ఆ వార్త చక్కర్లు కొట్టింది.
ఆ వార్తల్లో నిజమెంతో తెలుసుకునేందుకు మేం ప్రయత్నించాం.
అసలు సంగతి ఏంటంటే... కోటి ఉద్యోగాలు ఇస్తామని మోదీ ఎన్నడూ అనలేదు. నిజానికి వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో ఉపాధి కల్పన అనేది పెద్ద విషయమే.
ఏటా అరవై లక్షల నుంచి ఎనభై లక్షల మంది ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఉపాధి వేటలో పడతున్నారు. అయితే వీరికుండే ఉద్యోగావకాశాలు కొద్ది లక్షలు మాత్రమే.
యువత సంఖ్య వేగంగా పెరుగుతున్న భారత్‌లో ఉద్యోగ కల్పన భారీ స్థాయిలో జరగాల్సి ఉందని గతంలో మోదీ అన్నారు. కానీ, కోటి ఉద్యోగాల ప్రస్తావన ఆయన చేయలేదు. మోదీ మాటలను మొదట ఒక వార్తా సంస్థ తప్పుగా రాసింది. మిగతా మీడియా సంస్థలన్నీ దాన్నే అనుసరించాయి.
2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగాలనూ, ఉపాధి కల్పనను ఎలా కొలవాలన్నది పెద్ద సమస్యగా మారుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఈ విషయంపై ఇటీవల కొన్ని విమర్శలు చేశారు.
‘నేనొక సవాల్ విసురుతున్నా. ఆధారాలు కూడా ఇస్తా. ప్రతి రోజూ ముప్పై వేల మంది ఉద్యోగ విపణిలోకి వస్తారు. అయితే కేవలం 450 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి..’ అని ఆయన అన్నారు.
ఈ విమర్శలపై మోదీ స్పందిస్తూ... ప్రస్తుత కొలమానాలు వాస్తవ ఉద్యోగ కల్పనను ప్రతిబింబించడం లేదని అన్నారు.
ఉపాధి కల్పనను లెక్కించేందుకు కొత్త పద్ధతిని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏం జరుగుతోంది?
భారతదేశంలో ఉద్యోగార్థుల సంఖ్య ప్రతి ఏడాదీ పెరిగిపోతోంది.
మోదీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మొత్తంగా ఎన్ని ఉద్యోగాల సృష్టి జరిగిందో తెలుసుకునేందుకు విశ్వసనీయమైన గణాంకాలేవీ అందుబాటులో లేవు.
అసలు సమస్య గణాంకాలు లేకపోడం కాదు, ప్రభుత్వం వాటిని సేకరించకపోడం. 2011-12 నుంచి ఉపాధి కల్పన, నిరుద్యోగం వంటి వాటిపై ప్రభుత్వం ఎటువంటి సర్వేలూ చేపట్టలేదు. నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం వారు ఈ పని చేయాలి.
భారత ఆర్థిక వ్యవస్థ సంఘటిత, అసంఘటిత రంగాలుగా విడిపోయి ఉంది.
అసంఘటిత రంగంలో ఉపాధి కల్పన సమాచారాన్ని అధికారికంగా నమోదు చేయడం చాలా కష్టం.
సంఘటిత రంగం కంటే చాలా పెద్దదైన అసంఘటిత రంగంలో ఎంత మంది పని చేస్తున్నారో కచ్చితంగా తెలియదు.
ఎనభై శాతం ఆర్థిక వ్యవస్థ అసంఘటితమేనన్నది ఒక అంచనా. అందువల్ల మోదీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో కచ్చితంగా చెప్పడం చాలా కష్టమైన విషయం.
ఏది ఏమైనా ఒకటైతే స్పష్టం... గత ప్రభుత్వం కంటే మోదీ ప్రభుత్వం ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వలేదని కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అట్లాగే తాను ఎక్కువ మందికి ఉద్యోగాలిచ్చానని మోదీ కూడా చెప్పలేరు.
మోదీ ఉద్యోగాలు ఇచ్చారని దేశ ప్రజలు భావించడం, లేదా భావించకపోవడంతో సంబంధం లేకుండానే సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల్లోనే తెరలేవనుంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)