నారా చంద్రబాబునాయుడు: ప్రజలే భాజపా తలుపులు మూస్తారు - ప్రెస్ రివ్యూ

భాజపాకు ప్రజలు తలుపులు మూసేయడానికి ఇక నెలరోజులే సమయం మిగిలిందని.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారని 'ఈనాడు' కథనంలో రాసింది.

''అమిత్‌షా తనపై చేసిన విమర్శల నేపథ్యంలో సోమవారం దిల్లీలో విలేకరుల సమావేశంలో, అమరావతిలో పార్టీ నేతలతో జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మండిపడ్డారు.

తలుపులు తెరవమని ఆయన్ని అడుక్కొనేవాళ్లు ఎవ్వరూ ఇక్కడ లేరు. 2014లో ఎవరి దగ్గరకు ఎవరు వచ్చి అడ్డుక్కున్నారో ఆయన గుర్తుపెట్టుకోవాలి. నమ్మకద్రోహం చేసిన భాజపా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం.

ప్రజలే వీరి తలుపులు మూసేస్తారు. ఇంత అహంకారంతో మాట్లాడటం మంచిదికాదు. 2014కు ముందు ఆయన ఎక్కడకున్నాడు? ఆయన చరిత్ర ఏమిటి? తగిన సమయంలో చెబుతాను.

రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక బెదిరించే ధోరణిలో మాట్లాడితే ఇక్కడ భయపడేవారెవ్వరూ లేరు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారు కాబట్టే మేం తిరుగుబాటుచేశాం. అవినీతి పార్టీ మిమ్మల్ని కాపాడుతుందనుకుంటే అది మీ భ్రమ అన్నార''ని ఆ కథనంలో తెలిపారు.

బాబుకు తలుపులు మూసేశాం: అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలని, 2019లో ప్రధాని నరేంద్రమోదీ మళ్లీ గెలిచాక మరోసారి భాజపాతో భాగస్వామ్యం కోసం అర్రులు చాచడం ఖాయమని.. కానీ, ఆయనకు భాజపా తలుపులు శాశ్వతంగా మూసుకున్నాయని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారని 'ఈనాడు' కథనంలో పేర్కొన్నారు.

''సోమవారం విజయనగరంలో జరిగిన ఉత్తరాంధ్ర పార్లమెంటు నియోజకవర్గాల భాజపా 'శక్తి కేంద్రాల ప్రముఖుల' సభలో మాట్లాడిన అమిత్ షా.. ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో చంద్రబాబు జత కట్టారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లులోని 14 అంశాల్లో ఇప్పటికే 10 నెరవేర్చేశామని, మిగిలినవి నాలుగు మాత్రమేనన్నారు.

చంద్రబాబుకి అవినీతితోనే సంబంధముందని, అభివృద్ధితో కాదని అమిత్‌షా ఆరోపించారు. పోలవరం, అమరావతి... ఇలా ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుందన్నారు. ఇప్పటివరకూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నా ప్రజలు దాన్ని స్వాగతించట్లేదన్నారు. వైకాపా, తెదేపాలు రెండింటిలోనూ కుటుంబ పాలన కొనసాగుతోందని చెప్పారు. రెండూ తీవ్ర అవినీతిలో కూరుకుపోయాయని విరుచుకుపడ్డారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం ఖూనీ: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని 'సాక్షి' కథనం వెల్లడించింది.

''కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో సమావేశం అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 2018 సెప్టెంబర్‌ నాటికి 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 59.18 లక్షలకు చేరింది. రాష్ట్రంలోని మొత్తం 3.69 కోట్ల మంది ఓటర్లలో 59.18 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారు. దాదాపు 60 లక్షల నకిలీ ఓట్లలో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ నమోదు చేసుకున్న ఓట్లు 20 లక్షల దాకా ఉన్నాయి. దాదాపు మరో 40 లక్షల ఓట్లు ఏపీలోనే రెండు చోట్లా నమోదయ్యాయి. ఇలా నకిలీ ఓట్లను ఎక్కడెక్కడ నమోదు చేశారన్న విషయాలను ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి సమర్పించాం. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు నకిలీ ఓట్లను సృష్టిస్తూనే మరోవైపు వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను సర్వేల పేరుతో జాబితా నుంచి అక్రమంగా తొలగిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులైన 4 లక్షల మంది ఓట్లను తొలగించారు. ప్రజా సాధికార సర్వే, పరిష్కార వేదిక, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్, పిరియాడిక్‌ సర్వేల పేరుతో విపక్ష మద్దతుదారుల వివరాలు తెలుసుకుని వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఈ తొలగింపు ప్రక్రియకు ఒక యాప్‌ను కూడా క్రియేట్‌ చేశారు. ఆధార్‌కార్డు, ఓటరు కార్డులను లింక్‌ చేస్తూ ఓట్లను తొలగిస్తున్నారు. ఈ విషయాలన్నిటినీ ఆధారాలతో సహా ఈసీ దృష్టికి తెచ్చాం.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా జరగాలంటే డీజీపీ ఠాకూర్, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, లా అండ్‌ ఆర్డర్‌ కో ఆర్డినేషన్‌ డీఐజీ శ్రీనివాస్‌‌లను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని కోరామని జగన్ చెప్పారంటూ ఆ కథనంలో తెలిపారు.

మమతపై మౌనమేల కేసీఆర్‌?: విజయశాంతి

ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మద్దతు కోరిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు ఆమెకు మద్దతివ్వకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి ప్రశ్నించారంటూ 'ఆంధ్రజ్యోతి' తన వార్తాకథనంలో తెలిపింది.

''ప్రధాని మోదీ తప్పులను కేసీఆర్‌.. కేసీఆర్‌ తప్పులను మోదీ దాస్తున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీకి మద్దతిచ్చే ప్రయత్నాల్లో కేసీఆర్‌ ఉన్నారన్నారు. కేసీఆర్‌ బీజేపీకి బీ-టీంలా వ్యవహరిస్తున్నారని వీహెచ్‌ విమర్శించారు'' అని కథనంలో పేర్కొన్నారు.

పెరుగుతున్న బంగారం ధర

పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.340 పెరిగి రూ.34,450 పలికిందని 'నమస్తే తెలంగాణ' పత్రిక కథనం వెల్లడించింది.

''దేశీయంగా ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మద్దతు పలకడం వల్లే ధరలు ఎగువముఖం పట్టాయని ఆల్ ఇండియా సరాఫ అసోసియేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పసిడితోపాటు వెండి మరింత బలపడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో కిలో వెండి ధర రూ.130 అందుకొని రూ.41,530గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు పెద్దగా డిమాండ్ లేకపోయినప్పటికీ దేశీయంగా ధరలు పెరుగడం విశేషం. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,312.20 డాలర్లు పలుకగా, వెండి 15.83 డాలర్ల వద్ద ఉంది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)