You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తూర్పు గోదావరి జిల్లా: కొబ్బరి చెట్టెక్కిన చిరుత తప్పించుకుంది
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ ప్రాంతంలో సోమవారం నాడు చిరుతపులి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. జనం మీద దాడి చేసి ఆ తరువాత కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చున్న చిరుతపులి తప్పించుకుని పారిపోయింది.
దాంతో, ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ, అంకం పాలెం, లక్ష్మీపోలవరం గ్రామల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గరువుతున్నారు. తప్పించుకుని పారిపోయిన చిరుతపులి మళ్ళీ ఏ క్షణాన దాడి చేస్తుందోనని హడలిపోతున్నారు.
చిరుతపులి తప్పించుకుపోవడానికి కారణం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అయితే, డిఎఫ్ఓ అనంత్ శంకర్ మాత్రం, "చిరుత దొరికే వరకూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది" అని అన్నారు.
ఫారెస్ట్ సిబ్బంది, విశాఖ జూ అధికారులు మొత్తం 110 మంది చిరుతను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. చిరుత సంచారంతో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది.
అసలేం జరిగింది...
ఆత్రేయపురం మండలం అంకంపాలెం ప్రాంతానికి సమీపంలో సోమవారం నాడు ఒక చిరుతపులి హఠాత్తుగా దాడి చేయడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. మధ్యాహ్నం పొలంలో పనిచేసుకుంటున్న గ్రామస్తులపై చిరుత దాడికి పాల్పడింది. దాంతో నలుగురికిరంపై గాయాలయ్యాయి.
అంకంపాలెం, ర్యాలి గ్రామాల మధ్యలో కొంతమందిపై దాడి చేసిన చిరుత, ఆ తర్వాత కొబ్బరి చెట్టెక్కింది. దీంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆ చెట్టు దగ్గరకు చేరుకుని, సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు.
అసలు ఇక్కడకు చిరుత ఎలా వచ్చింది?
గోదావరి తీరంలో ఉన్న ఈ ప్రాంతానికి చిరుత ఎలా వచ్చిందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అటవీ ప్రాంతం నుంచి నదీ మార్గంలో చేరి ఉంటుందని అనుకుంటున్నారు. గతంలో కూడా రాజమహేంద్రవరం సహా పలు ప్రాంతాల్లో ఇదే రీతిలో చిరుతలు ప్రవేశించిన అనుభవాలున్నాయి. వాటిని పట్టుకున్న అటవీ శాఖ అధికారులు జంతు ప్రదర్శనశాలకు తరలించారు.
చిరుతని చూడగానే ఒక్కసారిగా భయపడ్డానని అంకంపాలెం గ్రామానికి చెందిన రమణ చెబుతున్నారు. తాను పొలం నుంచి తిరిగి వస్తుండగా గట్టు మీద తనకు చిరుత కనిపించిందన్నారు. వెంటనే కేకలు వేయడంతో తన మీద దాడి చేయగా, స్వల్పగాయాలతో బయటపడ్డానని తెలిపారు.
చిరుతపులి సంచారం గురించి తమకు సమాచారం అందిందని, దాన్ని పట్టుకునేందుకు తగిన నైపుణ్యం కలిగిన సిబ్బందిని, అవసరమైన సామగ్రిని పంపించామని తూర్పు గోదావరి జిల్లా ఫారెస్ట్ అధికారి నందినీ సలారియా చెప్పారు. చిరుతను సురక్షితంగా పట్టుకుంటానేందుకు ప్రయత్నిస్తామని, విశాఖ జూ నిర్వాహకులకు కూడా సమాచారం అందించామని తెలిపారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)