You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఫేక్‌న్యూస్ మూలాలు మహాభారతంలోనూ ఉన్నాయి’ - కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు - BeyondFakeNews
సోషల్ మీడియా రాకతో అబద్ధాలు అతివేగంగా ప్రపంచవ్యాప్తం అవుతున్నాయని, ఫేక్‌న్యూస్ పర్యవసానాలు తీవ్రంగా ఉంటున్నాయని కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు అన్నారు.
Beyond The FakeNews ప్రాజెక్టులో భాగంగా బీబీసీ వార్తా సంస్థ ఐఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో మాడభూషి శ్రీధరాచార్యులు ప్రసంగించారు. పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే...
''అవాస్తవ వార్తలపై బీబీసీ యుద్ధం ప్రకటించింనందుకు వారికి అభినందనలు. అబద్ధాలు చెప్పడం స్వేచ్ఛలో భాగమని భావించే సంస్కృతి మనది. సోషల్ మీడియా వచ్చాక అబద్ధాలు వేగంగా వ్యాప్తి చేసే పరిస్థితి వచ్చింది. వీటి పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉంటున్నాయి.
ఫేక్ న్యూస్ అని తెలియకముందే అది ప్రజల్లోకి చాలా వేగంగా వెళుతోంది. ఆ వార్త నిజమని ప్రజలు నమ్ముతారు కాబట్టే దాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేస్తారు.
ఫేక్ న్యూస్‌ను మొదట సృష్టించేవారికి మాత్రమే అది అబద్ధపు వార్త అని తెలుసు. ఎటొచ్చి దాన్ని షేర్ చేసేవాళ్లకే ఆ విషయం తెలియడం లేదు.
సాంకేతికత పెరిగిన కొద్ది ఫేక్‌న్యూస్ వాప్తి మరింత వేగమవుతూ అబద్ధాలంటే భయపడే పరిస్థితి వచ్చింది.
'మహాభారతంలోనూ ఫేక్‌న్యూస్'
ఈ ఫేక్‌న్యూస్ మూలాలు మహాభారతంలోనూ ఉన్నాయి. కౌరవుల పక్షాన ఉన్న ద్రోణాచార్యుడిని ఓడించడం సాధ్యం కాదనే విషయం తెలుసుకొని కృష్ణుడు ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తాడు. 'అశ్వద్ధామ హతః' అని బిగ్గరగా చెప్పి ఆ వెంటనే 'కుంజరః' అని తక్కువ స్వరంతో ధర్మరాజు చెప్పడంతో ద్రోణుడు యుద్ధ భూమిలోనే అస్త్రసన్యాసం చేస్తాడు. అప్పుడు పాండవులు ఆయనను హతమారుస్తారు. యుద్ధంలో శత్రువులను ఓడించేందుకు సత్యవంతుడనే పేరున్న ధర్మరాజు చెప్పిన ఫేక్‌న్యూస్ అది. ఎదుటి పక్షంలోని ప్రతీ బలహీనతను వాడుకోవడం కూడా యుద్ధంలో భాగమే అని కూడా మహాభారతం చెబుతోంది.
'ఫేక్‌న్యూస్ సృష్టికర్తలకు పర్యవసానాలు తెలియకపోవచ్చు'
ఫేక్‌న్యూస్ సృష్టించేవారికి కూడా దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియకపోవచ్చు. అసోం ఫేక్ న్యూస్ ఘటననే తీసుకుంటే దాన్ని సృష్టించినవారికి కూడా ఆ వార్త వల్ల 31 మంది చనిపోతారని తెలియకపోవచ్చు. ఆ ఫేక్‌న్యూస్ నిజమని నమ్మి స్థానికులు మూకదాడికి పాల్పడ్డారు. వారి మీద కేసు పెట్టినా శిక్ష పడే అవకాశం తక్కువ. ఎందుకంటే తనకు వచ్చిన వార్త నిజమని భావించే దాడి చేసినట్లు చెబుతారు.
కాబట్టి, చాలా మంది తమకు వచ్చిన వార్త నిజమా, కాదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యావంతులుగా అది మన బాధ్యత.
'రాజకీయ పార్టీలదీ అదే ధోరణి'
భారత్‌లో 2014 ఎన్నికల్లో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వార్ మొదలైంది. వివిధ పార్టీలు వేలకొద్ది సోషల్ మీడియా గ్రూప్‌లు ఏర్పాటు చేసి తమ పార్టీ అనుకూల వార్తలు, ఇతర పార్టీలపై బూటకపు వార్తలు వ్యాప్తి చేశాయి. పుకార్లు పుట్టించి ఓటర్ల మెదళ్లలో యుద్ధాన్ని సృష్టించాయి. కులం, మతం, రంగు, ప్రాంతం పేరుతో విభజన రేఖలు సృష్టించాయి. ఇప్పుడు ప్రతీపార్టీ తమకంటూ సొంతంగా సోషల్ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.
'వాట్సాప్ మరింత ప్రమాదకరం'
ఫేక్‌న్యూస్‌ను వ్యాప్తి చేయడంలో ఫేస్‌బుక్, ట్విటర్ కంటే వాట్సాప్‌దే కీలక పాత్రగా ఉంటోంది. ఫేక్ న్యూస్‌కు వాట్సాప్ మూల వనరుగా మారుతోంది. ఫ్రాన్స్‌లో వాట్సాప్ వదంతుల కారణంగా చాలా మంది ఓటర్లు ప్రభావితమయ్యారు. అమెరికా ఎన్నికల్లో ట్విటర్ కీలకపాత్ర వహించింది. ఏ అసత్య వార్త వల్ల ఎవరు ప్రభావితమై ఎవరికి ఓటు వేశారనేది సాంకేతికంగా కనిపెట్టలేం. అంటే, ఫేక్‌న్యూస్ ప్రభావం దాని పర్యవసానాలను అంచనా వేయడం అసాధ్యంగా చెప్పొచ్చు.
'ఫేక్‌న్యూస్ నిరోధానికి చట్టాలు'
ఫేక్‌న్యూస్‌ను నిరోధించేందుకు చట్టాలను తీసుకొస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. జర్మనీ చట్టాల ప్రకారం సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తారు.
ఇలాంటి చట్టాలు భారత్‌లో తీసుకొస్తే దాన్ని భావప్రకటన స్వేచ్ఛకు భంగంగా పరిగణించే అవకాశం ఉంటుంది.
'నిజం కానిదంతా అబద్ధం కాదు'
ఇంతకీ ఏది నిజం.. మనకు తెలిసిన వాళ్లు చెప్పేదే నిజం అవుతుందా? కోర్టు చెప్పేదే నిజం అవుతుందా? నిజం కానిది ప్రతిదీ అబద్ధం కాదు. కాల్పనిక సాహిత్యం నిజం కాదు. వ్యంగం నిజం కాదు. కానీ, ఇవన్నీ ఉండాల్సిందే.
మనకు అబద్ధం చెప్పే స్వేచ్ఛ ఉంది. కానీ, నిజం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మన అబద్ధం వల్ల ఎలాంటి పర్యవసానాలు లేకపోతే పర్లేదు. కానీ, దానికి పర్యవసానాలు ఉంటే కచ్చితంగా శిక్ష ఎదుర్కోవాల్సిందే.
ఫేక్‌న్యూస్ గుర్తించడం మన బాధ్యత
ఎవరో చెప్పింది నిజం అని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. నిజం ఏంటో మనం గుర్తంచాలి. విద్యావంతుడిగా మనకు ఆ జ్ఞానం ఉండాలి. స్కూల్ సిలబస్‌లో ఫేక్‌న్యూస్ పై అవగాహన కల్పించే పాఠ్యాంశాలుండాలి.
చట్టం కల్పించిన మార్గాల ద్వారా ఏది నిజమైన వార్తో తెలుసుకోవాలి. సొంతంగా ఆలోచించి ఒక వార్త నిజమా కాదా తెలుసుకునే విచక్షణ మనకుండాలి. ఫేక్ న్యూస్ గురించి తెలుసుకోవడం ప్రతీ పౌరుడు తన బాధ్యతగా భావించాలి.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)